‘ఒక్కరు ముద్దు..ఇద్దరు వద్దు’ పిల్లల విషయంలో ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు అనుసరిస్తున్న సూత్రం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఒకరిద్దరు పిల్లలను పెంచడానికే తల్లిదండ్రులు ఆపసోపాలు పడుతున్నారు. ఈక్రమంలో కొందరు దంపతులు ఒకరిద్దరు పిల్లలకే పరిమితమైపోతుంటే మరికొన్ని జంటలు ఇప్పుడే పిల్లలెందుకని గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ 22వ సారి తల్లి కాబోతోంది. ఇంతకీ ఎవరా మహిళ? వివరాల్లోకి వెళ్తే..!
మరోసారి తల్లిని కాబోతున్నా!
బ్రిటన్‌లోని లాంక్షైర్లో నివసిస్తున్న స్యూర్యాడ్ఫోర్డ్ ప్రస్తుత వయసు 44 సంవత్సరాలు. అతి పిన్న వయసులోనే నోయెల్‌తో పెళ్లిపీటలెక్కిన ఆమె 13 ఏళ్ల వయసులోనే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటివరకు మొత్తం 21 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో బ్రిటన్‌లోనే అతి పెద్ద కుటుంబంగా గుర్తింపు పొందిన స్యూర్యాడ్ఫోర్డ్ కుటుంబంలోకి త్వరలోనే మరో పాపాయి రానుంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీ అయిన ఆమె ఇటీవల తాను మరోసారి తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదే చివరి సంతానమని చెప్పి!
పవన్‌కల్యాణ్, భూమిక జంటగా నటించిన 'ఖుషి' సినిమా గుర్తుందా? ఆ సినిమా క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లకు పదిహేడు మంది పిల్లలు పుడితేనే.. వామ్మో ఇంతమంది పిల్లలా..? అని నోరెళ్లబెట్టాం. అసలు ఇలాంటివి జరుగుతాయా? అన్న అనుమానం కూడా వచ్చింది. అయితే గతేడాది మహారాష్ర్టకు చెందిన 38 ఏళ్ల లంకాబాయి 20 వసారి గర్భం దాల్చి వైద్యులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక గత ఏడాది అక్టోబర్‌లో ఉగాండాకు చెందిన మరియం నబాటాంజి 36 ఏళ్ల వయసులో 44వ పిల్లాడికి జన్మనిచ్చి వైద్య ప్రపంచాన్నే విస్మయపరిచింది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన స్యూర్యాడ్ఫోర్డ్ కూడా ఇప్పటివరకు 21 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 2018లో 21 వ బిడ్డకు జన్మనిచ్చిన స్యూ దంపతులు ఆ సమయంలో అదే తమ చివరి సంతానమని అధికారికంగా ప్రకటించారు. అయితే తన పిల్లల సంఖ్య సరి సంఖ్యగా ఉండాలని భావించిన ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరితో పంచుకుని మురిసిపోయిందీ సూపర్ మామ్.
త్వరలోనే మరో పాపాయి!
ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉన్న స్యూ తాజాగా ఓ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంది. అదేవిధంగా స్కానింగ్‌లో తనకు ఆడబిడ్డ పుట్టబోతోందని తెలుసుకుని ఆ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంది ‘ కొన్ని రోజుల ముందు నా బేబీ బంప్ మరీ చిన్నగా ఉండేది. దీంతో నా గర్భంలో పాప సరిగా పెరగడం లేదని ఆందోళన చెందాను. అయితే ప్రస్తుతం నా బేబీ అద్భుతంగా పెరుగుతోంది. చాలా చురుకుగా అటూ ఇటూ కదులుతోంది. ఇక నిద్రపోతున్నప్పుడు గర్భంలో నా పాప కదలికలు నాకెంతో ఆనందాన్నిస్తున్నాయి. ప్రస్తుతం నా పాప బరువు సుమారు 3.3 పౌండ్లు (1.5 కేజీలు). ఆరోగ్యపరంగా చూస్తే నా బేబీ చాలా సమతూకంతో ఉంది. ఇంకా తను నా గర్భంలో చాలా రోజులుంటుంది. కాబట్టి తన బరువు ఇంకా పెరగొచ్చు. వైద్యులు నన్ను పరీక్షించి డెలివరీ తేదీ కూడా ప్రకటించారు. నేను ఆ తేదీని అందరితో షేర్ చేసుకోలేను. కానీ త్వరలోనే మా బేబీ మా కుటుంబంలోకి అడుగుపెట్టనుంది’ అని అందులో చెప్పుకొచ్చింది స్యూ ర్యాడ్‌ఫోర్డ్.
బేకరీ వ్యాపారమే ఆధారం!
ఇప్పటివరకు 21 మంది సంతానంతో బ్రిటన్‌లోనే అతిపెద్ద ఫ్యామిలీగా ప్రత్యేక గుర్తింపు పొందారు స్యూ-నోయెల్ దంపతులు. బేకరీ వ్యాపారం నిర్వహిస్తున్న ఈ జంట తమ పిల్లలతో కలిసి ఓ పది గదుల భవనంలో నివాసముంటున్నారు. ఇక 13 ఏళ్ల వయసులో మొదటిసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్యూకు 2008లో 13 వ బిడ్డ పుట్టింది. అప్పుడే వీరి గురించి మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో ‘బేకర్స్ డజన్’ అంటూ వారిని చాలామంది ఆట పట్టించారు. అయితే వాటినేమీ పట్టించుకోకుండా 22వ సారి తల్లికాబోతోందీ సూపర్ మామ్. ఆమె రెండో కూతురు 25 ఏళ్ల సోఫీకి కూడా ముగ్గురు పిల్లలుండడం విశేషం.