ప్రభుత్వ రంగంలోనైనా.. ప్రైవేటు రంగాల్లోనైనా చక్కటి ఉద్యోగం తెచ్చుకోవాలంటే.. డిగ్రీ పాసవడం తప్పనిసరి. అయితే ఆర్థికపరమైన కారణాల వల్ల కొంతమంది పది, ఇంటర్‌తోనే చదువు ఆపేసి.. దొరికిన పని చేసుకొంటూ ఉంటారు. మరికొందరు ఆసక్తి లేకపోవడం వల్ల కూడా చదువుని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. తమతో పాటు కలిసి చదువుకున్న వారు ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే.. 'నేను కూడా వారిలాగా చదువుని కొనసాగించి ఉంటే చక్కగా జాబ్ చేసుకొంటూ ఉండేదాన్ని కదా' అని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. ఓ పక్క ఉద్యోగం చేయాలని ఉన్నా.. ఆ స్థాయి విద్యార్హత తమకు లేదని మనస్తాపానికి గురయ్యే వారూ లేకపోలేదు. అయితే డిగ్రీ లేకపోయినప్పటికీ మనకున్న విద్యార్హతలతోనే చక్కటి ఉద్యోగాలను తెచ్చుకోవచ్చు. మరి అందుకు కావాల్సిందేంటో తెలుసా? కాస్త ప్రతిభ మాత్రమే.
బ్యుటీషియన్..
ఇటీవలి కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ సౌందర్య పరిరక్షణ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఐబ్రోస్ నుంచి నెయిల్ ఆర్ట్ దాకా.. ఫేషియల్ నుంచి హెయిర్ కట్ వరకు.. ఇలా దేనికైనా సరే బ్యూటీ పార్లర్లనే ఆశ్రయిస్తున్నారు. దానికోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. పెళ్లి మొదలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో సైతం అందరిలోనూ అందంగా కనిపించేలా మేకప్ వేసుకొనేందుకు ఎక్కువమంది బ్యూటీపార్లర్లకు వెళ్లడం పరిపాటే. పైగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన వారు పేరొందిన బ్యూటీసెలూన్లలో పెద్ద మొత్తంలో జీతం అందుకొనే అవకాశంతో పాటు.. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసే వీలు కూడా ఉంది. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యుటీషియన్లకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి.. ఈ కోర్సులో శిక్షణ తీసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తుని సొంతం చేసుకోవచ్చు..
ఫ్యాషన్ డిజైనర్..
పది లేదా ఇంటర్ పూర్తయిన తర్వాత చదువుకి దూరంగా వెళ్లిన అమ్మాయిల్లో ఎక్కువమంది టైలరింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కాలక్షేపం అవడంతో పాటు.. ఉపాధి కూడా దొరుకుతుందనే ఆలోచనే దీనికి కారణం. టైలరింగ్‌లో ప్రవేశం ఉన్నవారు కొత్త డిజైన్లను కుట్టే విధానాన్ని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇటీవలి కాలంలో డిజైనర్ దుస్తులపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. బ్లౌజుల దగ్గరి నుంచి డ్రస్ వరకు అన్నీ తమకే ప్రత్యేకంగా ఉండాలని కోరుకొనేవారుంటున్నారు. ఈ పరిస్థితి పట్టణాల్లో మాత్రమే ఉందనుకొంటే పొరపాటే.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు సైతం తాము ధరించే దుస్తుల విషయంలో, ఫ్యాషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా వంటివి చేయడం ద్వారా మీలోని నైపుణ్యాలకు మెరుగులద్దుకోవడంతో పాటు.. చక్కటి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. మరో నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు.
ఫొటోగ్రాఫర్..
డిగ్రీ లేకపోయినా మంచి ఆదాయాన్నందించే వృత్తి ఫొటోగ్రఫీ. అభిరుచి, ఆసక్తి ఉంటే ఈ రంగంలో పెద్ద మొత్తంలోనే సంపాదించవచ్చు. ఒకప్పుడు ఫొటోలను కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే తీసుకొనేవారు. అది కూడా చాలా తక్కువ మొత్తంలోనే. అయితే పుట్టినరోజు, వివాహం, వార్షికోత్సవం, గృహప్రవేశం ఇలా ఏ శుభకార్యమైనా సరే ఫొటో, వీడియోలు తప్పనిసరిగా మారిపోయాయి. అంతేకాదు వివాహ వేడుకల్లో ఫొటోషూట్‌లు, సినిమాల్లో పాటల మాదిరిగా వీడియోలు రూపొందించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో చక్కటి ఉపాధి దొరుకుతుంది. మంచి ఫొటోలు తీయగలిగే నేర్పుతో పాటు.. ఆల్బమ్‌లను రూపొందించే విధానంలోనూ కాస్త శిక్షణ తీసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. అవసరమైతే బ్యాంకుల నుంచి లేదా ప్రభుత్వం అందించే రుణసాయం ద్వారా సొంతంగా స్టూడియో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రారంభంలో వ్యాపారం కాస్త నెమ్మదిగానే సాగినా చక్కటి ప్రతిభను కనబరిచి వినియోగదారులను ఆకట్టుకోవడం ద్వారా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఫిట్‌నెస్/యోగా ట్రైనర్..
నేటితరం యువత అందంతో పాటు.. ఆరోగ్యానికీ ప్రాధాన్యమిస్తున్నారు. తమ శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీనికోసం జిమ్‌లకు వెళ్లి మరీ కసరత్తులు చేస్తున్నారు. మరికొందరు యోగా సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో తమకోసమే ప్రత్యేకంగా ట్రైనర్‌ని నియమించుకొని ఇంట్లోనే వ్యాయామం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిట్‌నెస్, యోగా ట్రైనర్లకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి సరైన శిక్షణ తీసుకోవడం ద్వారా మీరే స్వయంగా ఫిట్‌నెస్ లేదా యోగా సెంటర్‌ను ప్రారంభించవచ్చు. శిక్షణ తీసుకొన్న అనంతరం కొంతకాలం పాటు జిమ్ లేదా యోగా సెంటర్‌లో పనిచేయడం ద్వారా కాస్త అనుభవంతో పాటు అవగాహన పెరుగుతుంది. ఆ తర్వాత మీరే స్వయం ఉపాధి దిశగా అడుగులేయచ్చు.