సాధారణంగా ఉల్లిపాయల్ని తరిగేటప్పుడు కన్నీళ్లొస్తాయి.. కానీ ఇప్పుడు కొనాలన్నా, కనీసం వాటి గురించి తలచుకున్నా కూడా అందరి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలా ప్రస్తుతం సామాన్యులకే కాదు.. ధనవంతులకు సైతం అందనంతగా కొండెక్కాయి ఉల్లి ధరలు. ‘ఉల్లి వ్యాపారస్థుల్ని ప్రపంచ ధనవంతుల జాబితాలో చేర్చవచ్చు అనే విధంగా తయారైంది నేటి పరిస్థితి’, ‘ఈ రోజుల్లో ఉల్లిపాయల్ని ఆహారంలో భాగం చేసుకున్న వారు నిజమైన ధనవంతులు’, ‘ఉల్లిపాయ లవ్ ప్రపోజల్స్’.. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉల్లిపై పేలే జోక్స్ చూస్తే ఉల్లి అందరినీ ఎంతలా కన్నీరు పెట్టిస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇంతేనా.. సరదాగా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లినా కూడా ఉల్లిపాయలు కావాలంటే అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితి నెలకొంది.
మరి, కూరగాయల ధరలు పెరిగితే.. వాటికి ప్రత్యామ్నాయంగా ఆకుకూరలు తినచ్చు. కానీ ఏ కూర వండాలన్నా ఉల్లి లేకుండా సంపూర్ణం కాదు. మరి అంత ముఖ్యమైన నిత్యావసర వస్తువైన ఉల్లి ధరలిలా మండిపోతుంటే ఎలారా దేవుడా అంటూ అందరూ తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇకపై అలా బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే వంటల్లో ఉల్లికి బదులుగా వాడేందుకు బోలెడన్ని ప్రత్యామ్నాయ పదార్థాలున్నాయి. అవి వంటలకు రుచినే కాదు.. ఉల్లికి సమానమైన పోషకవిలువలను కూడా అందిస్తాయి. సో.. మనం ఉల్లి వాడకం తగ్గించినా మన ఆరోగ్యానికి, రుచికి డోంట్ వర్రీ అన్నమాట! ఇంతకీ.. ఉల్లికి ప్రత్యామ్నాయంగా వాడే ఆ పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
క్యారట్..

ఆహా! పానీపూరీ పేరు తలుచుకున్నా నోరూరిపోతుంది కదూ! కానీ ఉల్లిపాయలు లేని పానీపూరీని ఊహించడానికైనా కష్టమే! అలాగని పానీపూరీ తినడం మానేస్తామా ఏంటీ? వాటికి ప్రత్యామ్నాయంగా ఏం వాడతామో తెలుసుకొని మరీ పానీపూరీ ఇష్టంగా లాగించేస్తాం.. అలాంటి ఆల్టర్నేటివ్ పదార్థమే క్యారట్! అందుకే పానీపూరీ తినేటప్పుడు ఉల్లిపాయలు లేవని బాధపడడం మానేసి దానికి బదులుగా క్యారట్ ముక్కలు లేదా తురుముని వాడి చూడండి. ఉల్లిపాయల్లాగే కరకరలాడుతుంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా క్యారట్ చాలా మంచిది. ఇవే కాదు.. రైతా, ఆమ్లెట్, దోసె.. వంటి వాటిలో కూడా క్యారట్ ముక్కలు లేదా తురుముని వాడచ్చు.
|
కీరదోస

బిర్యానీలోకి సైడ్ డిష్‌గా గుండ్రంగా కట్ చేసిన ఉల్లిపాయలు తినే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. అయితే ఉల్లి కరువైన ఈ పరిస్థితుల్లో ఉల్లిలాగే చలువ చేసే కీరదోస స్లైసుల్ని జత చేసుకోవచ్చు. అంతేకాదు.. మీరు కీరదోసకాయ రుచిని ఇష్టపడే వారైతే తురిమిన లేదా కీరా ముక్కలతో రైతా తయారు చేసుకొని సైతం బిర్యానీని మరింత టేస్టీగా లాగించేయచ్చు.
|
ముల్లంగి

ముల్లంగిని కూడా ఉల్లికి మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగించచ్చు. అంతేకాదు.. ముల్లంగిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీరంలో మెలనిన్ స్థాయులు అదుపులో ఉంటాయి. దీంతో చేసిన రైతా పంజాబ్‌లో చాలా ఫేమస్ కూడా! ఇంకెందుకు ఆలస్యం! రుచితో పాటు.. అందమైన ఛాయను కూడా మీ సొంతం చేసుకోవడానికి ఉల్లికి బదులుగా ముల్లంగిని వాడేసేయండి.
|
క్యాబేజీ

క్యాబేజీ.. ఉల్లిలాగే పొరలు పొరలుగా ఉంటుందిది. కాబట్టి ఉల్లిపాయలకు ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెప్పచ్చు. దానితో పాటు ఉల్లిలోని పోషక గుణాలుకు కూడా ఇది ఏమాత్రం తీసిపోదు. దీనిని సన్నగా కట్ చేసి తాలింపులో, కూరల్లో వాడుకుంటే ఉల్లి లేని లోటును పూడ్చుకోవచ్చు. కూర రుచినీ ఆస్వాదించచ్చు.
|
క్యాప్సికం

ఉల్లిపాయల స్థానంలో వాడుకోగల మరో కూరగాయ క్యాప్సికం. దీన్ని వాడడం వల్ల మీరు వండే కూరల్లో కాస్త తక్కువ కారాన్ని వేసుకోవచ్చు. అంతేకాదు.. ఇవి వివిధ రంగుల్లో లభిస్తాయి కనుక మీ కూర చాలా కలర్‌ఫుల్ గానూ, రుచికరంగానూ తయారవుతుంది. వీటిని కూడా ఉల్లిలా పొడవుగా సన్నని ముక్కలుగా తరిగి బాగా వేయిస్తే కూర మంచి ఘాటుగా ఉండి ఉల్లి రుచిని మరిపిస్తుంది.
|
ఉల్లిపొడి

ఎన్ని ప్రత్యామ్నాయాలు ట్రై చేసినా మీకు ఉల్లిపాయ ఫ్లేవర్ తగలకపోతే అసలు నచ్చదు అంటారా! అటువంటి వారు మార్కెట్లో దొరికే ఉల్లిపొడిని వాడచ్చు. 2-3 ఉల్లిపాయలు వాడాలనుకునే వంటకాల్లో చిటికెడు ఉల్లిపొడిని వేస్తే రుచి అమోఘం. అంతే! ఘుమఘుమలాడే కూర సిద్ధమవుతుంది.
|
ఫెన్నెల్ బల్బ్

ఉల్లికి బదులుగా ఎన్ని పదార్థాలు వాడినా కొందరు సంతృప్తి పడరు. పైగా అందులో ఉల్లిపాయలు లేవు.. ఆ కూర మేం తినమంటూ మొండికేస్తుంటారు. అలాంటివారిని మెప్పించాలంటే అచ్చం ఉల్లిని తలపించే సోంపు మొక్క మొదలు భాగాన్ని(ఫెన్నెల్ బల్బ్) తరిగి కూరల్లో వేయాల్సిందే! అది చూడ్డానికి అచ్చం ఉల్లిని తలపిస్తుంది. అంతేకాదు.. అంతటి రుచినీ కూరకు అందిస్తుంది. మరి, మీరూ ఓసారి ఈ సరికొత్త ఉల్లిపాయను కూరల్లో ట్రై చేయకూడదూ!!
|
ఉల్లికాడలు

ఉల్లికాడల్ని కొందరు కిచెన్ గార్డెన్లో భాగంగా పెంచుకుంటుంటారు. దాని మొదలు భాగంలో చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయి. ఆ ఆకులతో పాటు ఆ ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని కూరల్లో ఉపయోగిస్తే కూరకు అదనపు రుచి వస్తుంది. అలాగే ఉల్లికాడల్ని రైతాలో, ఆమ్లెట్ తయారీలోనూ ఉపయోగించచ్చు.
|
ఆనియన్ ఫ్లేక్స్

ఉల్లిపాయలు ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొని వృథాగా పడేస్తుంటారు చాలామంది. ఇక ధర మిన్నంటాక ఉల్లిపాయల కోసం నానా పాట్లూ పడుతుంటారు. మరి, ఇకపై అలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నప్పుడే ఆనియన్ ఫ్లేక్స్ తయారుచేసుకొని.. నిల్వ చేసుకోవచ్చు. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి బాగా ఎండబెట్టడం ద్వారా తయారయ్యే వీటిని ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తే వాటి రుచిని ఆస్వాదించచ్చు. ఆనియన్ ఫ్లేక్స్ తయారుచేసుకునే ఓపిక మాకు లేదు అంటారా? అయితే ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న ఫ్లేక్స్‌ను కూడా ఉపయోగించి ఉల్లిపాయలంతటి రుచిని కూరలకు అందించచ్చు.
|
ఇవే కాదు.. కొన్ని రకాల కూరల్లో గ్రేవీ కోసం ఉల్లి పేస్ట్‌కు బదులుగా బాదం, జీడిపప్పు పేస్ట్, పల్లీలు-నువ్వుల పొడి, శెనగపిండి.. వంటి వాటిని కూడా ఉపయోగించచ్చు.
చూశారుగా! ఉల్లికి ఇన్ని ప్రత్యామ్నాయాలున్నప్పుడు తల్లి లాంటి ఉల్లి భారమెలా అవుతుంది. మరి, మీరూ వీటిని చేసే వంటకాల్లో ఉపయోగించి ఉల్లి రుచిని ఆస్వాదించేయండి మరి!