సోషల్ మీడియా పరిధి పెరుగుతోన్న ఈ రోజుల్లో ఏది జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతోంది. వీటిలో కొన్ని విషయాలు మనకు అనవసరమైనవి ఉన్నప్పటికీ... మరికొన్ని మాత్రం మనలో మార్పును, ధైర్యాన్ని, ఆలోచనను రేకెత్తించేలా ఉంటున్నాయి. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి రోజూ చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఈరోజు మీకోసం...
భరించేవాడే భర్త...
చైనాలోని హేగాంగ్కు చెందిన ఓ వ్యక్తి గర్భిణీ అయిన తన భార్యను డాక్టర్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీరా డాక్టర్ అపాయింట్మెంట్ కోసం బయట ఎదురు చూస్తున్నారీ జంట. అప్పటికే చాలాసేపు నిలుచున్నా.. లోపలి నుంచి పిలుపు రావట్లేదు. పోనీ కూర్చుందామా అంటే అక్కడున్న కుర్చీలు ఖాళీగా లేవు. అలసిపోయిన ఆ మహిళ కాళ్ల నొప్పులతో బాధపడుతూ... గోడపై వాలి సేద తీరదామని ప్రయత్నించింది. ఇలా అతని భార్య కష్టం చూడలేకపోయిన ఆ భర్త వెంటనే నేలపై వంగి తన వీపుపై భార్యను కూర్చోబెట్టుకున్నాడు. అయితే అక్కడే కారిడార్‌లో కుర్చీలపై కూర్చున్న వారు ఇదంతా చూస్తుండిపోయారే తప్ప సీటు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఈ సంఘటనంతా ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో రికార్డైంది. హాస్పిటల్ యాజమాన్యం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన వారు భార్య కోసం కుర్చీలా మారిన ఆ వ్యక్తికి ‘హస్బెండ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వాలంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం గర్భిణీకి కనీసం కుర్చీ ఇవ్వకుండా కూర్చున్న వారిని తప్పుబడుతున్నారు.
ధైర్యే... సాహసే.. విద్య రాజు!
సహజంగా చిన్న పామును చూస్తేనే జడుసుకుంటాం. ఆ పాము ఎలాంటి హాని చేయదని తెలిసినా కిలోమీటర్ దూరం పరిగెడతాం! అలాంటిది 20 కిలోల బరువున్న కొండచిలువను ఏకంగా చేత్తో పట్టుకుని ఆమాంతం ఎత్తేసింది ఓ మహిళ. ఇంతకీ ఎవరా మహిళా అనేగా... అయితే ఈ స్టోరీలోకి వెళ్దాం...
బిహార్‌కు చెందిన విద్య రాజు అనే మహిళ కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకుళంలోని పానంపల్లి నగర్లో నివసిస్తున్నారు. ఈమె భర్త ఒక నేవీ అధికారి. ఓ రోజు విద్య రాజు ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో నడుస్తోంది. అయితే మూలన ఉన్న ఓ చెట్టు కింద ఏదో కదులుతున్నట్లు గమనించిన విద్య రాజు వెంటనే చెట్టు దగ్గరికి వెళ్లి చూసింది. తీరా అక్కడ కనిపించిన సీన్ చూసే సరికి షాక్‌కి గురైంది. సుమారు పది అడుగుల పొడవున్న ఓ కొండ చిలువ చెట్టు కింద కదులుతోంది. ఇది గమనించిన విద్య ఏ మాత్రం భయపడలేదు. వెంటనే ఆ పాము గొంతును చేత్తో గట్టిగా నొక్కి పట్టింది. అదే సమయంలో ఆమె ఇంట్లో ఉన్న వారు అక్కడికి రావడంతో మరో ఇద్దరు కలిసి పామును ఓ సంచిలో వేశారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ధైర్యంతో చాకచక్యంగా వ్యవహరించి పామును పట్టుకున్న విద్య రాజును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్వతహాగా పాములు పట్టుకునే నైపుణ్యం ఉన్న విద్యరాజు గతంలో కేరళలో వచ్చిన వరదల్లో ఎన్నో పాములను రక్షించారు. అప్పట్లో వార్తల్లో నిలిచిన విద్య ఇప్పుడు మళ్లీ ఈ వీడియోతో పాపులర్ అయ్యారు.