కేక్.. ఈ మాట వింటేనే ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది. మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేక్‌ని చూస్తే.. నోరూరడం అటుంచి.. నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోవడం ఖాయం. మరి అంత పే..ద్ద కేక్‌ను తయారుచేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు కేరళ చెఫ్స్. కేరళకు చెందిన 1500 మంది చెఫ్స్ సుమారు 4 గంటలకుపైగా శ్రమించి 5,300 మీటర్ల పొడవైన వెనీలా కేక్‌ని తయారుచేసి ఆ కేక్‌ను గిన్నిసుకెక్కించారు. ఈ విషయాన్ని స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించింది. ‘కేరళ బేకర్స్ అసోసియేషన్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా వారు ఈ టేస్టీ కేక్ రికార్డ్‌ని నెలకొల్పారు. ప్రపంచంలో అత్యంత పొడవైన కేక్‌గా పేరొందిన ఈ యమ్మీ కేక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి..
ఎంత పొడవో!
కేరళలోని త్రిస్సూర్‌లో కేరళ బేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘హ్యపీ డేస్ త్రిస్సూర్ షాపింగ్ ఫెస్టివల్ 2020’ జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 1500 మంది చెఫ్స్, బేకర్స్ కలిసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేక్‌ని సిద్ధం చేయాలని సంకల్పించారు. వీరిలో కొందరు మహిళా చెఫ్స్ కూడా పాలుపంచుకోవడం విశేషం. ఇక ఈ కేక్‌ని రూపొందించడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అంతేకాదు.. తమ ఘనతను నమోదు చేయడానికి గిన్నిస్ రికార్డ్స్ అధికారులను కూడా ఆహ్వానించారు. 12,000 కిలోల పిండి, పంచదారను ఉపయోగించి 5300 మీటర్ల పొడవైన ఈ వెనీలా కేక్‌ను రూపొందించారు. ఇందుకోసం అక్కడ వందలాది బల్లలను వరుసగా పేర్చి.. దానిపైనే ఈ కేక్‌ను అమర్చారు. ఆఖరుగా దానిపై చాక్లెట్ క్రీమ్‌తో అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇలా తయారైన కేక్ పొడవు 5,300 మీటర్లు (5.3 కిలోమీటర్లు) కాగా, దాని బరువు 27,000 కిలోలు. కేక్ తయారీ పూర్తయ్యాక దీని పొడవు కొలిచి.. ‘ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేక్’గా దీనికి గిన్నిస్ బుక్‌లో చోటు కల్పించారు ఆ సంస్థ ప్రతినిధులు. అంతేకాదు.. ఈ కేక్ చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. ఇది టేస్ట్‌లోనూ బెస్టే అంటున్నారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు. ఈ అతిపే..ద్ద కేక్‌ను చూడడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
చైనా రికార్డ్‌ని బద్దలుకొట్టింది!
2018లో చైనాలోని జిక్సీ కౌంటీ అనే ప్రాంతంలో ‘జిక్సీ బ్రెడ్ ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్’ సందర్భంగా అక్కడి 180మంది చెఫ్స్ 23 గంటల పాటు కష్టపడి 3.2 కిలోమీటర్ల పొడవు గల ఫ్రూట్ కేక్‌ను తయారుచేశారు. ఇప్పటివరకు ఇదే ప్రపంచంలోని అత్యంత పొడవైన కేక్‌గా పేరుగాంచింది. అయితే ఆ రికార్డును తాజాగా కేరళ చెఫ్స్ బద్దలుకొట్టారు. వారు తయారుచేసిన 5.3 కిలోమీటర్ల పొడవైన కేక్ చైనా రికార్డును చెరిపేసిందని చెప్పచ్చు.