గతంలో టైమ్ పాస్ కోసం రకరకాల మార్గాలుండేవి. కానీ ఇప్పుడు టైమ్ సేవ్ చేసుకోడానికి రకరకాల మార్గాలను వెతుకుతున్నాం. ఎందుకంటే ఈ బిజీ లైఫ్‌లో ఎవరిని అడిగినా ఒకటే సమాధానం ‘టైమ్ ఉండడం లేదు’ అని. కుటుంబ సభ్యులను సినిమాకి తీసుకెళ్లడానికి, ఇంట్లో ఏదైనా వేడుక ప్లాన్ చేయడానికి, బంధువులను కలవడానికి.. ఇలా అన్నింటికీ ఒకటే రోజు. అదే ఆదివారం ! బహుశా ఆదివారానికి నోరుంటే ‘నేనేం పాపం చేశాను.. అందరూ నా వెంటే పడతారు..’ అంటుందేమో ! క్షణం తీరిక లేకుండా ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అంతలా ప్లాన్ చేస్తుంటాం మనం. అలా కాకుండా వారానికి నాలుగు రోజులే ఆఫీసు ఉండి మిగతా మూడు రోజులు సెలవులు ఇచ్చారనుకోండి ! అబ్బ.. ఈ మాట వింటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో కదూ!! ప్రస్తుతం ఫిన్‌ల్యాండ్ ప్రధాన మంత్రి తమ దేశ పౌరుల కోసం ఇదే చేస్తున్నారు. సెలవుల వల్ల కలిగే ఈ ఆనందమే ఉద్యోగుల ఎదుగుదలకు, సంస్థ ఉన్నతికి మరింత దోహదపడుతుందని, అందుకే ఈ సెలవుల పద్ధతిని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారామె. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..

ప్రజలకు అది ఎంతో అవసరం !
34 ఏళ్లకే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి, ప్రపంచంలోనే అతి పిన్న పీఎంగా అవతరించారు ఫిన్‌ల్యాండ్ ప్రధాని సనా మారిన్. ఇటీవలే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. తమ పౌరుల కోసం ‘వారానికి నాలుగు రోజులు, రోజుకి ఆరు గంటలే పని’ అనే నిబంధనను పార్లమెంట్‌లో ప్రతిపాదించి ప్రపంచవ్యాప్తంగా పని గంటలపై చర్చించుకునేలా చేశారు. ప్రస్తుతం అక్కడ వారానికి అయిదు రోజులు, రోజుకి ఎనిమిది గంటల పని వేళలు నడుస్తున్నాయి. ఈ నిర్ణయంపై ఆమె వివరణ ఇస్తూ.. ‘ప్రజలు తమ కుటుంబంతో, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలి.. తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి మరికొంత సమయాన్ని కేటాయించుకోగలగాలని నా నమ్మకం. వృత్తి జీవితంలో మేము త్వరలో తీసుకోబోయే నిర్ణయం ఇదే’ అని తెలిపారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవడంతో నెటిజన్లు ఆమె నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కొంతమందైతే ఫిన్‌ల్యాండ్‌కు ఎలా వెళ్లాలి, అక్కడ స్థిరపడాలంటే ఏంచేయాలి అని అప్పుడే గూగుల్‌లో కూడా వెతుకుతున్నారట.

అన్నింటినీ బ్యాలన్స్ చేయడం కోసం !
వాస్తవానికి ‘వారానికి నాలుగు రోజులే పని’ అనేది ఈనాటిది కాదు. ఉత్సాహంగా తక్కువ సమయం పని చేసిన దానికి, నీరసంగా గంటలు-గంటలు పనిచేసిన దానికి పెద్ద తేడా ఉండదు. ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి కొన్ని దేశాలు. అందుకే సంస్థ నిర్వహణా ఖర్చు తగ్గించేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు, వ్యక్తిగత జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవడానికి కొన్ని దేశాలు ఈ ‘వారానికి నాలుగు రోజులే పని’ అనే ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఇలా రోజుకి పది గంటల చొప్పున మొత్తం మీద వారానికి 40 గంటల పని ఉంటుంది. ఈక్రమంలోనే గతంలో అమెరికా ఉతా రాష్ట్రంలోని ఆఫీసుల్లో విద్యుత్తుని తగ్గించుకోవడానికి, ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి, ప్రభుత్వ వాహనాలకు అవసరమయ్యే ఇంధనాన్ని తగ్గించుకోవడానికి 2008 నుంచి 2011 వరకు ఈ నియమాన్ని అనుసరించింది. అయితే మరో ప్రభుత్వం మారిన తర్వాత ఈ నియమం వారానికి అయిదు రోజులుగా మారింది. ఇప్పటికీ బ్రిటన్‌లోని పలు ప్రైవేట్ సంస్థలు ఈ ‘వారానికి నాలుగు రోజులే పని’ అనే నియమాన్ని అనుసరిస్తున్నాయి. ఇలానే అమెరికాలోని కే2 పబ్లిక్ స్కూల్ మొదలుకొని వివిధ దేశాల్లోని పలు స్కూళ్లు కూడా తమ నిర్వహణా ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పిల్లల్లో మానసికోల్లాసం పెంచడానికి కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. కాకపోతే రోజులో ఒక గంట అధికంగా పాఠాలు చెబుతారు.
మైక్రోసాఫ్ట్ తన ప్రయోగంతో రుజువు చేసింది !

వారానికి నాలుగు రోజులే పని ఉంటే సంస్థ ఉత్పత్తిపై సానుకూల ప్రభావం పడుతుందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిరూపించింది. 2019 వేసవిలో జపాన్‌లోని తమ సంస్థలన్నింటికీ వారానికి నాలుగు రోజుల పని నియమావళిని అనుసరించింది. ఇందులో శుక్రవారాన్ని పెయిడ్ లీవ్‌గా పెట్టి, ప్రతి మీటింగ్‌ను గంటకు బదులు అరగంటకు తగ్గించింది. దీంతో సంస్థ యాజమాన్యాన్ని ఆశ్చర్యపరుస్తూ వేసవిలో ఉత్పత్తి 40 శాతం పెరగగా, విద్యుత్తు 23 శాతం ఆదా అయిందట. అందుకే త్వరలో ఈ నియమాన్ని ఫుల్‌టైం చేసే ఆలోచనలో కూడా ఆ సంస్థ ఉందట. ఇక న్యూజిల్యాండ్‌లోని పర్పెట్యుల్ గార్డియన్ అనే సంస్థ కూడా ఈ ప్రయోగం చేసి సానుకూల ఫలితాలను పొందిన తర్వాత తమ సంస్థకు ఈ నియమావళిని దీర్ఘకాలం పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇక పదహారు కార్యాలయాల్లో దాదాపు 250 మంది ఉద్యోగస్తులతో ప్రయోగం చేసిన ఆక్లాండ్ యూనివర్సిటీ వారానికి నాలుగు రోజులే పని ఉండడం వల్ల ఉద్యోగస్తుల్లో ఉత్సాహం పెరిగి ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా ఉత్పత్తి బాగా పెరుగుతుందని తెలిపింది.
|
ఈ దేశాల్లో పని వేళలు చాలా తక్కువ !
అటు విద్యాలయాల్లో, ఇటు కార్యాలయాల్లో తక్కువ పని వేళల నియమావళి సత్ఫలితాలను ఇస్తుండడం ముందే గమనించిన కొన్ని దేశాలు తమ నిర్వహణా ఖర్చును తగ్గించుకోవడం కోసం, తమ పౌరుల ప్రశాంత జీవనం కోసం పని వేళలను తగ్గించాయి. వాటిలో ఈ దేశాలను ప్రముఖంగా చెప్పుకోవాలి. * తక్కువ పని వేళలు కలిగిన దేశాల్లో నెదర్లాండ్స్‌ను ప్రముఖంగా పేర్కొనాలి. ఈ దేశంలో నిరుద్యోగ శాతం చాలా తక్కువ కాగా ఆదాయం బాగా ఉంటుంది. అందుకే అక్కడి ప్రభుత్వం తమ ఉద్యోగుల వృత్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ పార్ట్‌టైం జాబ్ చేసే వారికి కూడా ప్రత్యేక చట్టాలు ఉన్నాయంటే ఉద్యోగస్తులకు ఎంతటి సానుకూల పరిస్థితులు, సౌకర్యాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెదర్లాండ్స్‌లో ఉద్యోగస్తులు సగటున పని చేసే సమయం వారానికి 27.5 గంటలే !
 * ప్రపంచ దేశాల్లోకెల్లా నార్వేలో ఉద్యోగస్తులకు చాలా ఉదారమైన చట్టాలున్నాయి. ఇందులో భాగంగానే ఇక్కడ ఉద్యోగస్తులు వారానికి సగటున 28 గంటలే పనిచేస్తున్నారు. ఇక్కడి ఉద్యోగులకు మూడు వారాల గ్రేస్ పీరియడ్ ఉండడమే కాకుండా తల్లిదండ్రులకు, స్త్రీలకు ఇంకా పనివేళలు తగ్గించే అవకాశం కూడా ఇక్కడి ప్రభుత్వం కల్పిస్తోంది. * నార్వేలానే డెన్మార్క్ కూడా తమ ఉద్యోగస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ దేశంలో విహార యాత్ర సమయాల్లో కూడా ఉద్యోగులకు జీతం లభిస్తుంది. ఇక వారు ఒత్తిడికి లోనైతే ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడి ఉద్యోగులు వారానికి సగటున 28 గంటల 20 నిమిషాలు మాత్రమే పనిచేస్తారట.
 * ఐరోపా ఖండంలో చాలా తక్కువ పని వేళలు కలిగిన దేశాల్లో జర్మనీ ఒకటి. ఇక్కడ ఉద్యోగస్తులు వారానికి సగటున 36 గంటలు పని చేస్తున్నారు. ఒకవేళ 30 గంటల కంటే తక్కువగా పనిచేస్తే వారిని పార్ట్‌టైమ్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తారు. అంతేకాక ఒక సంస్థలో ఆరు నెలల కంటే ఎక్కువ పని చేస్తే తమ పని వేళలు తగ్గించమని ఆ సంస్థను అడిగే హక్కు కూడా ఉద్యోగులకు ఉంటుంది. * ఫ్రాన్స్‌లో ఉద్యోగస్తులు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తారు. ఉదయం 08:30 నుంచి 09:30 మధ్య మొదలయ్యే వారి పని వేళలు సాయంకాలం 05:30, 6 గంటలతో ముగుస్తాయి. సగటున ఒక ఉద్యోగి వారానికి 29.7 గంటలు పని చేస్తున్నారు. * పని వేళలు తక్కువగా ఉండే దేశాల్లో స్లొవేనియాకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉద్యోగస్తులకు ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం.. ఉద్యోగం ఇచ్చే యాజమాన్యాలు తమ సంస్థలో చేరబోయే ఉద్యోగులతో ఓవర్‌టైమ్ పనిచేయించుకోవాలన్న నిబంధనేమైనా ఉంటే వారు చేరక ముందే ఆ విషయాన్ని రాత పూర్వకంగా తెలియజేయాలి. ఈ క్రమంలో ప్రతి ఉద్యోగి వారానికి 36 గంటలకు తగ్గకుండా 40 గంటలకు మించకుండా పనిచేయాల్సి ఉంటుంది.
 * చాలా దేశాల్లో చాలామంది ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్లాలంటేనే నీరసపడిపోతుంటారు. కానీ బెల్జియం దేశంలోనైతే ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారట. అందుకు ఆ దేశంలోని పనివేళలు, యాజమాన్యం చూపే ప్రత్యేక శ్రద్ధే కారణం. ఇక్కడ ఒక ఉద్యోగి వారానికి సగటున 31.5 గంటలు పనిచేస్తాడు. * ఇక విదేశాలకు వెళ్లాలంటే చాలామంది ఆసక్తి చూపే దేశం స్విట్జర్లాండ్. అక్కడ ఉద్యోగులు వారానికి సగటున 45 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదనే నిబంధన ఉంది. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులైతే వారానికి 40 గంటలకు మించి పనిచేయకూడదు. అందుకే ఇక్కడి పనివేళల సగటు వారానికి 31.75 గంటలే.
 * స్వీడన్ దేశంలో 50 గంటలు పనిచేసే ఉద్యోగులు కేవలం 1% మాత్రమే ఉన్నారంటే ఇక్కడి పనివేళలు ఉద్యోగులకు ఎంత అనుకూలంగా ఉన్నాయో అర్థమవుతోంది. అందుకే ఇక్కడి పనివేళల సగటు వారానికి 40 గంటలుగా ఉంది. * ఆస్ట్రియా దేశంలో ఉద్యోగస్తుల పనివేళలు ఉద్యోగంలో చేరే ముందు చేసుకునే ఒప్పందం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడి ఉద్యోగులు వారానికి అయిదు రోజులు పని చేస్తారు. సగటున 32.5 గంటల పని ఉంటుంది. అయితే రోజుకి 8 గంటలకు మించి చేయడానికి వీల్లేదు. అంతేకాదు, ప్రతి సంవత్సరం 25 రోజులు జీతంతో కూడిన సెలవులను కూడా ఇస్తారు.
|