సమాజంలో మహిళల భద్రతపై మరోసారి సందేహాలు రేకేత్తించింది హైదరాబాద్‌కు చెందిన ‘దిశ’ హత్యాచార ఘటన. మూగజీవాలను కూడా ప్రేమగా చూస్తూ వైద్యం అందించే ఓ పశువైద్యురాలిని నాలుగు మానవ మృగాలు పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సాటి మనిషి అనే మానవత్వం లేకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ నిందితులకు కూడా అలాంటి శిక్షే విధించాలని అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వారికి ‘ ఉరే సరి’ అన్న నినాదంతో ఉద్యమిస్తున్నారు..

అభయమివ్వని ‘నిర్భయ’..
ఏడేళ్ల క్రితం దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది. ఆ ఘటనలో భాగంగా దుండగుల చేతిలో దారుణంగా బలైపోయిన బాధితురాలి పేరుతో 2013లో ‘నిర్భయ’ చట్టం తెచ్చింది భారత ప్రభుత్వం. దీంతో పాటు పోక్సో అంటూ పలు చట్టాలు.. పథకాలు తెచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు.. సరి కదా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం చట్టాల అమలులో లొసుగులు ఉండడమే.. నేరం రుజువైనా దోషులకు కఠిన శిక్షలు విధించకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదు.. పైగా ఇలాంటి నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ‘దిశ’ హత్య ఘటనలో నిందితులకు ఉరిశిక్ష విధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి రేపిస్టులకు ఏయే దేశాల్లో ఏయే శిక్షలు విధిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం రండి..!

చైనా...నేరుగా మరణ శిక్షే!
మన దేశం పక్కనే ఉన్న చైనాలో మహిళలపై అఘాయిత్యానికి పాల్పడితే నేరుగా మరణశిక్ష అమలు చేస్తారు. అక్కడి యువతులను లైంగికంగా వేధించినా, హింసించినా..ఘటన తీవ్రతను బట్టి కఠినంగా శిక్షలు విధిస్తారు. ఇందులో భాగంగా ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే వెంటనే సర్జరీల ద్వారా మగవారి పురుషత్వాన్ని కూడా నాశనం చేస్తారు.

ఇరాన్..బహిరంగంగా ఉరి శిక్ష!
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేస్తోంది ఇరాన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా నేరం రుజువైతే వెంటనే వారిని ఉరితీయడమో లేదా బహిరంగంగా కాల్చి చంపడమో చేస్తోంది. అయితే ఇలాంటి కేసుల్లో మరణ శిక్ష పడిన దోషులకు ఓ వెసులుబాటు కూడా కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో బాధితుల అనుమతితో మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చుకోవచ్చు.

అఫ్గానిస్థాన్..తలలోకి బుల్లెట్ దిగాల్సిందే..!
ఇస్లామిక్ దేశాల్లో మహిళలపై ఆంక్షలు అధికంగా ఉన్నా..వారి రక్షణ, భద్రత కోసం కఠిన చట్టాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ రేపిస్టులను రోడ్డుపై ఈడ్చుకెళ్లి మరీ బహిరంగంగా ఉరివేస్తారు. లేదా అందరి ముందు తలకు తుపాకీ గురిపెట్టి కాల్చుతారు. మహిళలను అత్యాచారం చేయాలన్న ఆలోచన రావాలంటేనే భయం కలిగేలా.. నేరం చేసిన 4వ రోజే దోషులను చంపేస్తారు.

సౌదీ అరేబియా..తల తెగాల్సిందే..!
మత నియమాలు, నిబంధనల పేరుతో మహిళలపై అధికంగా ఆంక్షలు విధిస్తున్న దేశం సౌదీ అరేబియా. అయితే అదే మహిళల రక్షణ కోసం మరింత కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. అత్యాచారం చేసినట్లు రుజువైతే బహిరంగంగా, బాధితుల ముందే దోషి తల నరికేస్తారు. మరికొన్ని ఘటనల్లో బహిరంగంగా ఉరివేస్తారు. అంతేకాదు ఇక్కడి ఆడపిల్లలను లైంగికంగా వేధించిన, హింసించిన విదేశీయులకు సైతం ఇలాంటి శిక్షలే విధిస్తుండడం గమనార్హం.

నార్త్ కొరియా..తుపాకితో తక్షణ న్యాయం..!
నియంతృత్వ పోకడలు అధికంగా కనిపించే ఉత్తర కొరియాలో రేపిస్టులకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిపై ఎలాంటి సానుభూతి చూపదు అక్కడి ప్రభుత్వం. రేపిస్టుల తలల్లోకి అతి సమీపం నుంచే తుపాకి బుల్లెట్లు దింపుతూ బాధితులకు తక్షణ న్యాయం అందజేస్తోంది.
యూఏఈ.. వారంలోపే మరణశిక్ష!
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారం రోజుల్లోపే నిందితులకు మరణ శిక్ష పడేలా చేస్తోంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆడపిల్లలను లైంగికంగా వేధించినా..హింసించినా ఉరిశిక్ష అమలు చేస్తోంది.

అమెరికా..జీవితాంతం జైలులోనే!
ప్రపంచానికి పెద్దన్నగా భావించే అమెరికాలో మహిళల రక్షణ కోసం రెండు రకాల చట్టాలు అమలులో ఉన్నాయి. ఫెడరల్‌లా, స్టేట్‌లా అనే ఈ రెండు చట్టాలు కూడా అత్యాచారాలను చాలా తీవ్రంగానే పరిగణిస్తాయి. ఇందులో భాగంగా రేపిస్టులకు 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. నేరం తీవ్రతను బట్టి జీవితఖైదు కూడా అమలు చేస్తారు.
నెదర్లాండ్స్..ముద్దు పెట్టినా నేరమే..!
అనుమతి లేకుండా అమ్మాయిలకు ముద్దుపెట్టినా రేప్‌గానే పరిగణిస్తోంది నెదర్లాండ్స్ ప్రభుత్వం. అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడితే నేరస్తుడి వయసును బట్టి సుమారు 4 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తోంది. చాలా దేశాల్లో సెక్స్ వర్కర్ల రక్షణకు ఎలాంటి చట్టాలు ఉండవు. కానీ ఈ దేశంలో వారిని వేధించినా, హింసించినా.. నాలుగేళ్లు జైలులో ఉండాల్సిందే..!
ఈజిప్ట్.. ఉరికొయ్యకు వేలాడాల్సిందే !
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన పిరమిడ్లు ఉండే ఈజిప్టులో మహిళల కోసం కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల తరహాలోనే రేపిస్టులకు బహిరంగంగా ఉరివేస్తున్నారు. అదేవిధంగా మహిళలను హింసించినా..వేధించినా మరోసారి అలాంటి నేరాలకు పాల్పడకుండా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటోంది.
ఫ్రాన్స్..15 నుంచి 30 ఏళ్ల జైలు శిక్ష..!
ఈ దేశంలో నేరం తీవ్రత, బాధితురాలి పరిస్థితి ఆధారంగా రేపిస్టులకు శిక్షలు నిర్ణయిస్తారు. నేరం రుజువైన దోషులు సుమారు 15 నుంచి 30 ఏళ్ల వరకు కారాగారంలో మగ్గిపోవాల్సిందే! ఘటన తీవ్రతను బట్టి ఒక్కోసారి జీవితఖైదు కూడా అనుభవించాల్సిందే..!
రష్యా.. 30 ఏళ్లు జైళ్లో మగ్గాల్సిందే..!
ప్రపంచంలో అతి పెద్ద దేశాల్లో ఒకటైన రష్యా మహిళల రక్షణ కోసం సాధారణ శిక్షలనే అమలు చేస్తుందని చెప్పవచ్చు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్తులకు కేవలం 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధిస్తున్నారు. అయితే మరీ తీవ్రమైన నేరమైతే సుమారు 30 ఏళ్ల వరకు కారాగారంలో ఉండాలని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.
ఈ దేశాల్లో కూడా..!
మహిళల రక్షణలో భాగంగా నార్వే ప్రభుత్వం రేపిస్టులకు 4 నుంచి 15 సంవత్సరాలు..ఇజ్రాయెల్ 4 నుంచి 16 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాయి. ఇక ఇలాంటి కేసుల్లో నేరం తీవ్రతను బట్టి దోషులకు జీవితఖైదు కూడా విధిస్తోంది గ్రీస్ ప్రభుత్వం.

ఇండియా...కఠిన చట్టాలున్నా..!
ఎన్టీఆర్ హీరోగా..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా గుర్తుందా? ఈ సినిమా క్లైమాక్స్‌లో భాగంగా ఓ కోర్టు సీన్ ఉంటుంది. ఆడపిల్లల రక్షణ కోసం భారత శిక్షాస్మృతిలో ఎన్నో కఠిన చట్టాలున్నా.. అమలు చేయడంలో అడ్డొచ్చే చిన్న చిన్న లోపాలను సరిగ్గా ఎత్తిచూపుతాడు ఎన్టీఆర్. మహిళల రక్షణ కోసం 2013లో ‘నిర్భయ’ చట్టం ప్రకారం ఆడపిల్లలను వెంటాడినా, కంటి చూపుతో వేధించినా నేరమే. అంతేకాదు..మహిళలను వేధిస్తే 7 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష.. ఇంకా నేరం తీవ్రంగా ఉంటే దోషులకు మరణశిక్ష విధించవచ్చని ఈ చట్టం చెబుతోంది. అయితే దీని అమలులో కొన్ని లోపాలుండడంతో బాధితులకు న్యాయం జరగడం లేదనే వాదన వినిపిస్తోంది. అందుకే ‘దిశ’ లాంటి హత్యోదంతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్న భావన చాలామందిలో ఉంది. ఈ క్రమంలో భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ మానవ మృగాలకు ఉరిశిక్ష విధించాల్సిందేనని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరి వీరు ఆకాంక్షిస్తున్నట్లుగా ‘దిశ’ నిందితులకు మరణ దండన విధిస్తారా? లేదా? అనేది కాలమే సమాధానం చెప్పాలి..!