'అపురూపమైనదమ్మ ఆడజన్మ' అన్నాడో కవి. అవును.. నిజంగా ఆడజన్మ అపురూపమైందే.. అజరామరమైందే. ఎందుకంటే, ఇల్లాలిగా ఇంటి పనులన్నీ చక్కబెడుతూ.. ఆలిగా భర్తకు సేవలు చేస్తూ.. తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ.. కూతురిగా, కోడలిగా కుటుంబ అభివృద్ధికి సలహాలిస్తూ.. చేసే ప్రతి పనినీ బాధ్యతతో నిర్వర్తిస్తుంది స్త్రీ. అందుకే ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఉంటుందంటారు. అలాగని మహిళల పాత్ర కేవలం ఇంటికే పరిమితం కాదు. సమాజాభివృద్ధిలో కూడా ఎంతోమంది మహిళలు కీలక పాత్ర పోషించడం చూస్తూనే ఉన్నాం. మరి అటు ఇంట్లో, ఇటు సమాజంలో మహిళలు ఉన్నతి సాధించాలంటే వారు శారీరకంగా, మానసికంగా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం చాలా అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మహిళలు అన్నింటా శక్తిమంతులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 'మహిళా సాధికారత'లో ఆరోగ్యం పాత్ర ఎంత వరకు ఉందో తెలుసుకుందాం రండి..
మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా తయారు కావాలి. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. అలాగే ఏ వయసులో ఉన్న వారు ఆ వయసుకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

పోషకాహారంతో మొదలు..
* ఏ వయసులో ఉన్న మహిళలైనా సరే.. మంచి పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇందులో భాగంగా తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, బీన్స్, పెరుగు, మొలకెత్తిన గింజలు.. వంటి ప్రొటీన్లు ఎక్కువగా లభించే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటివల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో శక్తి ఉత్పత్తవుతుంది. అంతేకాకుండా బరువు అదుపులో ఉండి చురుగ్గా ఉండడంతో పాటు ఏ పనైనా శ్రద్ధగా చేసుకోగలుగుతారు.
* అలాగే మహిళలు నెలసరి సమయంలో కూడా ఎక్కువ శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఐరన్ ఎక్కువగా లభించే మొలకెత్తిన గింజలు, బాదం, రెడ్ మీట్.. వంటివి తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
* ఇక గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత.. మొదలైన సందర్భాల్లో కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా శక్తిమంతంగా ఉండడానికి డాక్టర్ సలహాతో మంచి పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి.
* మహిళలు పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. వంటివి రోజూ ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కాకుండా.. వాటికంటూ ఒక కచ్చితమైన సమయం నిర్దేశించుకోవాలి. అలాగే ఒకేసారి ఎక్కువ తినడం కాకుండా.. కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బయట దొరికే స్నాక్స్, జంక్‌ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిన్నిటినీ క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరానికి శక్తీ లభిస్తాయి.

రోజూ వ్యాయామం..
* శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావడానికి వ్యాయామం చాలా బాగా సహకరిస్తుంది. వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు బాగా సరఫరా అవుతాయి. తద్వారా గుండె, వూపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే కండరాలు దృఢంగా తయారవడంతో పాటు శరీరానికి శక్తి అందుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
* ఎక్సర్సైజ్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలాగంటే.. వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
* మీరెప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు వ్యాయామం చేశారా? ఒత్తిడిలో ఉన్నప్పుడు వ్యాయామమేంటి? అంటారా.. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం ద్వారా మెదడులో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాల వల్ల మనసు రిలాక్సవుతుంది. దీంతో పాటు శరీరంలో కొత్త శక్తి ఉత్పత్తవుతుంది. కాబట్టి రోజూ ఎదురయ్యే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడాన్ని రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయినట్త్లె నిద్ర కూడా సుఖంగా, ప్రశాంతంగా పడుతుంది.

వైద్య పరీక్షలు కూడా..
మహిళలు ఆరోగ్య భద్రతలో భాగంగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే చాలామంది ఒంట్లో బాగానే ఉంది కదా.. ఇప్పుడు వైద్య పరీక్షలెందుకు అనే ధోరణిలో ఆలోచిస్తారు. కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం తప్పనిసరి. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే రకరకాల ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచుకుని అవి రాకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
* బీపీ, మధుమేహం.. వంటివి యవ్వనంలో ఉన్నప్పుడు రాకపోయినా వయసు పెరిగే కొద్దీ వేధిస్తుంటాయి. కాబట్టి ముందు నుంచీ వీటిపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒక్క రక్తపరీక్ష చేయించుకోవడం వల్ల ఈ సమస్యలున్నాయో లేదో తేలిపోతాయి.
* దీంతో పాటు సంవత్సరానికోసారి దంత పరీక్ష చేయించుకోవడం, దంతాలను శుభ్రం చేయించుకోవడం, రెండేళ్లకోసారి కంటి పరీక్షలు; రోగనిరోధక శక్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపకరించే పరీక్షలు; రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తపడడానికి మమోగ్రామ్; పెల్విక్ ఎగ్జామ్, పాప్‌స్మియర్; ఎముకలకు సంబంధించిన పరీక్షలు.. మొదలైనవన్నీ నిర్ణీత సమయం ప్రకారం చేయించుకోవడం మాత్రం తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఫలితంగా ఆరోగ్యంపై సరైన అవగాహన ఏర్పడుతుంది.
నవ్వుతూ.. నవ్విస్తూ..
ఎలాంటి సమస్యలు, ఒత్తిళ్లు లేనప్పుడు మనసు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. ఎప్పుడైతే ఆనందంగా జీవితం గడుపుతుంటామో అన్ని రోజులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అలాకాకుండా అనవసరమైన వాటికి ఆందోళన చెందడం, మానసిక ఒత్తిడి, అత్యుత్సాహం.. వంటి వాటి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ, ఇతరుల్ని నవ్విస్తూ.. ఆనందంగా ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

ఆధ్యాత్మికంగా కూడా..
చాలామంది ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు ఎదురైనప్పుడు.. ప్రార్థనా మందిరానికి వెళ్లి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల బాధలన్నీ తొలగిపోయి ప్రశాంతత సొంతమవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన ద్వారా కూడా ఆరోగ్యాన్ని పొందచ్చు. ఇందుకోసం రోజూ రాత్రి పడుకోవడానికి ముందు ఒంటరిగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని కాసేపు దేవుడిని ధ్యానించడం, ప్రార్థించడం, ఆ రోజు జరిగిన తప్పులు మీకు మీరే ఒప్పుకుని.. మళ్లీ చేయకుండా మనసును దృఢపరచుకోవడం.. వంటివి చేయాలి.
వీటితో పాటు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండచ్చు.