ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. దాన్నే ఉపాధిగా మలచుకుని డబ్బు సంపాదిస్తే.. అదే డ్రీమ్ జాబ్. కానీ చాలామందికి డ్రీమ్ ఒకటుంటే చేసే ఉద్యోగం మరొకటి ఉంటుంది. ఈక్రమంలో జీవితమంతా ఏదో ఉదాసీనతతో ఉంటుంటారు. అయితే నిజంగా ఇలా డ్రీమ్ జాబ్ దొరక్కపోతే బాధపడాలా ? డ్రీమ్ జాబ్ సంపాదించిన వారు చాలా సంతోషంగా ఉంటున్నారా ? అంటే... చాలావరకు కాదు అనే సమాధానం వస్తుంటుంది. ఎందుకంటే డ్రీమ్ జాబ్ సంపాదించిన అందరూ కూడా ఆ ఉద్యోగంలో టార్గెట్స్ చేరుకోలేక ఒత్తిడికే గురవుతుంటారు. ఇక డ్రీమ్ జాబ్ రాకపోయినా ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి పొందుతున్న వారు ఎంతమందో ఉన్నారు. అందుకే మీ జీవితంలో డ్రీమ్ జాబ్ గురించి ఉండే కొన్ని అపోహలను తొలగించుకోండి అంటున్నారు మానసిక నిపుణులు. మరి ఆ సంగతేంటో చూద్దాం రండి...

కలల ఉద్యోగం లభిస్తే జీవితం సంతృప్తిగా సాగుతుంది
ఉద్యోగం గురించి చాలామంది చెప్పే మాట జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్. అంటే చేసే పని పట్ల సంతృప్తిగా ఉండడం. చాలామందికి సంతృప్తిగా ఉండడం అంటే అనుకున్నంత జీతం లభించడం, సాధ్యమైనంత తక్కువగా పనిచేయడం అనే భావన ఉంటుంది. అలాంటప్పుడు మీ కలల ఉద్యోగం మీకు సంతృప్తిని ఇస్తుందనేది ఎప్పటికీ జరగదంటున్నారు కొంతమంది మానసిక నిపుణులు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎంత కలల ఉద్యోగమైనా ప్రారంభంలో జీతం విషయంలో రాజీ పడక తప్పదు. ఇక బయట నుంచే కాక మీ కొలీగ్స్ నుంచి కూడా పోటీ ఉన్నప్పుడు సాధ్యమైనంత తక్కువ పని చేయడం అనేది జరగదు. కాబట్టి చిన్నప్పటి నుంచి కలల ఉద్యోగం లభిస్తే జీవితం సంతృప్తిగా సాగుతుందనే అపోహను నమ్మవద్దని అంటున్నారు మానసిక నిపుణులు.

కోరుకున్న ఉద్యోగం లభించకపోతే ఆనందంగా ఉండలేం
బాల్యం నుంచి చాలామందికి తమ సన్నిహితుల ద్వారా తరచూ వినిపించే అపోహ ఇది. ఉద్యోగమే కాదు ఏ విషయంలోనైనా అనుకున్నది జరగకపోతే బాధే ఉంటుంది. అయితే అనుకున్న ప్రతీదీ జరుగుతుందన్న గ్యారెంటీ లేదనేది చాలామంది ఒప్పుకునే విషయమే. అలాంటప్పుడు కోరుకున్న ఉద్యోగం కాకుండా మరో ఉద్యోగం చేస్తున్నందుకు బాధ ఎందుకు? ఇది కాస్త తత్వంతో కూడుకున్నదైనా ఆలోచిస్తే అర్థం ఉందంటున్నారు నిపుణులు. ఇలా బాధపడటానికి ముఖ్య కారణం చిన్నతనం నుంచి ఈ రకమైన అపోహలో ఉండడమేనట. డ్రీమ్ జాబ్ అయినా మరేదైనా సంతోషమనేది వచ్చిన దానిని స్వీకరించే తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ, పోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చేది కాదంటున్నారు. మరి ఇకనుంచైనా ఈ అపోహను వీడతారు కదూ !

డ్రీమ్ జాబ్ లభిస్తే కష్టపడి పని చేయక్కర్లేదు !
ఇది కోరుకున్న ఉద్యోగం లభించిన కొంతమందిలో ఉండే అపోహ. అసలు ఈ లోకంలో కష్టమనేది లేకుండా ఏ పని జరుగుతుంది చెప్పండి ! కలలు కనే ఉద్యోగం లభించగానే కలిగే ఉత్సాహం నుంచి ఈ అపోహ పుట్టుకొచ్చిందంటున్నారు నిపుణులు. ‘డ్రీమ్ జాబ్ వస్తే కష్టపడనక్కర్లేదు’ అనే వారిని కొంత కాలం తర్వాత ఉద్యోగం ఎలా ఉంది ? అనే ప్రశ్న అడిగితే, మళ్లీ వచ్చే సమాధానం వేరుగా ఉంటుందట. ఎంత ఇష్టపడి చేసే ఉద్యోగం అయినా తోటి కొలీగ్స్‌తో పోటీ పడకపోతే ఉన్నతి సాధ్యం కాదు. అలాంటప్పుడు వారి కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కొత్త కొత్త అప్‌డేట్స్ కోసం పరితపించాల్సి ఉంటుంది. గతంలో నేర్చుకున్న నైపుణ్యానికి నూతనత్వాన్ని జోడించాల్సి ఉంటుంది. మరిదంతా కష్టపడకుండా జరుగుతుందా ?అందుకే ఇది కేవలం అపోహ మాత్రమే.

కలల ఉద్యోగం లభిస్తే మరో చోట పని చేయక్కర్లేదు !
ఇది కూడా అపోహే అంటున్నారు నిపుణులు. జీవితంలో ఎవరైనా కూడా ఒక సంస్థలో సుదీర్ఘకాలం పాటు పని చేయవచ్చేమో కానీ ఒకే సంస్థలో జీవితాంతం పనిచేయడం సాధారణంగా జరగదు. అలాంటప్పుడు కోరుకున్న ఉద్యోగం లభిస్తే మరో చోట పని చేయక్కర్లేదని ఎలా నమ్మగలం ? కొంతమంది విషయంలో ఏవైనా మినహాయింపులు ఉంటే ఉండచ్చు కానీ, అందరి విషయంలోనూ, అన్ని సందర్భాలలోనూ ఇది సాధ్యం కాకపోవచ్చంటున్నారు నిపుణులు.

డ్రీమ్ జాబ్‌లో ఉంటే అసలు పని చేస్తున్నట్టే ఉండదు !
మనం చేసేదేదైనా పనే. అలా కాకుండా చేస్తున్న పని పనిలా ఉండడం లేదంటే సరైన శ్రద్ధ పెట్టకపోవడం కూడా కారణం కావచ్చంటున్నారు మానసిక నిపుణులు. అందుకే డ్రీమ్ జాబ్ చేస్తున్నప్పడు మరింత శ్రద్ధ పెట్టేవారే ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్తారంటున్నారు. అలా కాకుండా డ్రీమ్ జాబ్‌లో తాము చేస్తున్న పని అసలు పనిలా లేదన్నారంటే వారు ఉన్నతి కోసం ప్రయత్నించడం లేదని అర్థమట. ఉదాహరణకు ఒక రచయితనే తీసుకుందాం. ఓ కథ రాస్తున్నాడంటే సమకాలీన రచయితలతో పోటీ పడి తన రచనా శక్తిని చాటుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడే అతడికి ఒక టార్గెట్ ఏర్పడిందన్న మాట. ఒక టార్గెట్ అంటూ ఫిక్స్ అయ్యాక దానిని ఒక పనిలా శ్రద్ధ కనబరచకపోతే ఉన్నతి అసాధ్యం. అందుకే ఇది కూడా ఒక అపోహ మాత్రమేనట.
చూశారుగా... కోరుకున్న ఉద్యోగం దొరికితే ఆనందంగా ఉండచ్చేమో కానీ.. అంత మాత్రాన అసలు కష్టపడకుండా, పని చేయకుండానే అందులో ఉన్నతిని సాధిస్తామని మాత్రం కాదు. ఎక్కడైనా సరే ‘కష్టే ఫలి’ అన్నదే నిజం ! కాబట్టి ‘డ్రీమ్ జాబ్’ గురించి ఎక్కువగా ఆలోచించకుండా దొరికిన ఉద్యోగంలోనే కష్టపడి మరింత పైకెళ్లడానికి ప్రయత్నిద్దాం.. ఏమంటారు??