ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో సాధించాలని, విజయతీరాన్ని చేరినవారిగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే కొందరు మాత్రమే దాన్ని నిజం చేసుకొని, తామనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. చాలామంది అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ అక్కడికి చేరుకోలేకపోవడానికి ఎన్నో కారణాలను చెబుతుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది 'నా దగ్గర అంత డబ్బు లేదు' అనే సమాధానం. అందరూ పుట్టగానే ధనవంతులు కారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ అంచంచలమైన దీక్షతో ముందడుగు వేసి ఆకాశపుటంచుల్ని తాకినవారెందరో.. కేవలం డబ్బు వల్ల కాదు.. కానీ కొన్ని లక్షణాల వల్ల విజయం మీ సొంతమవుతుంది. వాటిని అలవాటు చేసుకోవడం ద్వారా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మన లక్ష్యాన్ని చేరుకొని తీరతామంటున్నారు నిపుణులు.. మరి అవేంటో తెలుసుకుందామా..

ధైర్యం..
జీవితంలో ఏదైనా సాధించాలని గట్టిగా అనుకొనేవారికి ఉండాల్సిన మొదటి లక్షణం ధైర్యం. కానీ చాలామందిలో ఇది లోపించడం వల్ల వారు తామనుకొన్న లక్ష్యానికి చేరుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక అవసరాలు, కుటుంబ పరిస్థితులకు తలొగ్గి తమకు దొరికిన ఉద్యోగం చేస్తున్నవారు ఎంతోమంది ఉంటారు. అయితే తాము అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామనే బాధ వారిలో తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని తమ లక్ష్యాన్ని చేరుకొనే ప్రయత్నం మొదలుపెడితే.. తన కుటుంబం మళ్లీ ఎక్కడ ఇబ్బందుల పాలవుతుందనే ఉద్దేశంతో చాలామంది సామర్థ్యం, తెలివితేటలు అన్నీ ఉన్నప్పటికీ ప్రస్తుతం తామున్న పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ధైర్యం చేసి కోరుకొన్న లక్ష్యంపై దృష్టి సారించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొదట కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దీర్ఘకాలంలో అదే మీకు మేలు చేస్తుంది. అలా చేసినప్పుడే మీ గెలుపు దిశగా తొలి అడుగు పడుతుంది.

స్మార్ట్ వర్క్..
ఇటీవలి కాలంలో 'హార్డ్‌వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయడం అలవాటు చేసుకోవాల'నే మాట తరచూ వినిపిస్తోంది. అలాగని కష్టపడకుండా ఉండమని కాదు.. ఏ సమయంలో, ఎక్కడ కష్టపడాలి? ఏ విషయంలో అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు అన్న విషయం గుర్తించాలి. ఇలా చేయగలిగితే నూటికి నూరు పాళ్లు విజయం మీ సొంతమవుతుందంటే.. అతిశయోక్తి కాదు. దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలనే విషయాన్ని గుర్తిస్తే స్మార్ట్ వర్క్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. దీనికోసం ముందు ఒక రోజులో మీరు ఏయే పనులు చేయాలనుకొంటున్నారో జాబితా తయారుచేసుకోవాలి. ఆపై వాటిని ప్రాధాన్యాల ఆధారంగా ముందు, వెనక చేసేలా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల ముఖ్యమైన పనులు తప్పక పూర్తవుతాయి. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల దేనికి ఎక్కువ సమయం, శ్రమ అవసరం అవుతుందో కూడా ముందే తెలుస్తుంది. దాని ఆధారంగా మన పని మనం పూర్తి చేస్తే సరిపోతుంది. దీన్ని మీరు సాధించాలనుకొన్న లక్ష్యానికి కూడా అన్వయించుకోవచ్చు. స్మార్ట్‌వర్క్‌కి టైం మేనేజ్‌మెంట్ కూడా తోడయితే.. ఇక విజయం మీదే..!

నిర్ణయ సామర్థ్యం..
ఒక పనిని చేపట్టి.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ చాలామంది సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. పైగా ఇంకొందరికైతే ఏం చేయాలో ఇతరులు చెబితేనేగానీ చేయలేరు. ఇలాంటి లక్షణాలున్న వారు నిర్దేశించుకొన్న లక్ష్యం ఎంత చిన్నదైనప్పటికీ దాన్ని చేరుకోలేరు. కాబట్టి ఇతరుల అనుమతి కోసం ఎదురు చూడకుండా.. మీరు చేయాల్సిన పనిని చేయడం ప్రారంభించాలి. అలాగే ఏ విషయంలోనైనా సరే సొంతంగా నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇతరుల సలహా తీసుకొని దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు కానీ ఇతరులపై పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. అంతేకాదు.. మీరు చేస్తున్న పనికి మీరే బాస్‌లా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కొన్ని రోజులకు మీలోని నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి.

ఆలోచనావిధానం..
అందరికీ ఆలోచనా సామర్థ్యం ఒకే స్థాయిలో ఉంటుంది. అయితే దాన్ని ఎంత వరకు ఉపయోగించుకొంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే విషయాలపై ఆధారపడి మన తెలివితేటల్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అయితే చాలామంది తమకు అవసరమైన వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవనే నిరాశావాదంలో కూరుకుపోతుంటారు. లేదా తాము పని చేస్తున్న టీంలో తమ ఐడియాను ఏ ఒక్కరు సమర్థించకపోయినా... సరే తనను టీంలో అందరూ వ్యతిరేకిస్తున్నట్టుగా తెగ బాధపడిపోతుంటారు. ఇలాంటి వారికి ఎన్ని తెలివితేటలున్నప్పటికీ చిన్న చిన్న విషయాలకు సైతం ప్రతికూలంగా స్పందించడం, ఆలోచించడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొందరు తమకు చక్కటి ఆలోచనలున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో తడబడుతుంటారు. అయితే ఇలాంటివారు సాధన చేయడం ద్వారా తమని తాము విజయపథంలో నడిపించుకోగలరు. అలాగే.. ఇతరులకి మనం చెప్పాలనుకొన్నదాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. అందుకే తెలివితేటలకు తోడు చక్కటి ఆలోచనావిధానాన్ని సైతం పెంపొందించుకోవడం ద్వారా లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

కలసిమెలసి పనిచేసే నేర్పు..
కొందరిలో అప్పచెప్పిన పనిని సమయానికి సమర్థంగా నిర్వహించే సామర్థ్యం ఉన్నప్పటికీ వారు ఇతరులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించరు. మరికొందరు తమ బృందంలోని ఇతర సభ్యులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు తమకు తెలిసిన నైపుణ్యాలను ఇతరులతో పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఇలాంటి లక్షణాలు మీకేమైనా ఉంటే వెంటనే వదులుకోవాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ఎవరైనా సరే బృందంలో భాగంగానే పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు అనవసరమైన ఇగోలు, భేషజాలకు పోతే.. ప్రతిభ ఉన్నప్పటికీ మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకే సొంతంగా ఓ సంస్థను ప్రారంభించే ఆలోచన ఉంటే ఇలాంటి ధోరణి వల్ల కింది స్థాయి ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇతరులతో కలసి పనిచేసే తత్వాన్ని అలవరచుకోవాలి.
పట్టుదల..
లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల లేకపోయినట్త్లెతే ఎన్ని సానుకూల లక్షణాలున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించదు. అందుకే ఏదయినా పనిని చేపట్టినప్పుడు దాన్ని పూర్తి చేయాలనే దృక్పథంతో వ్యవహరించాలి. ఇది లేకపోయినట్త్లెతే.. మనం చేరాల్సిన గమ్యం తక్కువ దూరమైనప్పటికీ దాన్ని చేరుకోలేకపోవచ్చు. ఎందుకంటే.. దాన్ని చేరుకొనే క్రమంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైతే.. వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయలేం. అందుకే గట్టి పట్టుదలతో పాటుగా అనుకొన్న పనిని సాధించాలనే దీక్ష కూడా ఉండటం తప్పనిసరి.