కాబోయే అమ్మలు ‘నాకు పుట్టబోయే బిడ్డ ముద్దుగా, బొద్దుగా, ఆరోగ్యంగా పుట్టాలి.. యాక్టివ్‌గా ఉండాలి..!’ అనుకోవడం సహజమే. ఇందుకోసమే నవమాసాలు చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటారు. బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ కూడా ప్రస్తుతం అదే చేస్తోంది. మరికొన్ని రోజుల్లో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోన్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇటు చక్కటి పోషకాహారం తీసుకుంటూనే, అటు రెగ్యులర్‌గా వ్యాయామాలు చేస్తూ నెలలు నిండుతున్న కొద్దీ మరింత యాక్టివ్‌గా మారిపోతోంది.
మరి, బెబోని ఇంత ఎనర్జిటిక్‌గా మార్చే ఆ ఆహార పదార్థాలేంటి? తాను చేసే వ్యాయామాలేంటి? ఈ సందేహం చాలామందికే వచ్చి ఉంటుంది. తాజాగా ఆ సీక్రెట్స్ గురించే బయటపెట్టారు సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు, కరీనా డైట్ ఎక్స్పర్ట్ రుజుతా దివేకర్. గర్భం ధరించకముందు కరీనా ఎలాంటి డైట్ అయితే పాటించిందో.. ప్రస్తుతం కూడా దాన్నే కొనసాగిస్తోందంటూ బెబో ప్రెగ్నెన్సీ డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారామె.
కరీనా మొదటిసారి గర్భం ధరించిన సమయంలోనూ ఆమెకు డైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు రుజుత. ఇక ఇప్పుడు రెండోసారి గర్భిణిగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు చక్కటి పోషకాహారం, వ్యాయామాలు సూచిస్తూ ఆమె రోజురోజుకీ యాక్టివ్‌గా మారేందుకు దోహదం చేస్తున్నారీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న కరీనా పాటిస్తోన్న ఆహార నియమాల గురించి ఇటీవలే ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు రుజుత.
ఇంటి ఆహారమే..!
‘2007 నుంచే నేను కరీనాకు డైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరిస్తున్నా. ఆహారమైనా, వ్యాయామమైనా తను ఒక రొటీన్‌కు కచ్చితంగా కట్టుబడి ఉండే వ్యక్తి. ఇక తను ఇంటి ఆహారానికే ప్రథమ ప్రాధాన్యమిస్తుంది. రోటీ-సబ్జీ, ఆలూ పరాఠా, పోహా, పప్పన్నం, వెజ్ పులావ్.. ఇలా తనకు ఏది తినాలనిపించినా ఇంట్లో వండిన వాటినే తీసుకుంటుంటుంది. వీటితో పాటు టీ/కాఫీ కూడా మితంగా తీసుకుంటుంది. ప్రత్యేకంగా గర్భం ధరించినప్పట్నుంచే ఈ ఆహార నియమాలను అలవాటు చేసుకోలేదు. గతం నుంచీ ఇదే డైట్‌ను పాటిస్తూ వస్తోంది కరీనా. ఇక రోజూ కాసేపు నడక, వ్యాయామాలు, సమయానికి పడుకోవడం, సమయానికి నిద్ర లేవడం.. తప్పకుండా పాటిస్తుంది. ఇవే తనను నెలలు నిండే కొద్దీ ఆరోగ్యంగా, యాక్టివ్‌గా మార్చుతున్నాయి..’ అంటున్నారు రుజుత.
ఆ పుస్తకంలో ఏముందంటే..!
ఇక ఇటీవలే కరీనా కూడా తన ప్రెగ్నెన్సీ డైట్ సీక్రెట్స్, ఫిట్నెస్ రహస్యాల గురించి ఓ పుస్తకంలో పొందుపరిచిన సంగతి తెలిసిందే! దీనికి సంబంధించిన ఇలస్ట్రేషన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన బెబో.. ‘గర్భిణిగా ఉన్న సమయంలో ఆహారపు కోరికలు కలగడం సహజం. అలాగే ఈ సమయంలో ఇద్దరి కోసం తినాలని చెబుతుంటారు చాలామంది. కానీ అది ఒక అపోహ మాత్రమే! నేనైతే పూర్తిగా నా కోసమే చక్కటి ఆహారం తీసుకుంటున్నా. అవేంటన్నది ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకంలో పొందుపరిచాను. అందుకే ఈ పుస్తకం కాబోయే అమ్మలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందనుకుంటున్నా. గర్భం ధరించిన సమయంలో ఎదురయ్యే వేవిళ్లు (మార్నింగ్ సిక్నెస్), తీసుకునే ఆహారం, ఫిట్నెస్.. ఇలా గర్భిణిగా నేను ఎదుర్కొన్న అనుభవాలన్నీ ఈ పుస్తకంలో రాశాను. మీరంతా ఈ పుస్తకాన్ని ఎప్పుడెప్పుడు చదువుతారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటూ తన ప్రెగ్నెన్సీ డైట్ సీక్రెట్స్, ఈ క్రమంలో తాను చేసిన వ్యాయామాల గురించి తాను రాసిన పుస్తకంలో వివరంగా పొందుపరిచినట్లు చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ.
గతేడాది ఆగస్టులో తమ రెండో బిడ్డ గురించి అందరికీ తెలియజేసిన సైఫీనా.. మార్చిలో మరోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందేందుకు రడీ అవుతున్నారు. ఇక మరోవైపు గర్భంతోనూ తన కెరీర్‌ను కొనసాగిస్తోన్న బెబో.. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సరసన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తోంది.
Also Read: కాబోయే అమ్మలకు కరీనా ‘ఆరోగ్య’ పాఠాలు!