హలో డాక్టర్. నా వయసు 22. బరువు 37 కిలోలు. ఎత్తు 5'3''. నేను చాలా సన్నగా ఉంటాను. నా స్థనాల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇటీవలే పీసీఓఎస్ సమస్య నుంచి బయటపడ్డా. అయితే నా సమస్యల్లా నా బరువు, శరీరాకృతి గురించే..! నేను బరువు పెరగాలంటే ఏంచేయాలి? అలాగే నా స్థనాల పరిమాణం పెరిగేందుకు తగిన సలహాలు, సూచనలు తెలియజేయగలరు. - ఓ సోదరి
జ: మీ ఎత్తుకి సరిపోయినంత బరువు ఉండాలంటే 50 నుంచి 55 కిలోల వరకు ఉండాలి. అయితే మీరు ముఖ్యంగా బరువు పెరగాలని, అందులోనూ స్థనాల పరిమాణం పెరగాలని కోరుకుంటున్నారు. బరువు అనేది కొంత వరకు వంశపారంపర్యంగానూ, మరికొంత వరకు ఆహారపు అలవాట్లతోనూ వస్తుంది. ఆహారంలో భాగంగా ఎక్కువ క్యాలరీలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థనాల విషయానికొస్తే స్థనాల్లో ముఖ్యంగా రెండు రకాల టిష్యూలుంటాయి. ఒకటి పాలగ్రంథి, రెండోది కొవ్వు పదార్థం. పాల గ్రంథులు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే పెరుగుతాయి. ఉదాహరణకు.. గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు. ఈ గ్రంథిని మనం కృత్రిమంగా పెంచడం వీలు కాదు. మీ శరీరం మొత్తం బరువు పెరిగితే ఆటోమేటిక్గా స్థనాల పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఉన్న బరువుతో అది సాధ్యం కాదు కాబట్టి మామ్మరీ ఆగ్మెంటేషన్ అనే ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా స్థనాల పరిమాణం పెంచవచ్చు. కానీ మీరు ప్రస్తుతం ఉన్న 37 కిలోల బరువుతో ఇటువంటివి చేయించుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అందుకని సహజ పద్ధతుల ద్వారానే బరువు పెరగడానికి ప్రయత్నించండి.