@teamvasundhara
మళ్లీ ఆఫీసుకు వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే!
లాక్‌డౌన్ 4.0లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులిచ్చాక ‘బ్యాక్ టు వర్క్’ అంటూ అన్ని రంగాల్లోనూ పనులు మొదలవుతున్నాయి. కరోనా భయంతో ఇన్ని రోజులు మూతపడిన కార్యాలయాలు కూడా మెల్లగా తెరచుకొంటున్నాయి. ఉద్యోగులందరూ విధులకు హాజరవుతున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్ ఎత్తేసినా..వైరస్ ఇంకా మన మధ్యనే ఉందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆఫీసుల్లో కూడా థర్మల్ స్ర్కీనింగ్‌లు, శానిటైజేషన్ నిబంధనలు అమలవుతున్నాయి. అయితే వూహించని రీతిలో విరుచుకుపడుతున్న కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కోవాలంటే ఈ జాగ్రత్తలు ఏ మాత్రం సరిపోవు. ఆఫీసులో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. మరి ఈ పరిస్థితుల్లో కార్యాలయాలు, పని ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం రండి.
ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఇవి మర్చిపోకండి!

వర్తమానాన్నే కాదు, భవిష్యత్‌ను కూడా ఎంతో ప్రభావితం చేయనున్న కరోనా ఎన్నో మార్పులను మన జీవితంలోకి తీసుకొచ్చింది. ఇక ఆఫీసుల్లో ఇంతకు ముందు ఎలా ఉన్నా ప్రస్తుతం మాత్రం సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత లాంటి వాటిని అలవాటు చేసుకోవాల్సిందే. * ఆఫీసుకే కాదు, ఇల్లు దాటి ఎక్కడికెళ్లినా ముఖానికి మాస్కు ధరించాల్సిందే. లేకుంటే స్వయంగా వైరస్‌ను స్వాగతించినట్టే. * ఆఫీసుల్లో ఏర్పాటుచేసిన శానిటైజర్ బాటిల్స్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. అయితే వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎవరికి వారే స్వయంగా ఓ శానిటైజర్ బాటిల్‌ను తెచ్చుకుంటే మంచింది. ఇది సాధ్యం కాకపోతే సోప్ పేపర్ కానీ, ఓ సబ్బును కానీ వెంట తెచ్చుకోవడం సురక్షితం. * రోజూ ఉపయోగించే వాటర్ బాటిల్స్, గ్లాస్, కాఫీ కప్పులు, స్పూన్లను కూడా ప్రత్యేకంగా తెచ్చుకుంటే వైరస్ నుంచి దూరంగా ఉన్నట్టే. * సహోద్యోగులపై ఆధారపడకుండా ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఛార్జర్లను ఎవరికి వారే వాడుకోవడం ఉత్తమం.
 * ఇక ఆఫీసుకు వెళ్లడానికి వినియోగించే మీ వ్యక్తిగత వాహనాలకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలి. జర్నీలో ఎక్కువగా టచ్ చేసే విడి భాగాలన్నింటినీ ప్రయాణానికి ముందే శుభ్రం చేసుకోవాలి. ఫోర్ వీలర్ అయితే డోర్ హ్యాండిల్, డ్యాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్, గేర్ లివర్, సీట్, సీట్ బెల్ట్ తదితర భాగాలను శానిటైజ్ చేయాలి. టూ వీలర్ వినియోగించేటప్పుడు కూడా ఈ రకమైన జాగ్రత్తలనే పాటించాలి. * సామాజిక దూరం నేపథ్యంలో టూ వీలర్‌పై ఒక్కరే ప్రయాణించడం మంచిది. * చేతులకు గ్లోవ్స్ వేసుకుంటే మరీ మంచిది. * ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కారులో ఇద్దరికి మించి ప్రయాణించకపోవడమే ఉత్తమం. అది కూడా ఒకరు ముందు సీట్లో, మరొకరు వెనక సీట్లో క్రిస్-క్రాస్ పద్ధతిలో కూర్చోవాలి. * ఇక ఆఫీసుకు వెళ్లేటప్పుడు తేలికపాటి దుస్తులు వేసుకోవాలి. బ్లేజర్లు, టైలు, పుల్ ఓవర్లు ధరించకపోవడమే ఉత్తమం.
|
పని ప్రదేశాల్లో !

* ఆఫీసుల్లో సాధ్యమైనంతవరకు లిఫ్ట్‌ను ఉపయోగించవద్దు. మరీ తప్పదంటే టిష్యూ పేపర్లు, టూత్‌పిక్‌ల సహాయంతో లిఫ్ట్ బటన్లను నొక్కండి. * లిఫ్టులో ఒకసారి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ప్రయాణించాలి. అంతకుమించి అసలు ప్రయాణం చేయకూడదు. ఇక లిఫ్ట్‌లో కూడా ఒకరికొకరు అసలు ఎదురెదురుగా నిలబడకూడదు. * ఇక మెట్ల ద్వారా వెళ్లేటప్పుడు కూడా రెయిలింగ్ వాల్స్‌ను, సైడ్ వాల్స్‌ను టచ్ చేయొద్దు. * ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేస్ మాస్కును తీయొద్దు. అదేవిధంగా మాస్కును ఎప్పటికప్పుడు రోజూ శుభ్రం చేసుకోవాలి. * ఇక పని ప్రదేశంలో కూడా కొలీగ్స్‌తో సామాజిక దూరం పాటించండి. ఈ నేపథ్యంలో మీకు, మీ సహోద్యోగికి మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండేలా చూసుకోండి.
 * వర్క్ ప్రారంభించేముందు మీ సీట్, డెస్క్‌ను కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్, కీబోర్డు, మౌస్‌లను శానిటైజ్ చేయండి. * సహచర ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కూడా కనీసం రెండు మీటర్ల దూరం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దు. విశాలమైన గదుల్లో భౌతిక దూరం పాటిస్తూనే ఆఫీసుకు సంబంధించి సమావేశాలు నిర్వహించుకోవాలి. * ఆఫీసు డోర్ హ్యాండిల్‌ను టచ్ చేసిన ప్రతిసారి చేతులను శానిటైజర్‌తో కడుక్కోవాలి. * పేపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని శాస్ర్తీయంగా నిర్ధారితం కాలేదు. కానీ పని ప్రదేశాల్లో ఫైల్స్, పేపర్స్‌ని ఎక్కువగా టచ్ చేస్తుంటాం. కాబట్టి హ్యాండ్ గ్లోవ్స్‌ను వినియోగిస్తే వైరస్ నుంచి సేఫ్‌గా ఉండొచ్చు. *ఆఫీసు ఫోన్లు/ల్యాండ్‌లైన్ ఫోన్లను వినియోగించే ముందు ఒకసారి కీ ప్యాడ్‌ను శానిటైజ్ చేయండి. *ఇక ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు నేరుగా కాకుండా బ్లూటూత్ హెడ్‌సెట్ లేదా ఇయర్ ఫోన్స్ వినియోగించండి. *ఇక భోజన సమయానికి ముందు మీ చేతులను కచ్చితంగా ఆల్కహాల్ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోండి. క్యాంటీన్‌లో కూడా ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చోవద్దు. ఎవరి వస్తువులను వారే వినియోగించుకోవాలి.
|
ఇంట్లోకి అడుగుపెట్టేముందు!

* మీరు ఉపయోగించిన మాస్కులు, గ్లోవ్స్‌లు రీయూజబుల్ కానట్లయితే వెంటనే వాటిని మూసి ఉన్న డస్ట్‌బిన్లలో పారేయండి. * మీ షూస్, చెప్పులను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకెళ్లవద్దు. వాటిని ఇంటి తలుపు బయట ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాండ్‌లోనే ఉంచండి. * మీ తాళాలు, మొబైల్ ఫోన్లు, వ్యాలెట్లు... ఇతర వస్తువులను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాతే ఇంట్లోకి తీసుకెళ్లండి. * మీ దుస్తులను మీరే శుభ్రం చేసుకోండి. మరెవరూ వాటిని ముట్టుకోకుండా జాగ్రత్త పడండి. * మీరు కూడా స్నానం చేసిన తర్వాతే మిగతా గదుల్లోకి అడుగుపెట్టండి. * ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ఆఫీసుకు వెళ్లొద్దు. తోటి సహచరులను ఇబ్బంది పెట్టొద్దు. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. తద్వారా అటు మీకు, మీ సహచర ఉద్యోగులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వైరస్ వల్ల ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
|
|