‘ముందు జీవితంలో సెటిలవ్వాలి.. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’ ఇది ఈ తరం అమ్మాయిల ఆలోచనా ధోరణి. అయితే ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడం వాయిదా వేసే వారు చాలామందే ఉంటారు. ఇలాంటి మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్ (శీతలీకరణ పద్ధతిలో అండాల్ని నిల్వ చేసుకోవడం) పద్ధతి ఓ వరమని చెప్పాలి. యుక్త వయసులో ఉన్నప్పుడు తమ అండాల్ని నిల్వ చేసుకొని.. ఇక ఎప్పుడంటే అప్పుడు పిల్లల్ని కనే అద్భుత అవకాశాన్ని అందిస్తోందీ పద్ధతి. అయితే మహిళలకు ఏ వయసులోనైనా సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఈ పద్ధతి గురించి చాలామందిలో చాలా అపోహలే నెలకొన్నాయని చెప్పచ్చు. అసలు ఇలా నిల్వ చేసిన అండాల వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారా?, దీనివల్ల ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు ఏదైనా ప్రమాదముంటుందేమో?, ఏ వయసులో ఉన్నప్పుడు అండాల్ని శీతలీకరించుకోవడం మంచిది? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సందేహాలెన్నో! అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి సురక్షితమైనది, ఎంతో ప్రభావవంతమైందని చెబుతున్నారు నిపుణులు. ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సాధారణ అపోహలు, సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
సాధారణంగా మహిళల్లో 30 దాటితే అండాల నిల్వ క్రమంగా తగ్గిపోతుంటుంది.. ఇలా వయసు పెరిగే కొద్దీ ఉత్పత్తయ్యే అండాలు కూడా అంత ఆరోగ్యకరంగా ఉండవని, వాటితో గర్భం దాల్చితే పిల్లల్లో అవకరాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు నిపుణులు. అందుకే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవాలనుకుంటోన్న వారు యుక్త వయసులోనే తమ అండాల్ని నిల్వ చేసుకునేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని ఎంచుకోమని సూచిస్తున్నారు. పైగా ఇది సురక్షితమైందని, ప్రభావవంతమైందని కూడా సలహా ఇస్తున్నారు.

* ఇప్పుడు అండాల్ని నిల్వ చేసుకుంటే భవిష్యత్తులో తగినంత మిగులు ఉండదు.
ఇది పూర్తిగా అపోహే. ఎందుకంటే ఇప్పుడు అండాల్ని భద్రపరచుకోవడం వల్ల భవిష్యత్తులో అండాల నిల్వ తగ్గిపోతుందని, తద్వారా సంతానలేమి సమస్య తలెత్తుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఎందుకంటే మహిళల్లో నెలనెలా అండాలు ఉత్పత్తవుతాయి. ఇక ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో అండాల అభివృద్ధి, వాటిని పరిపక్వం చేయడానికి కొన్ని మందులు సూచిస్తారు వైద్యులు. అలాంటి అండాలను శీతలీకరించి, తల్లి కావాలని నిర్ణయించుకున్నప్పుడు వాటిని ఉపయోగించి గర్భం ధరించచ్చు.
* నిల్వ చేసిన అండాల కంటే తాజాగా ఉత్పత్తైన అండాలే మంచివి.
వయసు పెరిగే కొద్దీ అప్పటికప్పుడు విడుదలైన అండాలతో పోల్చితే గతంలో నిల్వ చేసుకున్న అండాలతో వచ్చిన ప్రెగ్నెన్సీనే ఎక్కువ ఆరోగ్యకరంగా ఉన్నట్లు (హెల్దీ ప్రెగ్నెన్సీ) పలు అధ్యయనాల్లో రుజువైంది. అంటే.. మన వయసు కంటే అండం వయసే ఇక్కడ ముఖ్యమన్నమాట! ఇక 35 ఏళ్లు దాటిన తర్వాత నుంచి అండాల నిల్వ ప్రతి రెండేళ్లకు 10 శాతం తగ్గిపోతుందట! అందుకే కెరీర్లో స్థిరపడాలి, ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్న వారు 30 ఏళ్లు, ఆ లోపు తమ అండాల్ని నిల్వ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇక ఇలా నిల్వ చేసిన అండాలతో మీకు కావాల్సినప్పుడు బిడ్డను కనే వీలుంటుందట! అలాగని 20 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ వయసు వారు అండాల్ని శీతలీకరించుకోవాల్సిన అవసరం లేదని, 30 ఏళ్ల వరకు వాళ్లు వేచి చూడచ్చని భరోసా ఇస్తున్నారు.

* ఈ పద్ధతి తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదకరమైంది.
అండాల్ని శీతలీకరించే ఈ పద్ధతి ఎంతో సురక్షితమైందని, చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఒవేరియన్ స్టిమ్యులేషన్, ఎగ్ రిట్రీవల్, క్రియో ప్రిజర్వేషన్.. ఇలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతులు మంచివంటున్నారు. ఈ పద్ధతి ద్వారా భవిష్యత్తులో గర్భం ధరించే స్త్రీలలో, పుట్టబోయే బిడ్డలో ఎలాంటి ప్రమాదాలూ జరిగినట్లు ఆధారాలు కూడా లేవట. అలాగే శీతలీకరించిన అండాలు లేదా ఐవీఎఫ్ ద్వారా ఫలదీకరించిన పిండాలు.. ఈ రెండింటినీ పోల్చి చూస్తే పుట్టబోయే పిల్లల్లో అవకరాల విషయంలో గానీ, గర్భిణుల్లో ఇతర సమస్యల (ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్) విషయంలో గానీ తేడాలేవీ లేవని చెబుతున్నారు నిపుణులు.

* ఎగ్ ఫ్రీజింగ్.. నొప్పితో కూడుకున్నది.
అండాల్ని శీతలీకరించే ఈ పద్ధతి పూర్తి కావడానికి సుమారు రెండు వారాలకు పైగా సమయం పడుతుందట! ఈ క్రమంలో ముందుగా 8-11 రోజుల పాటు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు వైద్యుల పర్యవేక్షణలో హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ మందులకు మీ శరీరం ఎలా స్పందిస్తుందో డాక్టర్లు చెక్ చేస్తారు. అంతా బాగుందనుకుంటే ఎగ్ రిట్రీవల్ సర్జరీ ద్వారా మీ అండాల్ని సేకరిస్తారు. ఇక్కడ సర్జరీ అంటే భయపడాల్సిన పని లేదు.. శరీరంపై కోత లేకుండా, కుట్లు పడకుండా, నొప్పి పుట్టకుండానే 15 నిమిషాల్లో అండాల్ని సేకరిస్తారు. అందుకే ఈ మొత్తం ప్రక్రియ అంతా పూర్తి కావడానికి రెండు వారాలకు పైగానే పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ చికిత్సల నుంచి రక్షణకు..!

ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకున్న వారికి అండాల్ని శీతలీకరించే పద్ధతి చక్కటి ప్రత్యామ్నాయ మార్గమని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు పుడతారో, లేదోనన్న భయం (ఫెర్టిలిటీ యాంగ్జైటీ) అక్కర్లేదని.. కావాలనుకున్నప్పుడు ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చని అంటున్నారు. దీంతో పాటు ముందుగానే శీతలీకరణ పద్ధతుల్లో అండాల్ని నిల్వ చేసుకోవడం ద్వారా వయసు పైబడే కొద్దీ మహిళల్లో వచ్చే కొన్ని అనారోగ్యాలు, క్యాన్సర్-ఎండోమెట్రియోసిస్.. వంటి దీర్ఘకాలిక వ్యాధులు, వాటికి తీసుకునే కీమోథెరపీ వంటి చికిత్సల ప్రభావం నిల్వ చేసిన అండాలపై పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో మీ ఆరోగ్యం సహకరించకపోయినా అద్దె గర్భం.. వంటి పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వచ్చు.
|
అయితే ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే.. ముందుగా మీ ఆరోగ్య స్థితిని ఓసారి వైద్యుల దగ్గర చెకప్ చేయించుకొని ఆ తర్వాత వారు సూచించినట్లుగా ముందుకెళ్లడం మంచిది.