ఎటుచూసినా రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన చర్చిలు.. లైట్లతో మిరుమిట్లు గొలిపే క్రిస్మస్ చెట్లు.. శాంతాక్లాజ్ కోసం వేచిచూసే చిన్నారులు.. వెరసి క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే పండగే క్రిస్మస్. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం దగ్గర్నుంచి, బహుమతులిచ్చుకోవడం, కేక్స్ పంచుకోవడం.. ఇలా ప్రతి ఇంటా బంధువులు, స్నేహితులతో ఈ పండగ రోజున సందడి వాతావారణం నెలకొంటుంది. దీనికోసం ఒకటి, రెండు కాదు.. కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. మరి మన ఇళ్లలోనే క్రిస్మస్కి ఇంత హడావిడి, ఆనందం నెలకొంటే.. ఈ పండగను పెద్ద ఎత్తున జరుపుకొనే దేశాల సంగతేంటి? సాధారణ వేడుకలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే క్రిస్మస్ మార్కెట్లు, క్రైస్తవుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించే పలు కార్యక్రమాలతో ఆయా దేశాల్లో ఈ పండగ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ క్రమంలో క్రిస్మస్ సందర్భంగా చూడదగిన కొన్ని ప్రదేశాలు, అక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల గురించి మనం కూడా ఓ లుక్కేద్దామా...

బెత్లెహాం (ఇజ్రాయెల్)
ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకొని క్రైస్తవులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండగే క్రిస్మస్ అని మనందరికీ తెలిసిందే. మరి ఏసుప్రభువు పుట్టిన ప్రదేశం, అక్కడి క్రిస్మస్ వేడుకలు చూడాలంటే ఇజ్రాయెల్ వెళ్లాల్సిందే! ఆ దేశంలోని బెత్లెహాంలోనే ఏసుక్రీస్తు జన్మించారు. ఏటా ఇక్కడ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతాయి. పండగకు కొన్ని రోజుల ముందు నుంచే అక్కడి వీధులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలు, క్రిస్మస్ చెట్లతో ముస్తాబవుతాయి. అలాగే వేడుకల్లో భాగంగా క్రైస్తవుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా వయోబేధం లేకుండా పాల్గొని ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. బెత్లెహాంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో క్యాథలిక్, ప్రొటెస్టెంట్, గ్రీక్ ఆర్థోడాక్స్, ఇథియోపియన్, అర్మీనియన్.. వంటి క్రైస్తవ తెగలకు చెందిన ప్రజలు పాల్గొంటుంటారు. బెత్లెహాంలోని క్రీస్తు పుట్టిన ప్రదేశం మాంగర్ స్క్వేర్ మీదుగా క్రిస్మస్ వూరేగింపు ప్రారంభమవుతుంది. కాబట్టి క్రిస్మస్ నాటికి బెత్లెహాం చేరుకుంటే ఈ వూరేగింపులో పాల్గొనడంతో పాటు అక్కడ జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తిలకించవచ్చు. అలాగే క్రిస్మస్ పండగను ప్రతిబింబించే వివిధ రకాల వస్తువులతో ఏర్పాటుచేసిన క్రిస్మస్ మార్కెట్లో షాపింగ్ చేయడం ఓ గొప్ప అనుభూతినిస్తుంది. ఏసుక్రీస్తు పుట్టుక, ఆయన జీవితానికి సంబంధించిన మరిన్ని మధురఘట్టాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు అక్కడి హోలీ ల్యాండ్‌లో దర్శనమిస్తుంటాయి. వీటిన్నింటినీ చూస్తూ, క్రిస్మస్ పాటలు వింటూ, షాపింగ్ చేస్తూ.. సరదాగా గడిపేయచ్చు. అలాగే 'చర్చ్ ఆఫ్ ది నేటివిటీ', 'సెయింట్ క్యాథరిన్ చర్చ్', 'ఓల్డ్ బెత్లెహాం మ్యూజియం', 'సాల్మన్స్ పూల్స్'.. వంటి ప్రదేశాలు పర్యటకులకు కనువిందు చేస్తాయి.

శాంతాక్లాజ్ విలేజ్ (ఫిన్‌ల్యాండ్)
చలికాలంలో మరింత చలిగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలనుకుంటారు కొంతమంది. అలాంటివారు క్రిస్మస్ సెలవులకు ఫిన్‌ల్యాండ్ దేశంలోని శాంతాక్లాజ్ విలేజ్‌కి వెళ్లాల్సిందే. అయ్యో! అసలు విషయం చెప్పడం మర్చిపోయాం. అక్కడ శాంతాక్లాజ్ తాతయ్య కూడా ఉంటాడండోయ్! అక్కడికి మన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు.. ఇలా అందరూ కలిసి వెళితే ఎంచక్కా ఆయన్ను కలుసుకోవచ్చు. ఫిన్‌ల్యాండ్ దేశంలోని లాప్లాండ్లో గల రోవనీమీలో ఉండే ఎమ్యూజ్మెంట్ పార్క్‌నే శాంతాక్లాజ్ విలేజ్‌గా పరిగణిస్తారు. అక్కడికి వెళ్లాలంటే ముందుగా రోవనీమీ విమానాశ్రయానికి చేరుకోవాలి. లేదంటే రోవనీమీ రైల్వే స్టేషన్ వరకు చేరుకుంటే అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ విలేజ్‌కి వెళ్లడానికి బస్సు సౌకర్యం ఉంటుంది. బస్సు ట్రిప్ ద్వారా అరగంటకు పైగా ఈ విలేజ్‌ని సందర్శించవచ్చు. ఇందులో భాగంగా ఆర్కిటిక్ సర్కిల్, శాంతాక్లాజ్ మెయిన్ పోస్టాఫీస్, శాంతాక్లాజ్ ఆఫీస్.. వంటివి చూడచ్చు. ఆర్కిటిక్ సర్కిల్లోని వైట్‌లైన్ అనే ప్రదేశం సందర్శకులు ఫొటోలు దిగడానికి అనువుగా ఉంటుంది. అలాగే పోస్టాఫీసులో క్రిస్మస్ సంబంధిత వస్తువులు, గ్రీటింగ్ కార్డులు, సీడీలు.. వంటివి కొనుగోలు చేయచ్చు. ఇక శాంతాక్లాజ్ ఆఫీస్‌లో శాంతాక్లాజ్ తాతయ్యతో మాట్లాడడం, ఆయనతో కలిసి ఫొటోలు దిగడం.. ఇలా సరదాగా గడిపేయచ్చు. వీటితో పాటు అక్కడ అందమైన శాంతాక్లాజ్ బొమ్మలు, ఇతర వస్తువులతో కూడిన షాపులు, అక్కడి ఆహార పదార్థాల్ని రుచిచూడడానికి వీలుగా రెస్టారెంట్లు.. వంటివి ఉంటాయి. వీటన్నింటినీ చూడడం వల్ల అక్కడి సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి వీలుంటుంది. పిల్లలకు శాంతాను కలిసిన ఆనందం కూడా లభిస్తుంది.

ఆస్ట్రియా
క్రిస్మస్ సందర్భంగా సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఆస్ట్రియా కూడా ఒకటి. ఈ పండగ సందర్భంగా అక్కడి ప్రజలు 'అడ్వెంట్' వేడుకను ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. క్రిస్మస్కి నాలుగు వారాల ముందు వచ్చే ఆదివారం రోజును 'అడ్వెంట్'గా భావిస్తారు. వీరు ఆ రోజు నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా.. అక్కడ ప్రతి ఇంటి లివింగ్ రూమ్‌ని అడ్వెంట్ రెత్తో అలంకరిస్తారు. చిన్నచిన్న ఆకులు, కొమ్మలను ఒక దగ్గర పేర్చి వాటిలో శాటిన్ రిబ్బన్స్, క్యాండిల్స్‌ని క్రమపద్ధతిలో అమర్చి ఇంటి గుమ్మాలకు వేలాడదీయడం లేదంటే హాల్లో టేబుల్మీద అలంకరించడం వంటివి చేస్తారు. అలాగే పండక్కి ముందు వచ్చే ఈ నాలుగు ఆదివారాల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి సాయంత్రం ప్రార్థనలు చేయడం, క్రిస్మస్ స్టోరీస్ చదవడం, పాటలు పాడడం.. వంటివన్నీ చేస్తుంటారు. ఇవి అక్కడికి వెళ్లే పర్యటకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. అలాగే ఆస్ట్రియా సంస్కృతిని ప్రతిబింబించే పలు వస్తువులు అక్కడి క్రిస్మస్ మార్కెట్లో లభ్యమవుతాయి. ఆ దేశంలోని ప్రతి ప్రధాన నగరంలోనూ అందంగా ముస్తాబు చేసిన పెద్ద పెద్ద క్రిస్మస్ చెట్లను అమర్చుతారు. వీటితో పాటు రంగురంగుల విద్యుద్దీపాలు, స్టార్స్.. వంటి అలంకరణలతో దేశంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటుతాయి.

లండన్ (ఇంగ్లండ్)
క్రిస్మస్ పండగను అత్యంత వైభవంగా జరుపుకొనే దేశాల్లో ఇంగ్లండ్ కూడా ఒకటి. ఈ విషయాన్నే చార్లెస్ డికెన్స్.. 'లండన్ ఉత్సవ సంప్రదాయాలు ప్రపంచంలోని ఏ చోటికీ తీసిపోవు..' అని తన నవలలో వ్యక్తపరిచాడు. మామూలు రోజుల్లో కంటే ఈ దేశానికి క్రిస్మస్ సందర్భంగా వెళ్లే పర్యటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పర్యటకులకు కనువిందు చేసే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో థేమ్స్ నది, హైడ్ పార్క్‌ల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ మార్కెట్స్, మ్యాజికల్ శాంతా గ్రోటోస్, పెద్ద పెద్ద భవనాల్లో ఐస్ స్కేటింగ్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఐస్ రింక్స్.. వంటివి సందర్శకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తాయి. అలాగే సిటీ అంతా వెలుగులు నిండిపోయేలా అమర్చిన లైటింగ్, క్రిస్మస్ చెట్లు.. వంటివి రాత్రుళ్లు కూడా పగటిని తలపిస్తాయి. వీటన్నింటినీ చూడడమే కాదు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి అందించే క్రిస్మస్ పుడ్డింగ్‌ని తినడం మాత్రం అస్సలు మిస్సవ్వకూడదు. అలాగే అక్కడ దొరికే ఖర్జూరాలు, వాటితో తయారు చేసిన ప్రత్యేక వంటకాలు, కేక్స్, ఇతర తీపిపదార్థాలు.. వంటివి కూడా తప్పక రుచి చూడాల్సినవే. ఇలా అక్కడ చూసే ప్రదేశాలు, తినే ఆహార పదార్థాలు.. వంటివన్నీ అక్కడికి వెళ్లిన పర్యటకులకు సరికొత్త అనుభూతుల్ని అందిస్తాయి.

వాటికన్ సిటీ (రోమ్)
విద్యుద్దీపాల అలంకరణతో మిలమిల మెరిసే వీధులు.. వీధుల్లో, పార్కుల్లో అమర్చిన అందమైన క్రిస్మస్ చెట్లు.. అక్కడక్కడా క్రిస్మస్ వస్తువులతో కొలువుదీరిన షాపులు.. మొదలైన వాటితో రోమ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో క్రీస్తు జన్మదిన వేడుకలు అంబరాన్నంటుతాయి. వాటితోపాటు వాటికన్ సిటీలో పోప్ ఇచ్చే సందేశం వినడం, కొలొనాడెడ్ స్క్వేర్, ప్రపంచవింతల్లో ఒకటైన కొలోజియం.. వంటివి సందర్శించడం ఓ మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాగే అందమైన క్రిస్మస్ చెట్లతో అలంకరించిన సెయింట్ పీటర్స్ స్క్వేర్స్, రోమన్ చరిత్రకు అద్దం పట్టే పలు చారిత్రక ప్రదేశాలు, శాంతా మారియా మాగియోర్ క్రిస్మస్ క్రిబ్.. వంటివన్నీ అక్కడ చూడదగిన ప్రదేశాలే.

బుడాపెస్ట్ (హంగరీ)
బుడాపెస్ట్ నగరానికి మణిహారంగా నిలిచే డాన్యూబ్ నది క్రిస్మస్ సందర్భంగా విద్యుద్దీప కాంతులతో ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతుంది. శీతాకాలంలో ఆ నదిలో బోటు షికారు కూడా అందుబాటులో ఉంటుంది. చల్లటి గాలిలో విహరిస్తూ సిటీ అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. 'అబ్బ.. చలితో ఎముకలన్నీ బిగుసుకుపోయాయి.. కాస్త వెచ్చగా ఏదైనా ఉంటే బాగుండు'ననిపిస్తుందా? అయితే అక్కడి థర్మల్ పూల్స్‌ని సందర్శించాల్సిందే! ఇవి కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంగానే ఓపెన్ చేస్తారట! అలాగే కపుల్ మసాజ్, అరోమా మసాజ్.. వంటివి కూడా పర్యటకులు సేదదీరడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు ఎంజాయ్మెంట్ కోసం లేజర్ షోలు, ఐస్ రింక్స్, బుడాపెస్ట్ నట్‌క్రాకర్ బ్యాలె, బుడా క్యాజిల్, హంగేరియన్ ఫోక్ డ్యాన్స్ షోలు.. వంటివి పర్యటకులకు ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. అలాగే ఏటా డిసెంబర్లో ప్రారంభమయ్యే క్రిస్మస్ స్ట్రీట్‌కార్ రైడ్ చేయడం మరిన్ని మధుర జ్ఞాపకాలను మిగుల్చుతుంది. అలాగే అక్కడి ప్రత్యేక వంటకం, ఎంతో రుచికరమైన చిమ్నీ కేక్ తినడం మాత్రం మర్చిపోవద్దు.

కోపెన్‌హాగెన్ (డెన్మార్క్)
ఓవైపు దట్టంగా కురుస్తున్న మంచు.. చెట్లన్నీ తెల్లటి మంచుతో చూడముచ్చటగా అలంకరించుకొని ఉంటాయి. మరోవైపు క్రిస్మస్ కార్నివాల్, ఎగ్జిబిషన్లు కొలువుదీరతాయి, ఇంకోవైపు స్కేటింగ్ చేయడానికి అనువుగా ఉండే ఐస్ రింక్స్, చూపరులను మంత్రముగ్ధుల్ని చేసే విధంగా కొలువుదీరిన ఐస్ ప్యాలస్, లైట్ షో.. ఇవన్నీ ఒకే ప్రదేశంలో ఉంటే ఇక ఆ ప్రదేశం భూలోక స్వర్గమే అవుతుంది కదూ! క్రిస్మస్ సందర్భంగా అలాంటి వండర్ ల్యాండ్‌ను తలపించే చోటే డెన్మార్క్ దేశంలోని కోపెన్‌హాగెన్ పట్టణంలో కొలువుదీరిన టివోలీ గార్డెన్ కూడా! క్రిస్మస్ కోసం ఏటా ప్రత్యేకంగా ఈ గార్డెన్లో ఏర్పాటుచేసే ఇలాంటి అద్భుతాలన్నీ వీక్షకుల మనసును కట్టిపడేస్తాయంటే అతిశయోక్తి కాదు. వీటితో పాటు పలు వస్తువులతో వీధుల్లో కొలువుదీరిన షాపులు, గుర్రపు బండ్లలో సవారీ చేస్తూ క్రాన్బార్గ్ క్యాజిల్ అందాలు తిలకించడం, నైహాన్ కెనాల్లో బోటు షికారు చేస్తూ అక్కడి రంగురంగుల ఇళ్లను చూడడం.. వంటివన్నీ మర్చిపోలేని అనుభూతుల్ని అందిస్తాయి. అలాగే ఎండుద్రాక్ష, బాదం, దాల్చినచెక్క.. వంటి పదార్థాలతో తయారుచేసిన 'గ్లాగ్' అనే వైన్‌తో పాటు, అక్కడి ప్రత్యేక వంటకం ఎబుల్ స్కైవర్ని రుచి చూడడం మరపురాని అనుభూతులే..

సిడ్నీ (ఆస్ట్రేలియా)
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేలేత సూర్యకిరణాల్లో కాసేపలా సేదదీరితే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదండీ.. మరి ఇలాంటి వాతావరణాన్ని అందమైన బీచ్‌లో ఆస్వాదించాలంటే.. అది కూడా క్రిస్మస్ సందర్భంగా అంటే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెళ్లాల్సిందే. అక్కడి బాండీ బీచ్‌లో క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ వేడుకలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు తలమానికంగా నిలిచే సిడ్నీ హార్బర్ బ్రిడ్జి, ఒపేరా హౌస్, టౌన్ హాల్.. వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే లైట్ షోలు, క్రిస్మస్ మార్కెట్లలో కొనుగోళ్లు, చర్చిల్లో ఆలపించే పాటలు.. ఇలా వివిధ కార్యక్రమాలతో సిడ్నీ పట్టణం శోభాయమానంగా తయారవుతుంది. అలాగే పండగ సందర్భంగా పేల్చే టపాకాయలతో పండగ వాతావరణం నెలకొంటుంది. క్రిస్మస్ సందర్భంగా అక్కడికి వెళ్లే పర్యటకులు వీటన్నింటినీ చూసి ఎంతగానో ఆనందించచ్చు.

రియో డీ జెనీరో (బ్రెజిల్)
బ్రెజిల్‌లోని ముఖ్య నగరాల్లో జరుపుకొనే క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రియో డీ జెనీరో గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు. విద్యుద్దీపకాంతులతో అందంగా ముస్తాబు చేసిన సుమారు 300 అడుగుల ఎత్తున్న తేలియాడే క్రిస్మస్ చెట్టును 2013లో రియోలో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే క్రిస్మస్ చెట్టుగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. దీన్ని చూడాలంటే రియో వెళ్లాల్సిందే. అలాగే క్రిస్మస్ థీమ్స్‌తో ఏర్పాటు చేసిన ప్రదేశాలు, పలు వస్తువులతో కొలువుదీరిన షాపులు, విద్యుద్దీపాలతో అలంకరించిన వీధులు, చర్చిలు.. మొదలైనవి సందర్శకుల మనసు దోచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటితో పాటు బ్రెజిల్లో పాపులర్ క్రిస్మస్ పాటైన 'నోయిట్ ఫెలిజ్ (సైలెంట్ నైట్)'ను వింటూ మరెంతగానో ఎంజాయ్చేయచ్చు.

కేరళ (ఇండియా)
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మనదేశంలోని పలు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్ వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. విదేశాల్లో కాకుండా.. మన దేశంలోనే క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోవాలంటే.. కేరళ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. విద్యుద్దీపాలు, క్రిస్మస్ స్టార్స్‌తో అందంగా అలంకరించిన చర్చిలు, బీచ్‌లు, బ్యాక్‌వాటర్.. వంటివన్నీ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. కేరళతో పాటు గోవా, ముంబై, పుదుచ్చేరి, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ, షిల్లాంగ్.. వంటి క్రైస్తవులు అధికంగా నివసించే ప్రదేశాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతాయి. అక్కడికి వెళ్తే ఆయా ప్రదేశాల్లోని సంస్కృతీసంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు.. వంటివన్నీ తెలుసుకోవడంతో పాటు అక్కడి ప్రత్యేకమైన రుచుల్నీ టేస్ట్ చేయచ్చు.. మరెంతో ఆనందాన్ని కూడా మూటగట్టుకోవచ్చు.
ఇవేకాకుండా.. అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్, స్పెయిన్, బెల్జియం.. వంటి దేశాల్లోనూ క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి.