గతంలో పెళ్లికి ముందు ప్రేమ ఎలా ఉండేదో, నేటితరం యువత ఆ ప్రేమకు ముందు డేటింగ్ అంతే అవసరమంటోంది. అలాంటి వారి కోసం విస్తృతంగా డేటింగ్ యాప్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యువకుడు కూడా తనకెంతో ఇష్టమైన అమ్మాయిని డేటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే అందరిలా కాకుండా ఓ కొత్త పంథాను ఎంచుకున్నాడీ ప్రేమికుడు.

ప్రేమలో పడేసేందుకు!
సాధారణంగా ఏ సంస్థలోనైనా మనకు ఉద్యోగం కావాలంటే రెజ్యుమె పంపిస్తాం. మన విద్యార్హతలు, హాబీలు, పని అనుభవం, మన అచీవ్మెంట్స్ తదితర విషయాలన్నీ అందులో పొందుపరుస్తాం. ఇలా జాబ్ కోసం పంపాల్సిన రెజ్యుమెను తనకెంతో ఇష్టమైన అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు వినియోగించాడు అమెరికాకు చెందిన జేమ్స్. ఇందులో భాగంగా తన హైట్, బరువు, కలర్, హాబీలు, పాత గర్ల్‌ఫ్రెండ్స్ తదితర వివరాలన్నింటినీ జత చేసి తను ప్రేమిస్తున్న అమ్మాయికి పంపాడు. అయితే ఆ అమ్మాయి ఆ రెజ్యుమెను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.

నాలుగేళ్లుగా తెలుసు కానీ..!
ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్‌డిగో వర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తున్నాడు జేమ్స్. అతడు అదే యూనివర్సిటీలో చదువుతున్న ‘క్రిస్టీ ’ అనే ఓ అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడన్న మాటే కానీ ఇంతవరకు తన ప్రేమ విషయం క్రిస్టీకి చెప్పలేకపోయాడు జేమ్స్. ఈనేపథ్యంలోనే అతడి కోర్సుకి సంబంధించిన చివరి సెమిస్టర్ కూడా త్వరలోనే పూర్తికానుండడంతో మరింత ఆందోళన చెందాడు జేమ్స్. దీంతో ఎలాగైనా తన ప్రేమ విషయం క్రిస్టీకి చెప్పాలనుకున్నాడు. ఎలాగో ఒకసారి ధైర్యం చేసి ఆమెను డేటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే జేమ్స్ ఆహ్వానం అందుకున్న క్రిస్టీ అతనికో ఫన్నీ కండిషన్ పెట్టింది. ఇందులో భాగంగా తనతో డేటింగ్ చేయాలనుకుంటే తనకో కవర్లెటర్ను పంపించమని కోరింది. అయితే ఏకంగా తన రెజ్యుమెను క్రిస్టీకి పంపించాడు జేమ్స్.
నీతో డేటింగ్ చేద్దామని!
సాధారణంగా రెజ్యుమెలో విద్యార్హతలు, అదనపు స్కిల్స్, పని అనుభవం, హాబీలు, అచీవ్మెంట్స్ తదితర విషయాలుంటాయి. ఈ క్రమంలో తన డేటింగ్ రెజ్యుమెను కూడా అలాగే ప్రిపేర్ చేశాడు జేమ్స్. డేటింగ్ చేయడానికి తనకున్న అర్హతలు, చదువు, బరువు, ఎత్తు, హాబీలు, పాత గర్ల్‌ఫ్రెండ్స్ తదితర వివరాలన్నింటినీ అందులో పొందుపరచాడు. ఇందులో భాగంగా ప్రారంభంలో ‘ఆబ్జెక్టివ్’ ఆప్షన్లో ‘నాలుగేళ్లుగా నిన్ను చూస్తునే ఉన్నా కానీ, ఎప్పుడూ నీతో మాట్లాడలేదు. ఇప్పుడు నా కోర్సు లాస్ట్ సెమిస్టర్ కూడా పూర్తి కావొచ్చింది. అందుకే నీతో డేటింగ్ చేద్దామని అనుకుంటున్నా. అయితే నిన్ను రిలేషన్‌షిప్‌లోకి లాగే ఉద్దేశం నాకే మాత్రం లేదు’ అని సూటిగా తన లక్ష్యమేంటో చెప్పుకొచ్చాడీ ప్రేమికుడు.

మా అమ్మ అందమే నాది!
ఇక డేటింగ్ అర్హతల్లో భాగంగా తనది చాలా ఫన్నీ క్యారక్టర్ అని రాసుకొచ్చాడు జేమ్స్. ఈ క్రమంలో ‘ మనం ఓ స్ర్తీని నవ్వించగలిగితే చాలు...ఆమెకు ఏదైనా సాధించే శక్తిని ఇచ్చినట్టే’ అన్న మార్లిన్ మన్రో వ్యాఖ్యలను గుర్తు చేశాడు . ‘నేను చాలా ఫన్నీగా ఉంటాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలను. ఇక నేను కూడా అమ్మ చాటు బిడ్డనే. తన అందమే నాకు వచ్చిందనుకుంటా. అందుకే నేను కూడా చాలా అందంగా ఉంటాను. గుడ్ లుకింగ్ హెయిర్‌స్టైల్‌తో చాలా స్మార్ట్‌గా ఉంటాను’ అని రాసుకొచ్చాడు.
ఈ క్రమంలో ‘ఒక మగాడు తన అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తన భార్యను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు’ అన్న వ్యాఖ్యలను మరోసారి కోట్ చేశాడు జేమ్స్. అదేవిధంగా అమ్మాయిల పట్ల ఎంతో గౌరవంగా ఉండాలని తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేశాడు. ‘ మా అమ్మ అమ్మాయిలతో ఎలా మెలగాలో నాకు చిన్నప్పటి నుంచే నేర్పించింది. అందుకే నేను ఇప్పటివరకు ఒక అమ్మాయితో కూడా తప్పుగా ప్రవర్తించలేదు. కావాలంటే రిఫరెన్స్’లో పొందుపరిచిన నా పాత గర్ల్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడండి’ అని తన ముగ్గురి గర్ల్‌ఫ్రెండ్స్ పేర్ల వివరాలు కూడా అందులో జత పరిచాడు జేమ్స్.

డేటింగ్ చేయచ్చు!
వీటితో పాటు తనకు సంబంధించిన పలు వివరాలు రెజ్యుమెలో పొందుపరిచి క్రిస్టీకి పంపించాడు జేమ్స్. అయితే దీనిని ఆమె సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈక్రమంలో కొంతమంది ‘జేమ్స్ నిజాయతీకి హ్యాట్సాఫ్. అతనితో డేటింగ్ చేయచ్చు, పెళ్లి కూడా చేసుకోవచ్చు’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో ‘ రిఫరెన్స్‌లో ఇచ్చిన అమ్మాయిలతో మాట్లాడి అతని గురించి పూర్వాపరాలు తెలుసుకుంటే మంచిది’ అని మరికొందరు ఆమెకు సలహాలిస్తున్నారు.
Representative Photos