వారాంతాల్లో మాంసాహారం, రోజుకో ఉడికించిన కోడిగుడ్డు.. ఇవి లేకుండా ఉండలేరు కొంతమంది. అది కూడా మాంసాహారుల్లో చికెన్ ప్రియులే ఎక్కువమంది! అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయంతో వీటిపై ఉన్న ఇష్టాన్ని చంపుకొని మరీ వీటికి దూరంగా ఉంటోన్న వారూ లేకపోలేదు. అయితే ఆ భయం అక్కర్లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వీటిని బాగా ఉడికించుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. చికెన్, కోడిగుడ్లను తినాలా? వద్దా? ఒకవేళ తీసుకుంటే వైరస్ మూలంగా ఏవైనా అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుందా? ఇలా చాలామందిలో నెలకొన్న సందేహాలకు తెరదించుతూ తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో భాగంగా వీటిని కొనుగోలు చేయడం దగ్గర్నుంచి వండుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. తదితర అంశాల గురించి ఈ మార్గదర్శకాల్లో భాగంగా వివరించిందీ సంస్థ.
బర్డ్ ఫ్లూ భయంతో తమకిష్టమైన చికెన్, కోడిగుడ్లకు దూరంగా ఉండే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే ‘మన దగ్గర ఆ వైరస్ ప్రభావం లేదు కదా.. ప్రమాదమేమీ లేదు’ అని తేలిగ్గా తీసుకునే వారూ లేకపోలేదు. ఏదేమైనా ఏవియన్ ఫ్లూ (బర్డ్ ఫ్లూ) చాలా వేగంగా విస్తరిస్తోన్న ఈ తరుణంలో పౌల్ట్రీ ఉత్పత్తులు కొనడం దగ్గర్నుంచి వండడం దాకా ప్రతి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ గురించి అందరినీ అలర్ట్ చేస్తూ కొన్ని మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. అయితే ఈ పచ్చి మాంసాన్ని, పచ్చి కోడిగుడ్లను వండే క్రమంలో మహిళలుగా మనమే ఎక్కువగా వీటిని తాకడం, కడగడం.. వంటివి చేస్తాం.. కాబట్టి ఈ సంస్థ సూచించిన మార్గదర్శకాలను మనం తప్పకుండా పాటించడం ముఖ్యం.
చికెన్ వండుతున్నారా?

* గత కొన్ని రోజుల నుంచి బర్డ్ ఫ్లూ విస్తరిస్తుండడంతో చికెన్, కోడిగుడ్లు తీసుకోవడంపై చాలామందిలో చాలా సందేహాలు నెలకొన్నాయి. అయితే వీటిని తీసుకోవడం సురక్షితమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే! అంతేకాదు.. వండిన ఆహారం ద్వారా మనుషులకు వ్యాధులు సోకుతాయని సంక్రమిత వ్యాధుల అధ్యయనంలో ఇప్పటిదాకా ఎక్కడా రుజువు కాలేదు. ఒకవేళ పక్షులకు వైరస్ సోకినా సరైన ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికిస్తే అసలు సమస్యే ఉండదంటోంది డబ్ల్యూహెచ్ఓ.
 * కుళాయి నుంచి నేరుగా వచ్చే నీటితో చికెన్‌ను శుభ్రం చేయద్దు. ఎందుకంటే ఈ క్రమంలో కడిగిన నీళ్లు చుట్టూ చిల్లుతాయి. తద్వారా వైరస్ విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులోనే చికెన్‌ను కడగడం మంచిది. ఉప్పు నీటితో శుభ్రం చేస్తే మరీ మంచిది. * చికెన్‌ను కడిగేటప్పుడు, వండేటప్పుడు చేతులకు గ్లౌజులు, ముక్కు-నోరు కవరయ్యేలా మాస్కు ధరించడం తప్పనిసరి. *చికెన్ కడగడానికి ఉపయోగించిన పాత్రలు, ఆ ప్రదేశాన్ని, చేతుల్ని సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవాలి.
 * పచ్చి మాంసాన్ని కట్ చేయడానికి ఉపయోగించిన చాపింగ్ బోర్డులు, కత్తుల్ని ఇతర పదార్థాలు కట్ చేయడానికి ఉపయోగించకూడదు. అలాగే వాటిని ఉపయోగించిన తర్వాత సబ్బునీటితో/క్రిమి సంహారక ద్రావణాలతో బాగా రుద్ది కడగడం, విడిగా భద్రపరచడం మంచిది. * అధిక ఉష్ణోగ్రతల వద్ద వైరస్ బతకదు. కాబట్టి చికెన్‌ను 74 డిగ్రీల సెంటీగ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించుకోవాలి. * పచ్చి మాంసం ఉంచిన పాత్రల్లో/ప్రదేశాల వద్ద ఉడికించిన చికెన్‌ను నిల్వ చేయకూడదు. కాబట్టి ఈ రెండింటికీ వేర్వేరు పాత్రల్ని ఉపయోగించాలి. అలాగే వీటిని పచ్చిగా తినే పండ్లు, ఇతర పదార్థాలకు దూరంగా అమర్చడమూ ముఖ్యమే! * పచ్చివి, ఉడికించినవి.. ఈ రెండింటినీ చేత్తో తాకే ముందు, తర్వాత చేతుల్ని సబ్బుతో 20-30 సెకన్ల పాటు రుద్దుతూ కడుక్కోవడం మర్చిపోవద్దు.
|
కోడిగుడ్ల విషయంలో ఈ జాగ్రత్తలు..!

* నిజానికి ఏవియన్ ఫ్లూ/బర్డ్ ఫ్లూ వైరస్ సూర్యరశ్మి తాకితే కొన్ని గంటల్లోనే నశిస్తుంది. అలాగే గాలిలోనూ దీని జీవితకాలం తక్కువే! కాబట్టి కోడిగుడ్లు వినియోగదారుల్ని చేరేందుకు సమయం పట్టినా వాటిపై వైరస్ ఆనవాళ్లు ఉండే అవకాశాలుంటాయి. అయితే వీటి ద్వారా వైరస్ సంక్రమణ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. * షాపు నుంచి కొనుగోలు చేసిన కోడిగుడ్లను నేరుగా చేత్తో తాకకుండా గ్లౌజులు, మాస్కులు ధరించడం మర్చిపోవద్దు. * కుళాయి నుంచి నేరుగా వచ్చే నీటి కింద కోడిగుడ్లను కడగడం వల్ల ఈ క్రమంలో ఆ నీళ్లు చుట్టు పక్కల చిల్లి వైరస్ విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో గుడ్లను కడగడం లేదంటే తడి గుడ్డతో వాటిని తుడిచి ఉపయోగించడం/భద్రపరచుకోవడం మంచిది. * పచ్చి కోడిగుడ్లు/వాటిలోని సొన పచ్చిగా తీసుకునే పండ్లు, కాయగూరలు వంటి పదార్థాలకు అంటుకోకుండా, ఇతర ఉపరితలాల్లో పడకుండా జాగ్రత్తపడాలి. అలాగే ఈ రెండింటినీ కలిపి ఒకే చోట భద్రపరచకూడదు.
 * 74 డిగ్రీల సెంటీగ్రేడ్, అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన కోడిగుడ్లను, అది కూడా పూర్తిగా ఉడికించుకొని మాత్రమే తీసుకోవాలి. అంతేకానీ సగం ఉడికించినవి అసలు తీసుకోకూడదు. * పగిలిన కోడిగుడ్లను కొనకూడదు/తినకూడదు. * పచ్చి కోడిగుడ్లను ఇతర వంటకాల తయారీలో.. అంటే ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద వండని పదార్థాల తయారీలో ఉపయోగించకూడదు. * పచ్చివి, వండినవి.. ఈ రెండింటికీ ఉపయోగించే పాత్రలు వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే వాటిని ఉపయోగించిన తర్వాత క్రిమి సంహారక ద్రావణాలతో, నీటితో శుభ్రంగా కడగాలి. అలాగే ఆయా ఉపరితలాలను, చేతుల్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. * గుడ్లను వండే ముందు, తర్వాత చేతుల్ని సబ్బుతో 20-30 సెకన్ల పాటు రుద్దుకొని మరీ కడుక్కోవాలి.
|
ఇవి గుర్తుపెట్టుకోండి!
 * బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు/షాపులు/ఓపెన్ మార్కెట్స్ నుంచి చికెన్/కోడిగుడ్లు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే అక్కడ వైరస్ విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. * పౌల్ట్రీ షాపుల్లో పనిచేసే వారు గ్లౌజులు, మాస్కులు ధరించారో, లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. అలాగే తగిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తోన్న షాపుల వద్దే వీటిని కొనుగోలు చేయడం శ్రేయస్కరం. * అలాగే వీటిని కొనడానికి వెళ్లినప్పుడు మీరు కూడా గ్లౌజులు, మాస్కులు పెట్టుకోవడం మర్చిపోవద్దు. * ఇంటికి తీసుకొచ్చిన పచ్చి మాంసాన్ని ఎక్కువ సేపు అలాగే గాలిలో ఉంచకూడదు.
|
ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకడం అరుదే అయినప్పటికీ సరైన పరిశుభ్రత పాటిస్తూ.. చికెన్, కోడిగుడ్లను బాగా ఉడికించుకొని తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా వీటిని రుచిని ఆస్వాదించచ్చు.