ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లలో పగలు పనిచేసే వారితో పాటు రాత్రివేళల్లో పని చేసేవాళ్లూ ఉంటారు. నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వీళ్ల పని వేళలు సాయంకాలం మొదలై మరుసటిరోజు ఉదయం తెల్లవారుజామున ముగుస్తాయి. అందరూ నిద్ర లేచే సమయానికి వీళ్లు పడుకోవడం.. మధ్యరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భోజనం చేయడం.. ఇలా మిగతా వాళ్లతో పోలిస్తే వీరి దినచర్య పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ఇలా ఎక్కువకాలం నైట్‌షిఫ్ట్‌లు చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వాళ్లు చెబుతున్నారు.
పగలు కష్టపడి పనిచేయడం, రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకోవడం.. ఇది మనిషి సహజంగా పాటించే జీవన శైలి. నైట్‌షిఫ్ట్‌లలో పని చేసేవారి జీవన శైలి ఇందుకు భిన్నంగా ఉంటుంది. దీనివల్ల వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో చూద్దాం..!

సహజమైన నిద్రకు దూరం
మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి నిద్ర చాలా అవసరం. రోజంతా పనిచేసి అలసిన శరీరానికి సుఖమైన నిద్రతో విశ్రాంతి దొరుకుతుంది. దీనివల్ల ఒత్తిళ్లు దూరమై మన శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. కానీ రాత్రిపూట పని చేసేవారు క్రమంగా సహజమైన నిద్రకు దూరమవుతారు. దీనివల్ల వారిలో నిద్రలేమి సమస్య మొదలై.. క్రమంగా అది పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

రొమ్ము క్యాన్సర్
ఒక అధ్యయనం ప్రకారం పగలు పనిచేసే మహిళలతో పోలిస్తే రాత్రిపూట పనిచేసే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. ఇది క్రమం తప్పకుండా రాత్రి వేళల్లో పనిచేసే వారితో పాటు వారానికొకసారి నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వాళ్లకూ వర్తిస్తుంది.
గుండె జబ్బులు
రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో బ్లడ్‌ప్రెషర్(బీపీ)పై అధిక ప్రభావం పడి అది హార్ట్ఎటాక్ లాంటి సమస్యలకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు.

డిప్రెషన్
మిగతా వాళ్లతో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లలో పని చేసేవారు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. నిద్రలేమి, సామాజిక జీవితానికి దూరంగా ఉండడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపలేకపోవడం మొదలైన కారణాల వల్ల వాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. దీనివల్ల వారిలో ఒంటరితనం, డిప్రెషన్, మానసిక అలసట లాంటివి క్రమంగా పెరుగుతాయి.
'విటమిన్- డి'కి దూరం
సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి విటమిన్-డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది మన శరీర ఎదుగుదలకు ఎంతో అవసరం. ఈ క్రమంలో మిగతా వారితో పోలిస్తే రాత్రివేళలో పనిచేసే వాళ్లకు సూర్యరశ్మి సరిగా సోకదు. దీంతో క్రమంగా వాళ్ల శరీరంలో క్యాల్షియం శాతం తగ్గడంతో పాటు వివిధ రకాల క్యాన్సర్లకూ దారి తీస్తుంది.
అనారోగ్య సమస్యలు
నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసేవారు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఈ క్రమంలో జీవక్రియలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో శరీరంలో ఇన్సులిన్, బ్లడ్ షుగర్ పరిమాణాల్లో వూహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం(డయాబెటిస్), అధిక బరువు(ఒబేసిటీ) లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. వీటితో పాటు ఆహార పద్ధతిలో మార్పు రావడం ద్వారా జీర్ణప్రక్రియ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
ఇలా రాత్రివేళల్లో పనిచేయడం వల్ల ఇంకెన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా ఏమాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించడం మంచిది.

ఈ టిప్స్‌తో సమస్యలు దూరం..!
వృత్తిరీత్యా నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సుంటుంది. వాటిలో ముఖ్యమైనవి ఏవంటే..
* ఆఫీస్ ముగిసిన తర్వాత వెచ్చటి నీటితో స్నానం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి.
* మీ ఆఫీస్ వేళల్ని బట్టి మీ భోజన సమయాలను సరైన విధంగా ప్రణాళిక చేసుకోండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆ వేళల్లోనే భోజనం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో మీ శరీరం మెల్లిగా ఈ పద్ధతికి అలవాటు పడుతుంది.
* మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గుడ్లు మొదలైనవి తీసుకుంటే మంచిది.
* భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది కాదు. ఆకలిగా అనిపించకపోతే కనీసం ఒక గ్లాసు పాలు తాగి పడుకోవడం మేలు. దీనివల్ల మీకు సులభంగా నిద్ర పడుతుంది.
* రాత్రిపూట పని చేసేవాళ్లలో కొంతమంది పగలు సరిగా నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు. దీంతో సులభంగా నిద్రపట్టేందుకు నిద్ర మాత్రలు లాంటివి వాడుతుంటారు. వీటివల్ల భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి నిద్ర మాత్రలకు అలవాటు పడకుండా సహజంగానే నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
* పనివేళల్లో కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటివి తాగడం తగ్గించండి. వాటికి బదులు కాఫీ బ్రేక్స్‌లో ఫ్రెష్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి.
* క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం మొదలైనవి చేయడం ద్వారా అటు శారీరకంగా, ఇటు మానసికంగా శక్తిని పొందుతారు.
* వారాంతాల్లో మీ సమయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేటాయించండి. దీని ద్వారా మానసిక ఒత్తిళ్ల నుంచి మీకు కాస్త విశ్రాంతి లభిస్తుంది.