ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ వ్యాధి 25కు పైగా దేశాలకు వ్యాపించింది. కేవలం చైనాలోనే ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే 2600 మంది బలయ్యారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా సహా ఇతర దేశాల ప్రభుత్వాలు సైతం అత్యవసర చర్యలు చేపట్టాయి. సరైన జాగ్రత్తలు లేనిదే ఇంటి నుంచి బయటకు రాకూడదని, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణం చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రజలు కూడా ఈ సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలో చైనా, సిడ్నీ దేశాల్లో జరిగిన రెండు సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి అవేంటో మీరే చూడండి.
ఈ తల్లి ఆలోచనకు హ్యాట్సాఫ్..!
‘ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధుడు లేడు..!’ - ‘కేజీఎఫ్’ సినిమాలో హీరో చెప్పిన ఈ డైలాగ్‌ను మనమంతా వినే ఉంటాం. ఈ మాట అక్షర సత్యమని తల్లి ప్రేమ గురించి తెలిసిన ఎవరైనా చెబుతారు. తన విషయంలో చిన్న చిన్న సమస్యలకు కూడా భయపడే తల్లి.. తన పిల్లల విషయానికి వచ్చేసరికి ఎంత పెద్ద సమస్యతోనైనా సరే.. ప్రాణాలకు తెగించి పోరాడడానికి సిద్ధపడుతుంటుంది. తన పిల్లలకు మేలు జరుగుతుందని అనిపిస్తే చాలు తన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు అన్నీ కూడగట్టుకొని ఆ పని ఎంత కష్టంతో కూడుకున్నదైనా సమర్థంగా పూర్తి చేస్తుంది. ఇలా బిడ్డలపై తల్లికి ఉండే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలో ఇటీవలే చైనాలో జరిగిన ఓ సంఘటన బిడ్డ శ్రేయస్సు కోసం ఓ తల్లి పడే ఆరాటానికి అద్దం పడుతుంది.

చైనాలో కరోనా విజృంభణను అదుపు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి విద్యాసంస్థలు మూసివేసి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా శిక్షణను అందిస్తున్నారు. అయితే చైనాలో హుబీ అనే గ్రామానికి చెందిన ఓ మాతృమూర్తి తన ఏడేళ్ల కూతురి చదువు కోసం ఓ వినూత్న ప్రయత్నం చేసింది.

బీ మెంగ్కీ అనే ఈ చిన్నారి ప్రతిరోజూ ఆన్లైన్లో క్లాసులు వినాల్సి ఉంటుంది. కానీ, తన ఇంట్లో ఇంటర్నెట్ తక్కువ వేగంతో పనిచేస్తుండడం వల్ల బీకి ఆన్లైన్లో క్లాసులు వినడం ఇబ్బందికరంగా మారింది. పోనీ బయటకు ఎక్కడికైనా వెళ్దామనుకుంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర నుంచి కరోనా సోకుతుందోనని భయం. ఇలాంటి పరిస్థితుల్లో బీ తల్లికి ఓ ఆలోచన వచ్చింది. ఆమె తన సెల్‌ఫోన్ తీసుకొని తన ఊరిలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కడ ఎక్కువగా వస్తోందో అని వెతుకుతూ.. చివరికి ఓ చోటును కనుగొంది.
ఆ తర్వాత తన చిన్నారి చదువుకోవడానికి వీలుగా బొంగు కర్రలు, పెద్ద ప్లాస్టిక్ కవర్లతో అక్కడ ఓ చిన్న టెంట్‌ను నిర్మించింది. తన కూతురితో పాటు తను కూడా రోజూ ఇక్కడికి వచ్చి బీకి తోడుగా టెంట్లో గడుపుతోంది. టెంట్ లోపల కూడా పొరపాటున ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ సోకకుండా తల్లీబిడ్డలిద్దరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తన బిడ్డ చదువుకు ఆటంకం కలగకుండా ఈ తల్లి చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

కరోనా మిమ్మల్ని విపరీతంగా భయపెడితే..!
ఇక రెండో సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. సిడ్నీ నుంచి హామిల్టన్ దీవికి వెళ్లే విమానంలో ఇద్దరు ప్రయాణికులు ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజులతో పాటు.. శరీరాన్ని పై నుంచి కింది వరకు పూర్తిగా ప్లాస్టిక్ సూట్‌తో కప్పేసుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తోన్న అలిసా అనే యువతి వీళ్లిద్దరినీ వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేసింది. తను ఈ వీడియోను షేర్ చేస్తూ ‘వీళ్లు ప్రస్తుతం విమానంలో నా వెనుక ఉన్నారు. కరోనా మిమ్మల్ని విపరీతంగా భయపెడితే..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
కరోనా ధాటికి ప్రతిరోజూ వివిధ దేశాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం, అవి కాస్తా ఇంటర్నెట్లో వైరల్‌గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వైరస్ వైరల్ అవడం ఏమో గానీ అది ఎప్పుడు సమూలంగా నాశనమవుతుందోనని చైనాతో పాటు అన్ని దేశాలూ కళ్లలో వత్తులేసుకొని మరీ ఎదురుచూస్తున్నాయి.. ఆ శుభతరుణం ఎప్పుడొస్తుందో? ఏమో..?!