2020 నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవం తాలుకూ ప్రభావం మొదలవుతుందనేది నిపుణుల మాట. ఇందులో భాగంగానే ఆటోమేషన్, కృత్రిమమేధ, రోబోటిక్స్ వంటివి రానున్న దశాబ్దాన్ని శాసించనున్నాయి. మరి వాటి ప్రభావం మహిళల ఉద్యోగ ప్రస్థానంలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది? కొత్త దశాబ్దిలో మహిళలు ఎలాంటి మార్పులని ఆహ్వానిస్తే నిశ్చింతగా ఉద్యోగాల్లో దూసుకుపోతారు? తెలుసుకుందాం..
* ప్రతిభావంతులైన మహిళలకు 30లలో ఎదురయ్యే అతి పెద్ద చిక్కు ప్రశ్న... కుటుంబమా? కెరీరా? అని! గతంలో అయితే ఎటూ తేల్చుకోలేకపోయేవారు. రాబోయే దశాబ్ది ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తోంది. ఆటోమేషన్ పుణ్యమాని స్మార్ట్ పరికరాల సాయంతో అటు కుటుంబాన్ని చూసుకుంటూనే, ఇంటి నుంచే ఆఫీసు పనులు చక్కబెట్టే అవకాశం వస్తుంది. ఆ రకంగా ప్రతిభావంతులైన మహిళల శక్తిసామర్థ్యాలని వినియోగించుకునే అవకాశం అటు సంస్థలకీ అందుతుంది.

* వ్యవసాయం, వృత్తులు, విద్యుత్, కంప్యూటర్ల రాక... మొదటి మూడు పారిశ్రామిక విప్లవాలకి కారణమైతే నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, రోబోటిక్స్ వంటివి మూలస్తంభాలుగా ఉండనున్నాయి. మనమే రంగంలో ఉన్నాసరే పైన చెప్పిన రంగాల ప్రభావం మనపై ఎలా ఉంటుందో తెలుసుకుని అందుకనుగుణంగా మన నైపుణ్యాలని మార్చుకోవాల్సి ఉంటుంది.
* స్మార్ట్ ఇళ్లు, స్మార్ట్ పరికరాలు మహిళలకు వంటింటి శ్రమ నుంచి విముక్తి కలిగిస్తాయి. వాషింగ్ మెషీన్లు, డిష్‌వాషర్లు, స్మార్ట్ గ్యాస్ పొయ్యిలు మహిళలపై పనిభారాన్ని తగ్గిస్తాయి. దాంతో మిగిలిన సమయాన్ని కెరీర్ కోసం వెచ్చించగలుగుతారు. ఇది కూడా మహిళలకు మంచి పరిణామమే.
* గడిచిన శతాబ్దిని శాసించిన మాన్యుఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగాల్లో ఇంతవరకూ మగవాళ్లదే పైచేయిగా ఉండేది. కానీ రాబోయే కాలంలో మెడిసిన్, నర్సింగ్, టీచింగ్, సైకాలజీ వంటివి కీలక రంగాలుగా మారతాయి. తమకున్న సహజమైన నైపుణ్యాల కారణంగా మహిళలు ఈ రంగాల్లో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

* మీరంతా సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసే ఉంటారుగా! 2036 నాటికల్లా మనం ఊహ అనుకున్న ఆ సైన్స్ ప్రపంచంలోనే మనం నిజంగా జీవించాల్సి ఉంటుందని అంటున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఛైర్మన్ క్లౌస్‌శ్వాబ్. ఆయనే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ప్రకారం రోబోటిక్స్, ఆటోమేషన్, ఏఐ ప్రభావితం చేయని రంగాలు కూడా కొన్ని ఉన్నాయి. థియేటర్ ఆర్ట్స్, రచన, సైకాలజీ వంటి రంగాల్లో ఉండేవారిని పైన మనం చెప్పుకొన్న అంశాలు ప్రభావితం చేయలేవు. కారణం.. మెషీన్లు ఆ రంగాన్ని ప్రభావితం చేయవు.
* లిబరల్ ఆర్ట్స్, సైకాలజీ, సోషియాలజీ, ఆంత్రోపాలజీ వంటి రంగాలకు చెందిన ఉద్యోగాల్లో పెద్దగా మార్పు ఉండదు. ఏ రంగంలో అయినా సరే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మహిళలకు మేలు చేసే అంశాలే.
సవాళ్ల సంగతేంటి?

వేతనాల విషయంలో మహిళలు చాలా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఇదిలానే కొనసాగొచ్చు. ప్రస్తుత పరిస్థితులని బట్టి అంచనా వేస్తే మన మనవరాళ్ల తరంలో కూడా ఈ వేతన అంతరం తగ్గడానికి ఆస్కారం లేదని నివేదికలు చెబుతున్నాయి.
మీరు బ్యాంకులో ఫిక్డ్స్ డిపాజిట్ చేయాలనుకున్నారు. మొబైల్లోకెళ్లి మేక్ ఎఫ్‌డీ అనే ఒక ఒక ఆప్షన్‌తో నిమిషాల్లో పనికానిచ్చేస్తున్నారు. అదే గతంలో అయితే అలా ఉండేది కాదు. బ్యాంకుకెళ్లాలి. సమయం కేటాయించాలి. సిబ్బందితో మాట్లాడి, సంబంధిత ఫారాలు నింపి, రెండు రోజులు ఆగిన తర్వాతే ఎఫ్‌డీ తంతు పూర్తయ్యేది. ఈ క్రమంలో మొబైల్స్ వచ్చిన తర్వాత.. ఎంతమంది పాత్ర తొలగిపోయిందో మీకు తేలిగ్గానే అర్థమయి ఉంటుంది. పది మంది చేసే పనిని ఒక యంత్రం చేస్తోంది. మరో ఉదాహరణ.. డ్రోన్లు వచ్చిన తర్వాత సినిమా చిత్రీకరణలో బోలెడు మార్పులు వస్తున్నాయి. ఖర్చు తగ్గుతోంది. రానున్న దశాబ్దంలో ఈ మార్పులు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. డ్రైవర్లు లేని కార్లు, స్మార్ట్ పరికరాలు, రోబోలు, కృత్రిమ మేధ మన పని వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అందుకనుగుణంగా మనం కూడా పూర్తిగా మారి నైపుణ్యాలు సొంతం చేసుకున్నప్పుడే ఉద్యోగాల వేటలో, సంపద సృష్టిలో మనస్థానం పదిలంగా ఉంటుంది.
- డా।। కవిత గూడపాటి, ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
|