మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పనిచేసుకొనేందుకు.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వృత్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అనువుగా కొన్ని కంపెనీలు పలు సౌకర్యాలను, సౌలభ్యాలను మహిళలకు కల్పించడం పరిపాటే. ప్రస్తుతం అనేక బహుళజాతి సంస్థలతో పాటు పలు దేశీయ సంస్థలు కూడా కార్యాలయాల్లో మహిళలకు అవసరమైన అదనపు వసతులను సమకూర్చడానికి కృషి చేస్తున్నాయి. తద్వారా 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీసులుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒక ఆఫీసు 'ఫిమేల్ ఫ్రెండ్లీ'గా మారాలంటే ఎలాంటి అంశాలపై దృష్టిపెట్టాలో చెబుతున్నారు కొందరు మానవ వనరుల అభివృద్ధి నిపుణులు. అలాంటి వాటిలో టాప్ టెన్ అంశాలు మీకోసం...

ఉమెన్ కమిటీలు..
కొన్ని సంస్థల్లో పనిప్రదేశంలో రక్షణ, భద్రత విషయాల్లో చర్చలకు ఆస్కారం కల్పించేందుకు.. మహిళా ఉద్యోగులందరూ కలిసి ఎఫినిటీ కమిటీలను ప్రారంభించుకొనేందుకు కూడా సంస్థలు అనుమతిస్తున్నాయి. ఆ కంపెనీకే సంబంధించిన సీనియర్ అధికారిణి ఎవరైనా ఆ కమిటీకి నేతృత్వం వహించవచ్చు. పని ప్రదేశంలో ఈవ్ టీజింగ్, లింగవివక్ష లాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి కమిటీలు దోహదపడుతుంటాయి.

అధునాతన వాష్‌రూమ్స్..
కొన్ని సంస్థలు మహిళలకు అధునాతన వాష్‌రూమ్స్ సౌకర్యం అందించడంతో పాటు, వాటిలో మహిళల కోసం ఫుల్‌సైజ్ అద్దాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. తమ వస్త్రధారణ, కట్టు, బొట్టు సరిగ్గా ఉన్నాయో లేవో పరీక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే పదే పదే సింక్ వద్దకు వెళ్లి మొహం కడుక్కుంటూ పాకెట్ మిర్రర్స్‌ను వాడే బాధ తప్పుతుంది. వాష్‌రూమ్స్‌ను అధునాతనంగా తీర్చిదిద్దడం ద్వారా కూడా ఉద్యోగినులకు మరింత సౌలభ్యాన్ని కలిగించవచ్చు. అదేవిధంగా టిష్యూస్, టాయిలెట్ పేపర్ డిస్పెన్సర్స్, సోప్స్‌తో పాటు ఇతర శానిటరీ ప్రొడక్టులను కూడా మహిళల సౌకర్యార్థం వాష్‌రూమ్స్‌లో తప్పకుండా అందుబాటులో ఉంచుతున్నాయి కొన్ని సంస్థలు.

విశ్రాంతి గదులు..
మహిళలు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. వారు విశ్రాంతి తీసుకొనే విధంగా కొన్ని సంస్థలు ఆఫీసులోనే విశ్రాంతి గదులు నిర్మించడం విశేషం. అలాగే సత్వర వైద్యసదుపాయం అందించడం కోసం ఇన్‌హౌస్ మెడికల్ లేదా ఎమర్జెన్సీ కేర్ (ఫస్ట్ఎయిడ్ లేదా నర్సింగ్ కేర్) లాంటి వాటిని కూడా ఆఫీసులోనే ఏర్పాటు చేస్తున్నాయి.

స్టోర్స్‌లో ఇవి ఉండేలా..
ఆఫీసులో ఉండే ఇన్‌హౌస్ స్టోర్స్‌లో మహిళలకు సంబంధించిన అత్యవసరమైన వస్తువులు అన్నీ కూడా లభ్యమయ్యేలా ప్లాన్ చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ స్టోర్స్‌లో అత్యవసర మందులు, ఇతర ఆరోగ్య ఉత్పత్తులతో పాటు శానిటరీ ప్యాడ్స్, వైప్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి. అలాగే ఆఫీసు క్యాంటీన్లలో బలవర్థకమైన ఆహారం, గ్లూకోజ్, పండ్లు వంటివి అందుబాటులో ఉంచుతున్నారు.

వ్యాయామం కోసం..
కొన్ని బహుళజాతి సంస్థలు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థలోనే ప్రత్యేక వ్యాయామ శాలలను కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు లేదా బ్రేక్ సమయంలో మహిళా ఉద్యోగినులు వీటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా తమ ఫిట్‌నెస్‌ని పెంచుకుంటూ, ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవచ్చు. ఇలాంటి వ్యాయామశాలల్లో తమ వీలును బట్టి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ మానసిక ఉత్తేజాన్ని కూడా పెంచుకోవచ్చు. తద్వారా మరింత ఉత్సాహంగా కూడా పనిచేయచ్చు. కొన్ని సంస్థలు మహిళల్లో మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' తరగతులను కూడా నిర్వహించడం విశేషం.

సర్వీస్ సౌకర్యం..
పనిచేసే మహిళలు ఆఫీసులో గడిపే బిజీ షెడ్యూల్‌ను బట్టి వారి సొంత పనుల్లో సహాయపడేందుకు కూడా కొన్ని బహుళజాతి సంస్థలు ఏర్పాట్లు చేయడం విశేషం. ఉదాహరణకు ఫ్లైట్, ట్రైన్ టికెట్స్ బుకింగ్, కరెంటు బిల్లు కట్టడం.. లాంటి పనులు ఉద్యోగినుల తరఫున చేయడం కోసం కొంతమంది సర్వీసు ఏజెంట్స్‌ను కూడా నియమిస్తున్నాయి పలు సంస్థలు. తమ వీలును బట్టి ఉద్యోగినులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

పిల్లలకు క్రెష్ సౌకర్యం..
వర్కింగ్ మదర్స్ సౌకర్యార్థం వారి పసిపిల్లల కోసం ఇన్‌హౌస్ క్రెష్ సౌలభ్యాన్ని కల్పించే దిశగా నేడు అనేక కంపెనీలు కృషి చేస్తున్నాయి. వీటివల్ల ఇంట్లో పసిపిల్లలను ఒంటరిగా విడిచిపెట్టి వచ్చామన్న భావన, దిగులు తల్లుల్లో తగ్గుతుంది. అప్పుడప్పుడు బ్రేక్స్‌లో తమ బిడ్డల వద్దకు వెళ్లి కనిపించి, పాలు పట్టి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఉల్లాసం.. ఉత్సాహం కోసం..
అదేవిధంగా మహిళలకు మానసిక ఉత్తేజం కలిగించడం కోసం.. వారిలోని టాలెంట్‌ను మెరుగుపరచడం కోసం అప్పుడప్పుడు ఆఫీసులోనే వారికి వివిధ పోటీలు పెట్టడం తెలిసిందే. సంక్రాంతి లాంటి పండగలప్పుడు ముగ్గుల పోటీలు, అలంకరణ పోటీలు, చిన్నచిన్న ఆటల పోటీలు, వంటల పోటీలు మొదలైన వాటి వల్ల కూడా వారిలో నూతనోత్సాహం కలుగుతుంది. ఫలితంగా వారు మరింత బాగా పనిచేయగలుగుతారు.
ఐటీ కంపెనీల్లోనూ, బహుళ జాతి సంస్థల్లోనూ ఇలాంటి సౌకర్యాలన్నీ ఉండడం సహజమే. అలాగని ఇలాంటివన్నీ కేవలం అలాంటి సంస్థల్లో పనిచేసే మహిళలకు మాత్రమే అందుబాటులో ఉండాలని, ఉంటాయని కాదు. మీరు కూడా ఇలాంటి సౌకర్యాలను, సౌలభ్యాలను మీరు పనిచేస్తున్న ఆఫీసుల్లో కల్పించేందుకు మీకున్న పరిధిలో కృషి చేయచ్చు. ఇంకా మీకెలాంటి వసతులు కల్పిస్తే బాగుంటుంది.. మీ రక్షణ, భద్రతకు ఎలాంటి పద్ధతులు పాటించాలో కూడా సంస్థ అధికారులకు తెలియజేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మీ కార్యాలయాన్ని 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీస్‌గా ఎలా మార్చుకోవచ్చో ఆలోచించండి. అలాగే మీ ఆలోచనలను, అభిప్రాయాలను వసుంధర.నెట్ వేదికగా కింది కామెంట్ బాక్స్ ద్వారా ఇతర మహిళలతో కూడా పంచుకోండి...