సమానత్వం అంటే స్వేచ్ఛ. అందరికీ అన్ని విషయాల్లో అనుకున్నది సానుకూలంగా చేయగలిగిన స్వేచ్ఛ. అయితే చాలామంది లింగ భేదం లేని సమాజం అంటే స్త్రీల హక్కుగా భావిస్తుంటారు. అనాదిగా పురుషాధిక్యం నీడలో స్త్రీల హక్కులు అణచివేయడం వల్ల స్త్రీలు పురుషులతో సమానంగా నడవాలనేది సమసమాజ ఉద్దేశంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు ఈ సమసమాజ పోరాటం ‘హ్యూమన్ ఫైట్’గా కాకుండా... ‘ఫీమేల్ ఫైట్’ అయిపోయింది. వాస్తవానికి ఇది అందరి బాధ్యత. అందరూ కలిసి ఉద్యమిస్తేనే సమసమాజ స్థాపన సాధ్యపడుతుంది. లేదంటే ఇంకా వందేళ్లైనా ఈ లింగభేదం లేని సమాజం కష్టం. ఇలా అంటోంది ఎవరో కాదు ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) చేసిన సర్వేనే ! ప్రపంచవ్యాప్తంగా ఇంకా 99.5 సంవత్సరాలైతే కానీ లింగ సమానత్వం రాదట. అంతేకాదు, మన భారతదేశం లింగ సమానత్వంలో ఏడాదికేడాది దిగజారుతోందట. మన తరం, మన పిల్లల తరం, ఆ తర్వాతి తరానికి కూడా లింగ భేదం లేని సమాజం సాధ్యం కాకపోవచ్చు అంటోంది ! మరి అందుకు కారణం ఏంటో చూద్దాం పదండి !

ఆరంభం నుంచి అంతే !
2006 నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వివిధ దేశాల్లో లింగ సమానత్వం ఎంతవరకు సాధ్యమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ఇటీవల రూపొందించిన జాబితాలో భారతదేశం 98వ స్థానంలో ఉండగా, చాలా దేశాలు పురోగతి సాధిస్తోందా భారతదేశం మటుకు మరికొన్ని దేశాలతో తిరోగమనం వైపు అడుగులు వేస్తూ వస్తోంది. 2018లో 108 వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పటివరకు ప్రకటించిన 2019 జాబితాలో 112 వ స్థానంలో నిలిచింది. ఈక్రమంలో ఒక్క ఉద్యోగ రంగంలోనైనా పురోగతి సాధిస్తుందా అంటే.. అదీ లేదట. భారతదేశం 2276 వ సంవత్సరం వరకు కూడా ఉద్యోగ రంగంలో ఆడ, మగ మధ్య అసమానతలను తొలగించడం కష్టం అని పేర్కొంది.
అంతేకాదు, 153 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో ఆరోగ్యం విషయంలో భారత్ 150 వ స్థానంలో ఉండగా... విద్యావకాశాల్లో 112 వ స్థానం, ఆర్థిక విభాగంలో 149 వ స్థానంలో నిలిచింది. అయితే అటు పాకిస్థాన్, యెమెన్, ఇరాక్ వంటి దేశాలతో పోలిస్తే మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడంలో కాస్త మెరుగుపడిందనిపించుకుంది. మన దేశంలో 34.5 శాతం మంది మహిళలకు ఆర్థిక అవకాశాలు లభిస్తున్నాయి. 2008లో మహిళలకు ప్రత్యేక హోదా కల్పించాలని భారత ప్రభుత్వం ‘విమెన్స్ రిజర్వేషన్ బిల్లు’ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందకపోగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం దేశంలోని కంపెనీలలో మహిళలకు అత్యంత తక్కువగా 13.8 శాతం మాత్రమే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని తేలింది.

ఇవి ఎందుకు ‘టాప్’లో ఉన్నాయి?
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ జాబితాలో వంద శాతం సమానత్వాన్ని సాధించిన దేశాలు ఐస్‌ల్యాండ్, నార్వే. 2018లో కూడా ఈ రెండు దేశాలు 1,2వ స్థానాల్లోనే కొనసాగాయి. అయితే ఇటీవలే యంగెస్ట్ పీఎంగా కీర్తి సాధించిన సనా మారిన్ నేతృత్వంలోని ఫిన్‌ల్యాండ్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 3 వ స్థానానికి ఎగబాకడం విశేషం. ప్రస్తుతం సనా తీసుకొస్తున్న మార్పులు చూస్తుంటే ముందుముందు మొదటి రెండు స్థానాల్లో నిలిచినా ఆశ్చర్యం లేదు. మరి మహిళల హక్కులను కాపాడి లింగసమానత్వం కోసం కృషి చేస్తున్న టాప్ 10 దేశాలు మహిళల కోసం ఏం చేస్తున్నాయో ఓసారి చూద్దాం !
ఐస్‌ల్యాండ్
ఐస్‌ల్యాండ్‌లో మహిళలు అనాది కాలం నుంచి సాధికార బాటలోనే పయనిస్తున్నారు. పూర్వకాలం నుంచి కూడా ఇంటి బాధ్యతలో చాలావరకు స్త్రీలదే అధిక భాగం. వ్యవసాయం నుంచి ఇల్లు కట్టడం, వేటాడడం వంటి పనులను కూడా వారు మగవారితో సమంగా పంచుకునేవారు. చాలా దేశాల్లో అక్కడ ఏ పనికైనా ఆడ, మగ అన్న తేడాను తీసుకురారు. ఈ ఒరవడే ప్రస్తుతం ఐస్‌ల్యాండ్‌లో మహిళలు సాధికారత సాధించడానికి వీలుపడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఐస్‌ల్యాండ్ ప్రభుత్వం తమ దేశ స్త్రీలకు అన్నింట్లో సమ ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రతి యూనివర్సిటీ నుంచి దాదాపు 66 % మంది అమ్మాయిలు గ్రాడ్యుయేట్లుగా వస్తున్నారు. దేశంలోని 62 మంత్రుల్లో 30 మంది మహిళా మంత్రులే అంటే రాజకీయంలోనూ మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక వివిధ కంపెనీల్లో అటు నాయకత్వం, ఇటు వృత్తి నైపుణ్యం కనబరుస్తున్న మహిళలు 80 శాతం ఉన్నారు. ఇలా అన్ని రంగాల్లో సమానత్వం పాటిస్తోంది కాబట్టే ఐస్‌ల్యాండ్ 11 ఏళ్లుగా నం 1గా నిలుస్తూ వస్తోంది.

నార్వే
ఏ దేశమైనా మహిళల హక్కుల కోసం చట్టాలు చేశామనీ, పరిస్థితులను బట్టి వాటిని సవరించామని చెబుతుంటాయి. కానీ అవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించవు. నార్వే ఇలా కాకుండా ‘ది జెండర్ యాక్షన్ ప్లాన్’ అనే ప్రణాళికను రూపొందించి మహిళా సాధికారతను మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తోంది. ఈ యాక్షన్ ప్లాన్‌ను రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత, లైంగిక-సంతానోత్పత్తి హక్కులు, మహిళలపై నేరాలు అనే నాలుగు భాగాలుగా విభజించి అన్ని రంగాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం దక్కేలా చర్యలు తీసుకొంటోంది. అందుకే ఇటీవల ప్రకటించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

ఫిన్‌ల్యాండ్
ఫిన్‌ల్యాండ్‌లో ఆడ, మగ మధ్య తేడాను తగ్గించడంలో మహిళలదే ముఖ్య పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి కష్టం వచ్చినా మహిళలంతా కలిసికట్టుగా ఉద్యమించడం ఇక్కడ పరిపాటి. ఈక్రమంలోనే శృంగారం విషయంలో భార్యకు ఇష్టం లేకుండా భర్త ఒత్తిడి తీసుకొస్తే దాన్ని ‘రేప్ ఇన్ మ్యారేజ్’గా అభివర్ణించి ఒక ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చేలా ఉద్యమించారు. కుటుంబంలోనే స్త్రీలకు అనుకూలంగా చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. మిగతా రంగాల్లో ఎటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకొచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. ఒక్క పేరెంటింగ్ లీవ్స్నే తీసుకొంటే... బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు అలవెన్స్‌లు, మెటర్నిటీ లీవ్స్, పార్షియల్ కేరింగ్ లీవ్స్.. ఇలా దాదాపు 263 రోజులు పేరెంటల్ లీవ్స్ ఇస్తోంది. మరోవైపు విద్యా రంగాన్ని తీసుకొంటే.. బాలబాలికలకు సమ ప్రాధాన్యం ఇచ్చే ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాలయాలకు ఫిన్‌ల్యాండ్ వేదికగా నిలిచిందనే చెప్పాలి ! అంతేకాదు వృత్తి రంగంలో మహిళా ఉద్యోగుల శాతం 51%గా ఉంటే పురుషులది 49 శాతంగా ఉంది.

స్వీడన్
వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా.. సమాజంలో సానుకూల మార్పు రావాలన్నా... ఏ రంగంలోనైనా స్త్రీ పురుషులకు సమ ప్రాధాన్యం ఉండాలనే విషయాన్ని స్వీడన్ బలంగా నమ్ముతోంది. స్వీడన్ ఉద్దేశంలో లింగ సమానత్వం అంటే అన్ని రంగాల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించడమే కాదు... వారికి సరైన జ్ఞానాన్ని అందిస్తూనే ప్రతి రంగంలో అనుభవజ్ఞుల్ని చేర్చుకుంటూ సమాజోద్ధరణకు పాటుపడడం కూడా ! ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నియమ నిబంధనలను రూపొందిస్తుంటుంది కాబట్టే స్వీడన్ మహిళలు సాధికారత బాట పట్టారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ జాబితాలో స్వీడన్‌ను నాలుగో స్థానంలో నిలిపారు. ఎటువంటి రంగమైనా సరే, అక్కడ తోటి మహిళలపై లింగ భేదాన్ని చూపడం ఒక నేరంగా భావిస్తారు. ఇలా 1980 నుంచి ఒక చట్టం కూడా అమల్లో ఉంది.
నికరాగ్వా
లింగ సమానత్వం ఉన్నంత మాత్రాన ఆ దేశం సంపన్న దేశం అనుకోవడానికి వీల్లేదు. ఇటువంటి కోవకు చెందిన దేశమే నికరాగ్వా. అధిక పేదరికం కలిగిన పాశ్చాత్య దేశాల్లో నికరాగ్వా కూడా ఒకటి. అయితే స్త్రీ, పురుషులకు సమంగా హక్కులు ఉండడం ఇక్కడి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. పేదరికం కారణంగా ఈ దేశంలోని చాలా కుటుంబాలు పిల్లల సంపాదన మీదే ఆధారపడుతున్నప్పటికీ విద్య, వైద్యం వంటి చాలా రంగాలలో స్త్రీ, పురుషులకు సమప్రాధాన్యం లభిస్తున్నట్లు నివేదిక తెలుపుతోంది. అందుకే ఈ జాబితాలో ఈ దేశానికి ఐదో స్థానం దక్కింది.

న్యూజిలాండ్
‘మహిళలు సంపాదిస్తే దేశ ఆర్థిక స్థితి మెరుగవుతుంది’ అనే సూత్రాన్ని న్యూజిలాండ్ ప్రగాఢంగా నమ్ముతుంది. అందుకే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. తమ మహిళలకి స్త్రీ-పురుషులన్న తేడా లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మల్టీ నేషనల్ కంపెనీకి నాయకత్వం వహించే వరకు ఏ పనైనా చేయగల సామర్థ్యాన్ని మహిళలకు అందిస్తోంది న్యూజిలాండ్ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా తమ విధాన సంస్కరణల్లో, చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులను కూడా తీసుకొస్తోంది.
ఐర్లాండ్
ఏ దేశంలోనైనా విద్య, ఉపాధి, రక్షణ విషయాల్లో భేష్ అనిపించుకుంటే చాలు అక్కడి మహిళలు సాధికారత సాధించినట్లే. ఐర్లాండ్ ఈ కోవకు చెందినదే. అందుకే లింగ సమానత్వాన్ని తమ విదేశాంగ విధానంలో సైతం చేర్చింది. ‘ప్రతి దేశంలోని బాలికలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎటువంటి అవకాశాన్నైనా సృష్టిస్తాం, సద్వినియోగం చేసుకుంటాం.’ అంటోంది ఆ దేశ ప్రభుత్వం. అంతేకాదు స్త్రీలు అన్ని రంగాల్లో ఉపాధి పొందేందుకు, వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఈ జాబితాలో ఐర్లాండ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.

స్పెయిన్
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన ఈ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్పెయిన్ 21 స్థానాలు మెరుగుపర్చుకొని టాప్ 10లోకి ప్రవేశించింది. ఇటీవలి కాలంలో లింగ సమానత్వంలో ఇంత పురోగతి సాధించిన దేశం లేదనే చెప్పాలి. అందుకు కారణం నిస్సందేహంగా స్పెయిన్ మహిళలే ! ఎందుకంటే మహిళల హక్కులకు వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా మహిళలంతా కలిసికట్టుగా ఉద్యమించడం అక్కడిప్పుడు ఒక సంప్రదాయంగా మారింది. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే లింగభేదం లేని సమాజం కోసమని జరిగిన ఉద్యమంలో, దేశంలోని చాలా రోడ్లు లక్షల సంఖ్యలో మహిళలతో నిండిపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇటువంటి ఉద్యమాల వల్ల అక్కడి మహిళా సాధికారతలో చాలా మార్పు వచ్చిందంటున్నారు పరిశోధకులు.
2018లో పెడ్రో సాంచేజ్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యధిక మహిళా మంత్రులు కలిగిన ప్రభుత్వంగా నిలిచింది. ఎక్కడా లేనంతగా 65 % మంది మహిళలు పెడ్రో ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు. ఉన్న 17 మంత్రిత్వ శాఖల్లో 11 శాఖలు మహిళలకే కేటాయించారు పెడ్రో. ఇప్పుడక్కడ ఆర్థిక శాఖ మొదలుకొని రక్షణ శాఖ, ఉప ప్రధాని వరకు మహిళా మంత్రులు చెప్పిందే మాట.. చేసిందే శాసనం. ఇక సమసమాజానికి సరైన అర్థాన్నిస్తూ.. తల్లులకు మెటర్నిటీ లీవ్స్ ఇచ్చినట్లే పిల్లల పెంపకంలో తండ్రులకూ సమ ప్రాధాన్యం ఉండాలని మగవారికి 16 వారాల పేరెంటల్ లీవ్స్‌ను ప్రతిపాదించింది. 2021లోపు ఇది అమలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇంకా అక్కడి మహిళలు చాలా రంగాల్లో పురుషులతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ చాలా కంపెనీల్లో మహిళా నాయకత్వ శాతం 22% మాత్రమే !

రువాండా
స్పెయిన్ ఎనిమిదో స్థానానికి ఎగబాకడంతో రువాండా ఈ జాబితాలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కానీ లింగ సమానత్వం కోసం పాటుపడడంలో చాలా దేశాలకు ఈ దేశం స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఆఫ్రికాలోని చాలా చిన్న దేశం రువాండా. ఇక్కడి పాలనా రంగంలో అధిక శాతం స్త్రీలే మంత్రులు కాగా, అవినీతి అనేది చాలామందికి తెలియని విషయం. 1994లో ఈ దేశంలో జాతి విధ్వంసకాండ జరిగి 100 రోజుల్లో దాదాపు 8,00,000 మంది చనిపోయారు. ఈ సమయం నుండి మహిళలే తమ దేశాన్ని సంస్కరించుకోవడం వల్ల ఇక్కడ ఆడ, మగ అన్న తేడా చాలా తక్కువగా ఉంది. వారి నాయకత్వ పటిమే ఇప్పుడు ఈ జాబితాలో రువాండాను తొమ్మిదో స్థానంలో నిలిపింది.
జర్మనీ
లింగ సమానత్వంలో ఎప్పటికప్పుడు పురోగతి చూపిస్తున్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటి. గతంలో టాప్ 15లో ఉన్న ఈ దేశం ఇప్పుడు టాప్ 10కు చేరడం వెనుక ఈ దేశంలోని స్త్రీలు తమ హక్కుల విషయంలో చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధే కారణం. అబార్షన్‌ను చట్టపరం చేయడం లాంటి వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి వృత్తిరంగంలో పురుషులతో సమానంగా వేతనం అందుకునే వరకు స్త్రీలను సాధికారత దిశగా నడిపించేందుకు తమ పాలనలో ఎప్పుడూ మార్పులను స్వాగతిస్తుంటుంది జర్మనీ. అందుకే ఇప్పుడు పదో స్థానంలో ఉన్న ఈ దేశం వచ్చే ఏడాదికి మరింత పురోగతి సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది.
అదండీ విషయం ! ఇలా విద్య నుంచి ఉపాధి, రక్షణ వరకు స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తేనే ఎక్కడైనా సాధికారత, సమానత్వం సాధ్యం. అందుకు ఈ దేశాలే నిదర్శనం. ఏమంటారు ?