తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటులెంతమంది ? అంటే.. రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం అంటూ పెద్ద లిస్టే చెబుతారు. మరి హాస్య నటీమణులెంతమంది అంటే.. రమాప్రభ, కోవై సరళ అంటూ వేళ్ల మీదే లెక్కపెడతారు. కేవలం సినీ పరిశ్రమే కాదు... ప్రపంచంలో ఎక్కడైనా ఆడవారి కంటే మగవారే హాస్యంలో బెస్ట్‌ట ! కొన్ని సర్వేలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. అంతేకాదు సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న మగవారినే ఆడవారు ఎక్కువగా ఇష్టపడితే... తమ జోకులకు నవ్వే ఆడవారిపైనే మగవారు ఎక్కువగా ఫోకస్ పెడతారట. అయితే తమను కించపరిచేలా ఉన్న ఈ సర్వేనే ఓ పెద్ద జోక్ అంటున్నారు కొంతమంది మహిళలు. మరి ఈ కథేంటో ఓసారి చూద్దాం రండి !

ఒక్క చిత్రంతోనే విషయం తేలిపోయింది !
అసలు హాస్యంలో ఎవరు గొప్ప ? అనే అనుమానం ఎందుకొచ్చిందో తెలీదు కానీ వేల్స్‌లోని అబరీస్ట్‌విత్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం సహకారంతో ఈ విషయంపై పరిశోధనలు జరిపారు. దాదాపు అయిదు వేలమందిపై జరిపిన 28 పరిశోధనల ఫలితాలను విశ్లేషించిన వారు హాస్యాన్ని పండించడంలో మగవారే భేష్ అని తేల్చేశారు. ఈ పరిశోధనల్లో చాలావరకు ఒక చిత్రాన్ని ఇచ్చి దానికి హాస్యపూరితమైన శీర్షిక పెట్టమని కోరిన పరీక్షలే ఎక్కువ. ఇందులో న్యాయనిర్ణేతలు ఎటువంటి లింగభేదం చూపించకుండా ఉండేందుకు శీర్షిక పెట్టిన వ్యక్తి ఆడా లేక మగా అనే విషయాన్ని తెలియకుండా జాగ్రత్త తీసుకొన్నారు. దీని ప్రకారం 63% మంది పురుషులు ఆడవారి కంటే ఎక్కువ హాస్య చతురత ప్రదర్శించారని పరిశోధకులు పేర్కొన్నారు.

సైకాలజీ కూడా అదే చెబుతోంది !
కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు కూడా మహిళల కంటే మగవారే ఫన్నీగా ఉంటారని తెలుపుతున్నారు. ఇందుకు సామాజికంగా, పరిణామ పరంగా కొన్ని కారణాలున్నాయంటున్నారు. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో మనస్ఫూర్తిగా పగలబడి నవ్వలేని చాలామంది మహిళల్ని మీరు చూసే ఉంటారు. అందుకు కారణం ఇంటా-బయటా వారు కుదించుకుపోయి ఎదగటమే ! ఈ ఆధునిక కాలంలో కూడా చాలామంది ఇళ్లలోని అమ్మాయిలు బిగ్గరగా నవ్వడానికి, పెద్దగా మాట్లాడడానికి సంకోచిస్తున్నారంటే మహిళలు హాస్యంలో ఎందుకు వెనకబడ్డారో వూహించొచ్చు. అదే అబ్బాయిలకైతే ఈ సమస్య ఉండదు. వారికి ఏదంటే అది వ్యక్తపరిచే స్వేచ్ఛ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇక బయటైతే చెప్పక్కర్లేదు ! ప్రతి ఒక్కరిలో ఓ 'జబర్దస్త్ రాజా' ఉంటాడనాల్సిందే ! అయితే అందరూ ఒకే పరిస్థితుల్లో ఎదగరు కనుక మహిళలంతా అలానే ఉంటారనుకుంటే పొరబాటే. కానీ హాస్యంలో పర్సంటేజీ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం మహిళలకంటే మగవారి శాతమే ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు కూడా అంటున్నారు.
అందుకేనేమో వారంటే ఇష్టం !
డేటింగ్‌లో హాస్య చతురత అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇరువురూ ఎంతగా నవ్వితే వారి బంధం అంత బలపడినట్లే ! చాలామంది స్త్రీలు పురుషుల్లో ఎక్కువగా ఇష్టపడేది వివేకం. హాస్యానికి వివేకానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది కనుక సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉన్న మగవారినే ఆడవారు ఇష్టపడతారని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలామంది మగవారు నవ్వించడాన్ని ఓ కళగా భావిస్తారు కాబట్టి తమ జోకులకు ఎక్కువగా స్పందించే ఆడవారినే వారు ఇష్టపడతారని సైకాలజీ చెబుతోంది.

ఈ సర్వేనే ఓ పెద్ద జోక్ !
అసలు ఆడవారు గొప్పా లేక మగవారు గొప్పా ? అనే చర్చే ప్రపంచంలోకెల్లా చాలా క్లిష్టమైన విషయం. మరి ఈ స్థితిలో ఫలానా విషయంలో ఆడవారు తక్కువ అంటే వూరుకుంటామా చెప్పండి ! అందుకే మనకు అన్ని రంగాల్లో సమ ప్రాధాన్యం ఇవ్వకుండా చేస్తున్న పురుషాధిక్య ధోరణిపై ఆగ్రహంతో ఉన్న కొంతమంది మహిళలు అసలు ఈ సర్వేనే ఓ జోక్‌లా ఉందంటూ పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. ప్రపంచంలో పురుషులతో సమంగా నవ్వించే మహిళా స్డాండప్ కమెడియన్లు చాలామందే ఉన్నారని వారు ఉదహరిస్తున్నారు. అంతేనా.. ఇటువంటి సర్వేలన్నీ హాస్యాస్పదమనీ, బోరింగ్ అనీ కొట్టిపారేస్తున్నారు. కాలంతో పాటు డబ్బునీ వృథా చేసే ఇటువంటి సర్వేలపై కాకుండా ఇతర విషయాలపై దృష్టిపెట్టాలని వారు పరిశోధకులకు సూచిస్తున్నారు.