బాస్‌తో ముఖాముఖి మీటింగ్స్ లేవు.. బ్రేక్స్‌లో కొలీగ్స్‌తో పిచ్చాపాటీ మాట్లాడుకునే అవకాశమే కరువైంది.. పని చేయాలనిపించినా, చేయాలనిపించకపోయినా ల్యాప్‌టాప్‌కు కళ్లప్పగించాల్సిందే..! పైగా రాత్రైనా ఎడతెగని పని.. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఇంటి నుంచే పనిచేస్తోన్న చాలామంది ఉద్యోగుల మనోవేదన ఇది! దీంతో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ హాయి హాయి అనుకున్న వాళ్లంతా ఈ పద్ధతి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. నెలలకు నెలలు నాలుగ్గోడల మధ్య గడిపే సరికి చాలామందికి ఈ పని విధానమంటేనే విసుగొచ్చేస్తుంది. అలాంటి వారికి సరికొత్త పని సంస్కృతిని పరిచయం చేస్తున్నాయి కొన్ని టూరిజం సంస్థలు. ఎంచక్కా దాన్ని ఉపయోగించుకుంటూ ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే, మరో పక్క పనిలోనూ నాణ్యతను పెంచుకుంటున్నారు ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు. ఇంతకీ పనికి, టూరిజంకు సంబంధమేంటి? పనిలో ఉత్సాహాన్ని, నాణ్యతను పెంచే ఆ పద్ధతేంటి? ఇంకా దాంతో ఏమేం ప్రయోజనాలున్నాయి? మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి!
కరోనా రాక ముందు ‘మాకు కనీసం ఒక్క రోజైనా ఇంటి నుంచి పనిచేసే అవకాశమిస్తే బాగుండు!’ అనుకున్న వాళ్లు బోలెడంత మంది! అలాంటిది ఇప్పుడు ఆ పద్ధతి మాకొద్దు బాబోయ్ అంటూ విసుగెత్తిపోతున్నారు. కారణం.. నెలల తరబడి నాలుగ్గోడల మధ్య.. అదీ నిరంతరాయంగా పనిచేయాల్సి రావడమే! తద్వారా ఉద్యోగుల్లో ఉత్సాహం సన్నగిల్లుతోంది.. ఒత్తిడి పెరిగిపోతోంది.. ఇది అంతిమంగా కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగానికే ఎసరొస్తే మొదటికే మోసమొస్తుంది. అందుకే ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రస్తుతం చాలామంది ఎంచుకుంటోన్న ప్రత్యామ్నాయ మార్గమే ‘వర్కేషన్’.

అసలేంటీ ‘వర్కేషన్’?
ఈ పేరే చెబుతోంది.. ఇందులో ఎంతటి ఉత్సాహం, ఉల్లాసం దాగుందో! వర్క్+వెకేషన్ అనే రెండు పదాల కలయికగా వచ్చిన ఈ సరికొత్త ట్రెండ్‌లో భాగంగా ఓవైపు విహారయాత్రను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు వృత్తిని కొనసాగించచ్చు! వెకేషన్ అంటే వారం పది రోజులు కాదు.. మీకు నచ్చినన్నాళ్లూ నచ్చిన ప్రదేశం నుంచి పని చేయచ్చు. పని వేళల్లో కంప్యూటర్‌తో కుస్తీ పడుతూ, మిగతా సమయంలో విహారయాత్రను ఎంజాయ్ చేయచ్చు. నిజానికి ఈ పని సంస్కృతి విదేశాల్లో కామనే అయినా మనదేశంలో మాత్రం ఐదేళ్ల క్రితమే మొదలైంది. కానీ కరోనా పుణ్యమాని ప్రస్తుతం ట్రెండ్‌గా మారిపోయింది. ఒకప్పుడు కంపెనీలు, ఆయా టూరిజం సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని తమ ఉద్యోగుల్ని వర్కేషన్‌కి పంపించేవి! కానీ ఇప్పుడు సంస్థ ప్రమేయం లేకుండా ఉద్యోగి వ్యక్తిగతంగా తమకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకొని, అక్కడి నుంచే పనిచేయచ్చు. ఇందుకోసం ఆయా టూరిజం సంస్థలు వర్కేషన్‌ని ఎంచుకునే ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి.

ఎక్కడికెళ్లినా వై-ఫైకి ఢోకా లేదు!
మీరు ఎంచుకునేది పర్వత ప్రాంతాలైనా, కొంతమందికే పరిమితమైన రిసార్టులైనా, సిటీకి దూరంగా ఉండే ప్రాంతాలైనా.. ఇలా ఎక్కడైనా సరే.. పెద్దవాళ్ల పనికి, చిన్న పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు భంగం వాటిల్లకుండా ఉండేలా శక్తిమంతమైన వై-ఫై సదుపాయాన్ని కల్పిస్తున్నాయి ఆయా టూరిజం సంస్థలు. అంతేనా.. మీరు వెళ్లిన చోట పరిశుభ్రత గురించి చింత లేకుండా తగిన శానిటైజేషన్ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. వైద్య సదుపాయాలూ అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే ఉద్యోగులు కూడా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కరోనా నుంచి రక్షణ కోసం పెద్ద పెద్ద హోటళ్లు కాకుండా.. ఇతరులతో సంబంధం లేకుండా, సామాజిక దూరం పాటించేందుకు వీలుగా చిన్న చిన్న రిసార్ట్లనే ఎంచుకుంటున్నారట! అమ్మో.. రిసార్టులు, పైగా సకల సదుపాయాలు.. ఖర్చు తడిసి మోపెడవుతుందేమో అనుకుంటున్నారా? అలాంటి భయం అక్కర్లేదు.. ఎందుకంటే తక్కువ ఖర్చుతోనే వర్కేషన్‌ను ఎంజాయ్ చేసే మహదవకాశాన్ని ప్రస్తుతం చాలా టూరిజం సంస్థలు అందుబాటులోకి తెచ్చాయని చెబుతున్నారు నిపుణులు. ఇక పలు ప్రైవేటు టూరిజం సంస్థలతో పాటు ప్రభుత్వ టూరిజం సంస్థలు సైతం వర్కేషన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచే ఎక్కువ మంది ఉద్యోగులు వర్కేషన్‌ని ఎంచుకుంటున్నట్లు టూరిజం సంస్థలు చెబుతున్నాయి.
ఎలా ప్లాన్ చేసుకోవాలి?

వర్కేషన్‌కి ఒంటరిగా లేదంటే కుటుంబంతో కలిసి అదీ కాదంటే మీ వర్కింగ్ టీమ్‌తో కలిసి.. ఇలా ఎలాగైనా వెళ్లచ్చు. అయితే వెళ్లే ముందు మాత్రం మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? అక్కడ వర్కేషన్‌కు సంబంధించిన సకల సదుపాయాలున్నాయా? పని చేసే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఆయా టూరిజం సంస్థలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయా? వెళ్లిన చోట ఆహార సదుపాయాలు ఎలా ఉన్నాయి? వంటివన్నీ ప్లానింగ్‌లో భాగంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా టూరిజం సంస్థలతో మాట్లాడొచ్చు.. అలాగే టూరిజం వెబ్‌సైట్స్‌లో ఉన్న యూజర్ రేటింగ్ ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు. ఇక వెళ్లేటప్పుడు మాత్రం కొవిడ్ నిబంధనలు పాటించడం, మీకు కావాల్సిన వస్తువులన్నీ మర్చిపోకుండా వెంట తీసుకెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
|
ఎన్నెన్నో ప్రయోజనాలు!

ఎప్పుడూ ఒకే చోట కూర్చొని, నిరంతరాయంగా పని చేయడమంటే ఎవరికైనా బోర్ కొట్టడం సహజం. అదే మనకు నచ్చిన ప్రదేశంలో కొన్నాళ్ల పాటు మన పనిని కొనసాగిస్తే ఆ హాయే వేరు. ఈ క్రమంలోనే వర్కేషన్ ఉద్యోగులకు వరంగా, వారి పనిలో నాణ్యతను పెంచే దివ్యౌషధంగా ఉపయోగపడుతుందంటున్నారు కార్పొరేట్ నిపుణులు. * పగలూ రాత్రి పని అంటే విసుగొచ్చేస్తుంది. అదే పని పూర్తయ్యాక మనకు నచ్చిన ప్రదేశాన్ని చూడ్డానికి వెళ్దామంటే చకచకా పని ముగించేస్తాం. ఈ ఉత్సాహం మనతో మరింత ఫలవంతంగా పని చేయిస్తుంది.. మనలోని ఒత్తిళ్లను దూరం చేస్తుంది. అంతిమంగా ఇది మన కెరీర్‌కు ప్లస్ పాయింట్ అన్నట్లే కదా! వర్కేషన్‌లో ఆ ఉత్సాహం దొరుకుతుంది. * వర్కేషన్‌లో భాగంగా పగలంతా పనిచేసినా, సాయంత్రాలు అలా ఏ బీచ్‌కో, అక్కడ చూడదగిన ప్రదేశాలకో వెళ్లి సేద దీరచ్చు. ఈ క్రమంలో పని వల్ల కలిగిన ఒత్తిడి, అలసటను దూరం చేసుకోవచ్చు. మరుసటి రోజు మరింత ఉత్సాహంగా పని మొదలుపెట్టచ్చు. ఇలా ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసే అద్భుతమైన ప్రత్యామ్నాయమే వర్కేషన్. * ఇంటి నుంచి పని అనుకోండి.. మనకు నచ్చినా, నచ్చకపోయినా అదే నాలుగ్గోడల మధ్య కూర్చొని పనిచేయాల్సి వస్తుంది. అదే వర్కేషన్ అనుకోండి.. రిసార్ట్ బయటికి వచ్చి లేదంటే బీచ్ పక్కనే కూర్చొని, పచ్చటి ప్రకృతిలో సేదదీరుతూ.. ఇలా మనం పని చేసుకోవడానికి బోలెడన్ని ఆప్షన్లుంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చొని పనిచేస్తే ఎంత హాయిగా ఉంటుందో కదూ! పనిలో నాణ్యత పెంచుకోవడానికి ఇదీ ఓ మార్గమే..! * వర్కేషన్ వల్ల పనిలో నాణ్యత పెరగడమే కాదు.. ఆరోగ్యమూ మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు వెళ్లిన ప్రదేశంలో ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన వంటకాలు ఎన్నో ఉంటాయి. మితంగా వాటి రుచిని ఆస్వాదించారంటే అటు ఆరోగ్యం.. ఇటు ఎంజాయ్‌మెంట్.. మామూలుగా ఉండదు.. కాదంటారా? * ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా సృజనాత్మకత పెరుగుతుంది.
|
ఇవి గుర్తుంచుకోండి!

‘అరె.. ఈ వర్కేషన్ ఏదో బాగుందే!’ అని వెళ్లి నచ్చినట్లుగా ఎంజాయ్ చేయడం కాకుండా.. కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మసలుకుంటే సక్సెస్‌ఫుల్‌గా అటు పనిని, ఇటు వెకేషన్‌ని ఎంజాయ్ చేయచ్చు. * ఎలాగో రిమోట్ వర్కే కదా అని ఎలా పడితే అలా ల్యాపీ ముందు వాలిపోకుండా ఇంటి నుంచి పని చేసినట్లే చక్కగా రడీ అయి హుందాగా పని పూర్తి చేయాలి. * నచ్చిన ప్రదేశానికి వెళ్లాం కదా అని పని మానుకొని అక్కడి ప్రదేశాలు చూడడం కాకుండా.. రోజువారీ పని పూర్తి చేయడానికి ప్రాధాన్యమివ్వాలి. ఇందుకోసం చక్కటి ప్రణాళిక వేసుకోవడం ముఖ్యం. * మీరు వర్కేషన్‌కి ప్లాన్ చేసుకునే ముందు అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయా? వై-ఫై కనెక్టివిటీ సరిగ్గా ఉందా అన్న విషయాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఇందుకు ఆయా టూరిజం సంస్థలతో మాట్లాడొచ్చు.. లేదంటే ఇంతకుముందు వర్కేషన్‌కు వెళ్లిన మీ ఫ్రెండ్స్, కొలీగ్స్‌ని అడిగి తెలుసుకోవచ్చు. * వర్కేషన్ కోసం మీరు ఎక్కడికి వెళ్లినా చేసేది మాత్రం ఆఫీస్ పనే అని గుర్తు పెట్టుకోండి. ఇందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు మీ అవుట్‌పుట్‌ని మీ బాస్‌కు చేరవేయడం, కొలీగ్స్-బాస్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండడం మాత్రం మర్చిపోవద్దు.
|
చూశారుగా.. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ విసుగెత్తిపోయిన ఉద్యోగుల పని నాణ్యతను పెంచి, వారికి ఆహ్లాదాన్ని పంచే ‘వర్కేషన్’ గురించి! అయితే ప్రస్తుతం కరోనాతో పాటు కొత్త రకం కరోనా అంటూ స్ట్రెయిన్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ఇలాంటి సమయంలో వర్కేషన్ ఎంచుకోవాలనుకునే వారు వైరస్ తీవ్రత తక్కువగా ఉండే బీచ్‌లు, కొండ ప్రాంతాలు.. ఇలా జనసమూహం తక్కువగా ఉండే వెకేషన్స్‌కి ప్లాన్ చేసుకుంటే అటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఇటు పనిని-వెకేషన్‌ని ఎంజాయ్ చేయచ్చు..!