ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చిన్న చిన్న అనారోగ్యాల దగ్గర్నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. మరి, అలాంటి అనారోగ్యాల బారిన పడి బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్తపడడం మంచిది కదా! ఈ క్రమంలోనే చక్కటి పోషకాహారం మనకు ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ. మన రోజువారీ ఆహారపుటలవాట్లలో భాగంగా కొన్ని పదార్థాల్ని తప్పనిసరిగా భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు సాగచ్చని, తానూ ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నానంటున్నారామె. ఈ క్రమంలో తాను తీసుకునే రోజువారీ ఆహార పదార్థాలు, వాటిలో దాగున్న పోషక విలువలు, అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలేంటో వీడియోల రూపంలో వివరించారామె. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
తన ఆహారపుటలవాట్లతో దీపికా పదుకొణె, మందిరా బేడీ, సోనమ్ కపూర్, జెనీలియా, రవీనా టాండన్.. వంటి మేటి నటీమణుల్లో స్ఫూర్తి నింపారు పూజ. ఇలా సెలబ్రిటీలకు ఆరోగ్యకరమైన ఆహార నియమాల్ని సూచించడమే కాదు.. వివిధ ఆహార పదార్థాలు, అందులో దాగున్న పోషక విలువల గురించి తరచూ పోస్టులు పెడుతూ మనలాంటి సామాన్యులకూ ఆరోగ్య పాఠాలు నేర్పుతుంటారామె. ఈ క్రమంలో తాను పాటించే రోజువారీ ఆహారపుటలవాట్ల గురించి ఇటీవలే వీడియోల రూపంలో పంచుకుంటూ మరోసారి అందరిలో ఆరోగ్య స్పృహ పెంచే ప్రయత్నం చేశారీ న్యూట్రిషనిస్ట్.
వీటిని ఎందుకు తింటానంటే..?!
‘రోజూ నేను తీసుకునే సూపర్‌ఫుడ్స్ ఇవే’ అంటూ తాను తినే ఒక్కో ఆహార పదార్థం, అందులో దాగున్న సుగుణాల గురించి ఇలా చెప్పుకొచ్చారు పూజ.

యాపిల్ సిడార్ వెనిగర్
దీన్ని వంటకాల తయారీలోనే కాదు.. మందుల తయారీలోనూ వినియోగిస్తారు. అందుకు కారణం యాపిల్ సిడార్ వెనిగర్‌లో ఉన్న పోషకాలే! బి1, బి2, బి6, సి.. వంటి విటమిన్లతో పాటు ఫోలికామ్లం, పాంటోథెనిక్ ఆమ్లం, సోడియం, పొటాషియం.. వంటి ఖనిజాలు మిళితమై ఉన్న ఈ ద్రావణాన్ని పులియబెట్టే ప్రక్రియలో తయారుచేస్తారు. ఇలా పులియబెట్టే క్రమంలో దీనిలోని పోషక విలువలు రెట్టింపవుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలోని ఎంజైమ్స్‌ని ఉత్తేజ పరచడం, చక్కెర స్థాయుల్ని తగ్గించడం, స్థూలకాయం రాకుండా నివారించుకోవడం.. ఇలా పలు అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తుందీ ద్రావణం. ఈ ఫలితాలన్నీ పొందాలంటే రోజూ భోజనానికి ముందు గ్లాసు నీటిలో రెండు టేబుల్స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది.

ఆరోగ్యానికి ‘గుడ్డు’!
తక్కువ ధరలో ఎక్కువ ప్రొటీన్లు లభించే పదార్థమేదైనా ఉందంటే అది కోడిగుడ్డే! దీంతో పాటు బయోటిన్, ఐరన్, జింక్, మెగ్నీషియంతో పాటు బి12, బి7 విటమిన్లు కలగలిసిన కోడిగుడ్డును రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇప్పటికే లావుగా ఉన్న వారు, గుండె సంబంధిత సమస్యలున్న వారు గుడ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ వీటిని మితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి రోజుకో గుడ్డు తినడం వల్ల తీపి తినాలన్న కోరిక తగ్గుతుంది.. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

నువ్వులు
అటు ఆరోగ్యానికి, ఇటు అందానికి.. ఇలా రెండు రకాలుగా ఉపయోగపడతాయి నువ్వులు. ఫైబర్, కాపర్, మెగ్నీషియం, క్యాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు.. వంటి పోషకాలు పుష్కలంగా నిండి ఉన్న నువ్వుల్ని రోజూ తీసుకోవడం వల్ల మధుమేహం, ఆర్థ్రైటిస్, గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండచ్చు.. అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే రోజుకు 30 గ్రాముల చొప్పున నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.
పండ్లు-కాయగూరలు
వేళకు భోజనం చేయకపోయినా, కడుపు నిండా తినకపోయినా ఆకలేస్తుంటుంది. తద్వారా ఏదో ఒకటి తినాలన్న కోరిక పెరుగుతుంది. బరువు పెరగడానికి ఇదీ ఓ కారణమే! అందుకే రోజుకు రెండు పండ్లు, కాయగూరలతో తయారుచేసిన ఓ గ్లాసు జ్యూస్ తీసుకోవడం మంచిది. వీటిలోని ఫైబర్ అరుగుదలను ప్రేరేపిస్తుంది. మలబద్ధకం తగ్గాలన్నా, చర్మ ఆరోగ్యం పెంపొందాలన్నా.. యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్న పండ్లు, కాయగూరల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే!

పసుపుతో యవ్వనంగా!
చాలామందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడుతున్నాయి. తద్వారా వయసు పైబడిన వారిలా కనిపిస్తున్నారు. అయితే పసుపు ఈ సమస్యను తగ్గిస్తుంది. ఇందుకు కారణం ఇందులోని యాంటీ ఏజింగ్ గుణాలే! దీంతో పాటు యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగిన పసుపు దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని నవయవ్వనంగా మార్చుతుంది.

నీళ్లతో ఆరోగ్యం!
బరువు తగ్గడానికైనా, చర్మం-జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికైనా, నిద్రలేమిని దూరం చేయడానికైనా, శరీరానికి తక్షణ శక్తిని అందించాలన్నా, శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందాలన్నా.. ఇలా ఎలాంటి అనారోగ్యాన్నైనా దూరం చేసే శక్తి నీటికి ఉంది. అందుకే రోజుకు రెండు లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. ఇలా నీళ్లు సరిపడా మోతాదులో తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలోనూ నీళ్లది ప్రత్యేక స్థానం.
సో.. ఇవండీ.. సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజ రోజువారీ ఆహారపుటలవాట్లు! మరి, మీ రోజువారీ సూపర్‌ఫుడ్స్ ఏంటి? కింద కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి.. ఆరోగ్య స్పృహను పెంచండి!