ఎవరి జీవితంలోనైనా పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వందేళ్ల జీవిత ప్రయాణంలో వివాహం అనేది ఒక మలుపులా భావిస్తుంటారు. భాష, దేశం, సంప్రదాయాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా వివాహానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఎవరి స్థాయి, హోదాకు తగినట్లు వారు వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈక్రమంలోనే రోటీన్‌కు భిన్నంగా జరిగే కొన్ని వివాహ వేడుకలు ప్రపంచాన్ని తమవైపు తిప్పుకుంటాయి. తాజాగా మలేషియాకు చెందిన ఓ జంట వివాహ వేడుకల్లో ఏర్పాటు చేసిన ‘కేక్’ ఇలాగే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ కేక్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మరి ఆ కేక్‌లో అంతలా ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి..
వివాహ వేడుకల్లో కేక్ కట్ చేయడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. నిశ్చితార్థం నుంచి మొదలు పెడితే పెళ్లి, రిసెప్షన్ రోజు పార్టీలో కూడా కేక్ కట్ చేస్తున్నారు కొత్త జంటలు. అయితే సహజంగా ఎవరైనా కేక్‌ను టేబుల్ పైన పెట్టి కట్ చేస్తారు.. ఇది మనందరికీ తెలిసిందే. అయితే మలేషియాకు చెందిన ఈ సెలబ్రిటీ జంట అందరిలా కాకుండా భిన్నంగా కేక్‌ను కట్ చేసింది.
‘సినీ’ ప్రేమజంట..
మలేషియాకు చెందిన జహిరా మ్యాక్విల్సన్, ఇమాన్ హకిమ్ రిడ్జాలు ఆ దేశానికి చెందిన సినీతారలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో వివాహం మరుసటి రోజు గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేశారు.
రొటీన్‌కు భిన్నంగా..
తమ రిసెప్షన్లో భాగంగా కౌలాలంపూర్‌లోని ‘లిలీ అండ్ లోలా’ అనే ప్రముఖ బేకర్స్‌కు కేక్‌ను ఆర్డర్ చేశారు. రిసెప్షన్ పార్టీ మొదలైంది.. వధూవరులిద్దరూ కేక్ కట్ చేయడానికి స్టేజ్ పైకెక్కారు. కాసేపటికే పైనుంచి ధగధగా మెరుస్తూ ఓ కేక్ నెమ్మదిగా కిందికి దిగింది. కేక్ కిందికి దిగడమేంటి.. అని ఆలోచిస్తున్నారా? అచ్చం షాండ్లియర్‌ను పోలి ఉన్న ఈ కేక్‌కు చుట్టూ బీడ్స్‌తో అలంకరణ చేయడంతో ఆ లైట్లకు కేక్ మరింతగా మెరిసిపోయింది. ఇలా షాండ్లియర్‌ను తలపిస్తూ వేలాడే ఈ కేక్‌ను.. ఆ కొత్త జంట కట్ చేసి ఒకరికొకరు ప్రేమగా తినిపించుకున్నారు. సాధారణంగా కేక్‌ను కాస్త ఏటవాలుగా ఉన్న తలంపై ఉంచితేనే అది పడిపోతుంది.. అలాంటిది తలకిందులుగా వేలాడదీస్తే చెక్కుచెదరనంత నైపుణ్యంతో తయారుచేసిన ఈ కేక్‌ను చూసి నూతన వధూవరులే కాదు.. అక్కడికొచ్చిన అతిథులూ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇలాంటి అద్భుతమైన కేక్‌ను తయారుచేయడానికి దాదాపు వారానికిపైగా కష్టపడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కేక్ తయారీదారులు ఈ వేడుకకు సంబంధించిన వీడియోను, కేక్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది ఇప్పటి ఆలోచన కాదు..
ఇక ఈ వినూత్న కేక్‌కు రూపకల్పన చేసిన ‘లిలీ అండ్ లోలా’ బేకర్స్ సంస్థ యజమాని లిలీ ఉస్మాన్ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘నిజానికి ఈ కేక్ తయారీ ఆలోచన ఈనాటిది కాదు.. 2017లో నా సోదరి అల్యా ఈ ఐడియాను నాతో పంచుకుంది. కానీ ఇన్ని రోజులకు జహిరా, ఇమాన్ వివాహ వేడుకలతో ఇది కార్యరూపం దాల్చింది. ఈ కేక్‌ను తయారుచేయడానికి మాకు వారం రోజుల సమయం పట్టింది. ఇక దీన్ని వేలాడదీయడానికి గంటకు పైగా సమయం తీసుకుంది. ఇది కార్యరూపం దాల్చడంలో వెడ్డింగ్ ప్లానర్స్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇలాంటి వేలాడే కేక్ ఐడియా గురించి చెప్పినప్పుడు మొదట ఈ జంట ఆశ్చర్యపోయింది. కానీ మాపై నమ్మకం ఉంచి ఈ కేక్ ఐడియాకు ఒప్పుకున్నందుకు కొత్త జంటకు కృతజ్ఞతలు..’ అని చెప్పుకొచ్చాడు.
వివాహ వేడుకలూ వైవిధ్యమే...
రిసెప్షన్లో వేలాడే కేక్‌ను కట్ చేస్తూ ఆకట్టుకున్న ఈ సెలబ్రిటీ జంట.. తమ వివాహ వేడుకను కూడా విభిన్నంగా జరుపుకొంది. ఫంక్షన్ హాల్లో రాళ్లు, చెట్లను పోలిన సెట్టింగ్‌తో రూపొందించిన వేదికపై ఉంగరాలు మార్చుకున్నారీ లవ్లీ కపుల్. మరి, ఈ రిచెస్ట్ కమ్ డిఫరెంట్ పెళ్లి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..
విభిన్న కేక్‌లకు పెట్టింది పేరు..!
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు చెందిన ‘లిలీ అండ్ లోలా’ బేకర్స్ సంస్థ విభిన్న కేక్స్ తయారుచేయడంలో దిట్ట. ఈ క్రమంలో వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగానే కాకుండా.. తమ సృజనాత్మక ఆలోచనలకు రూపమిస్తూ విభిన్నంగా తయారుచేసిన అలాంటి కొన్ని టేస్టీ అండ్ అట్రాక్టివ్ కేక్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా..??