బాలీవుడ్‌కు సంబంధించి ఆరోగ్యం, ఫిట్నెస్.. వంటి విషయాల్లో శ్రద్ధ వహించే అందాల తారల్లో ముందుంటుంది శిల్పాశెట్టి. నిత్యం వ్యాయామాలు, యోగాసనాలతో పాటు తాను చేసే ఆరోగ్యకరమైన వంటకాల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. ఈక్రమంలో ఇప్పటికే రాగి దోసె, ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, బేసన్ కొకోనట్ బర్ఫీ, బనానా బ్రెడ్...వంటి ఎన్నో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను తన ఫ్యాన్స్‌కు పరిచయం చేసిందీ అందాల తార. ఇక ఇటీవల తన హైడ్రోపోనిక్ గార్డెన్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన శిల్ప.. తాజాగా ఓ హెల్దీ డ్రింక్‌తో మరోసారి మన ముందుకు వచ్చింది.
‘రాళ్లు తిని అరిగించుకోవాల్సిన వయసులో ఈ అరుగుదల సమస్యలేంటో?’ అంటూ చాలామంది అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడే దీనికి ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. అయితే తన సోషల్ మీడియా పోస్టులతో అందరిలో ఆరోగ్య స్పృహ పెంచే ప్రయత్నం చేస్తోన్న శిల్ప.. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టేందుకు ఓ వంటింటి చిట్కాను మన ముందుకు తీసుకువచ్చింది. ‘సీసీఎఫ్ డ్రింక్’ (వాము-జీలకర్ర-సోంఫుతో తయారుచేసిన పానీయం) పేరుతో తాను తయారుచేసిన ఈ పానీయంతో అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చంటోంది. అంతేకాదు.. ఈ డ్రింక్ తయారీ విధానాన్ని కూడా వీడియోలో భాగంగా పంచుకుందీ యమ్మీ మమ్మీ.
సీసీఎఫ్ డ్రింక్
కావాల్సిన పదార్థాలు
* వాము - టేబుల్‌స్పూన్
* జీలకర్ర - టేబుల్‌స్పూన్
* సోంపు గింజలు - టేబుల్‌స్పూన్
తయారీ విధానం
ముందుగా వాము, జీలకర్ర, సోంపు గింజలను విడివిడిగా పెనంపై దోరగా వేయించాలి. అనంతరం వీటన్నింటినీ గ్రైండర్లో వేసి మెత్తటి పొడిగా తయారుచేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని సీసాలో భద్రపరచాలి. రోజూ ఓ టీస్పూన్ పొడిని గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి. ఇక ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చంటోంది శిల్ప.
అధిక బరువుకు చెక్!
ఇక ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన శిల్ప ‘అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చాలామందిలో అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ‘సీసీఎఫ్’ డ్రింక్ ఎంతో ఉపయుక్తం. ఇంట్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకునే ఈ పానీయం శరీరంలోని విషతుల్యాలను తొలగించడంతో పాటు అధిక బరువుకు కూడా చెక్ పెడుతుంది’ అంటోందీ ఫిట్నెస్ ఫ్రీక్.
వేటితో ఏం ప్రయోజనముందంటే..?
* యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న వాములో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని జలుబు, జ్వరం, వాంతులు, ఒంటి నొప్పులు...తదితర అనారోగ్యాలకు మందుగా వాడతారు.
* ఇక జీలకర్రలో అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. అజీర్తి, మలబద్ధకం, జలుబు, దగ్గు సమస్యలను నివారిస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేస్తాయి.
* సోంఫులో పొటాషియం, ఐరన్, పీచు పదార్థాలు, విటమిన్ ‘సి’, సెలీనియం.. తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు కడుపుబ్బరం, తేన్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే సెలీనియం క్యాన్సర్ కారకాల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.
పలు అనారోగ్యాలను దూరం చేసే ఈ సూపర్ డూపర్ డ్రింక్ గురించి తెలుసుకున్నారుగా! తయారుచేసుకోవడం కూడా ఎంతో సులభం కదూ!! అయితే మనమూ దీన్ని రోజూ తీసుకుంటూ హెల్దీగా మారిపోదాం.. ఏమంటారు?!