ఈ రోజుల్లో తమ పిల్లల కెరీర్ గురించి ఏ తల్లిదండ్రులను కదిపినా ఐఐటీలో చదువుతున్నారనో లేదంటే ఐఐటీలో సీటు సంపాదించాలని కోచింగ్ తీసుకుంటున్నారనో.. చెప్పడం మనం చాలాసార్లు వినే ఉంటాం. కారణం.. ఐఐటీలో సీటొస్తే ఇక వారి బంగారు భవితకు మార్గం సుగమమైనట్లే అనేది వారి భావన. అయితే దేశంలోనే అత్యున్నతంగా భావించే ఈ విద్యా సంస్థల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేరుతున్నారు. ఎందుకంటే అమ్మాయిలకు కేటాయించిన సీట్లు తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐఐటీల్లో అమ్మాయిలకు మరిన్ని సీట్లు కేటాయించాలని, తద్వారా ఐఐటీల్లో చేరాలనుకుంటున్న ఎందరో అమ్మాయిల కల నెరవేర్చాలని గతంలోనే జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే ఈ సూపర్ న్యూమరరీ సీట్ల కేటాయింపు విధానం.

దీనిప్రకారం ఐఐటీల్లో బాలికల శాతం పెంచే దిశగా ఒక్కో విద్యా సంవత్సరానికి సీట్ల సంఖ్యను పెంచుతూ పోతుంది జేఏబీ. ఈ క్రమంలో గతేడాది 17 శాతం సీట్లను అమ్మాయిలకు కేటాయించగా, ఈసారి దానికి అదనంగా మరో మూడు శాతం బాలికల కోటాను పెంచి 20 శాతానికి చేర్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారికి ఈ సీట్లు కేటాయిస్తారు. అయితే ఈ విధానం ప్రకారం బాలురకు ఉన్న సీట్లు తగ్గించకుండా, బాలికలకు అదనంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఫలితంగా బీటెక్ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య మరింత పెరగనుంది.
స్టెమ్(STEM)అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్.. ఈ రంగాల్లో పనిచేసే మహిళలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. వాస్తవానికి.. వీటికి సంబంధించిన కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిలతో పోలిస్తే చాలా తక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మనదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా భావించే ఐఐటీలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంజినీరింగ్ కాలేజీలతో పోలిస్తే.. ఇక్కడ చేరుతున్న అమ్మాయిల సంఖ్య చాలా స్వల్పమనే చెప్పుకోవాలి. ఈ విషయాన్ని గుర్తించిన జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య పెంచేందుకు సూపర్‌న్యూమరరీ సీట్ల కేటాయింపు విధానం తెరపైకి తెచ్చింది.

ఫలిస్తున్నాయా?
ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉందని, దాన్ని పెంచేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నట్లు గతంలో జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సూపర్ న్యూమరరీ విధానం ద్వారా అమ్మాయిల కోటాను పెంచాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను ఒక్కసారిగా కాకుండా మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపింది. మొదటి విడతలో భాగంగా అంటే.. 2018లో జరిపే అడ్మిషన్ల సమయంలో (2018-19 విద్యా సంవత్సరంలో) 14 శాతం సీట్లు అమ్మాయిలకు కేటాయించారు. దీంతో ఆ సంవత్సరం బాలికల కోటా 15.30 శాతానికి చేరింది. తద్వారా 1,841 మంది బాలికలు ఐఐటీల్లో ప్రవేశం పొందారు. ఇక గత విద్యా సంవత్సరంలో (2019-20) ఈ కోటాను 17 శాతానికి పెంచింది జేఏబీ. ఇలా చేయడం వల్ల మరో 300 వరకూ సీట్లు పెరిగి రెండు వేల మందికి పైగా అమ్మాయిలు ఐఐటీల్లో ప్రవేశం పొందారు. ఇక ఈ ఏడాది (2020-21 విద్యా సంవత్సరంలో) సూపర్ న్యూమరరీ సీట్ల కేటాయింపు విధానం ద్వారా ఐఐటీలో బాలికల కోటాను 20 శాతానికి పెంచినట్లు తాజాగా ప్రకటించింది జేఏబీ. దీంతో మరింత మంది అమ్మాయిల ఐఐటీ కల నిజం కానుంది. ఇలా ఏటికేడు సూపర్ న్యూమరరీ విధానం ద్వారా అమ్మాయిలకు సీట్ల శాతం పెంచి తద్వారా మరింత మంది బాలికల ఐఐటీ కల నిజం చేయాలన్న జేఏబీ వ్యూహాలు ఫలిస్తున్నాయని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

పోటీ చాలా ఎక్కువే..
ఐఐటీలో ఇంజినీరింగ్ చేసిన వారికి ఉండే క్రేజే వేరు. ఉద్యోగాలు తెచ్చుకోవడంలో, ఎంట్రప్రెన్యూర్‌లుగా మారడంలోనూ ఇక్కడ చదివిన వారే ముందుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలు ఐఐటీల్లో సీటు సంపాదిస్తే బాగుంటుందని కోరుకుంటారు. దానికోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇప్పిస్తుంటారు. అది కూడా పాఠశాల స్థాయి నుంచే వారికి నూరిపోస్తుంటారు. జేఈఈ క్వాలిఫై అయినప్పటికీ సీటు దక్కించుకోవడం కష్టం కాబట్టి విద్యార్థులు సైతం రేయనక పగలనక ఐఐటీ కోసం సిద్ధమవుతూ ఉంటారు. మనదేశంలో దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్ సహా సుమారుగా 23 ఐఐటీలున్నాయి. సీట్ల సంఖ్య సుమారుగా 13వేల వరకు మాత్రమే ఉండటంతో ప్రతి విద్యా సంవత్సరంలోనూ పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ర్యాంకు తక్కువే ఉన్నప్పటికీ సీటు దక్కించుకోవడం కాస్త కష్టంగానే మారుతోంది.
అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ..
మనదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే.. 2011లో 9287 మంది ఐఐటీల్లో సీటు సంపాదిస్తే.. అందులో 926 మంది మాత్రమే అమ్మాయిలున్నారు. 2012లో 9570 మందిలో 937మంది విద్యార్థినులు, 2013లో 9718 మందికి 908, 2014లో 9795 మందికి 861, 2015లో 9974 మందికి 900 మంది మాత్రమే విద్యార్థినులు సీటు దక్కించుకొన్నారు. 2016లో 10,500 మందిలో 848 అమ్మాయిలు మాత్రమే సీటు సంపాదించారు. ఇక 2017లో 1,062 మంది, 2018లో 1,841 మంది అమ్మాయిలు ఐఐటీల్లో సీటు సంపాదించారు. కాగా గతేడాది ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ క్రమంలో గతేడాది ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిల సంఖ్య 5,356 కావడం విశేషం. ఇక ఈ విద్యా సంవత్సరం బాలికల కోటాను 20 శాతానికి పెంచిన నేపథ్యంలో ఐఐటీల్లో ప్రవేశం పొందే అమ్మాయిల సంఖ్య మరింతగా పెరగనుంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21) గాను మే 17న జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష జరగనుంది. జూన్ 8న పరీక్షా ఫలితాలను వెల్లడిస్తారు.

రిజర్వేషన్లు దారి చూపిస్తాయా?
ఐఐటీల్లో లింగ సమానత్వం సాధించడానికి అమ్మాయిల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే ఉంటుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఐఐటీలో సీటు సంపాదించాలంటే.. దానికి కోచింగ్ తీసుకోవడం సాధారణ విషయంగా మారిపోయింది. ఈ క్రమంలో డబ్బు ఖర్చు పెట్టగలిగే స్థోమత ఉన్నవారు ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. అలాంటి వారే ఎక్కువగా ఐఐటీల్లో సీట్లు సంపాదిస్తున్నారు. అమ్మాయిల విషయంలో సైతం ఇదే జరుగుతోంది. ఐఐటీల్లో సీటు దక్కించుకోవాలంటే.. మెరుగైన ర్యాంకు సాధించాల్సిందే! గతంలో వెల్లడైన ఫలితాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అలా జరగకపోతే సీటు దక్కించుకోవడం కష్టం. దీంతో జేఈఈ క్వాలిఫై అయినప్పటికీ చాలామంది అమ్మాయిలు ఐఐటీల్లో అడ్మిషన్ సాధించలేకపోతున్నారు. అలాంటి వారికి సూపర్ న్యూమరరీ పద్ధతిలో కేటాయించిన సీట్ల వల్ల ఐఐటీల్లో చదివే అవకాశం లభిస్తుంది.
రెండుసార్లు పరీక్ష..
జేఈఈ మెయిన్స్ పరీక్ష గతేడాది నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ పరీక్షను గత సంవత్సరం నుంచి జనవరి, ఏప్రిల్ మాసాల్లో రెండుసార్లు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు వీటిలో ఒకసారి లేదా రెండుసార్లు పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. సీట్ల కేటాయింపులో రెండుసార్లు రాసిన అభ్యర్థుల బెస్ట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు హెచ్ఆర్‌డీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన అభ్యర్థులకు ఈ ఏడాది మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఉదయం (9:00-12:00) పేపర్-1, మధ్యాహ్నం (2.30- 5.30) పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్ష కోసం అభ్యర్థులు మే 1 నుంచి మే 6 వరకు https://jeeadv.ac.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12-17 వరకు అడ్మిట్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 8న ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తారు.