హలో మేడమ్. నా వయసు 21 ఏళ్లు. పిరియడ్స్ సమయంలో, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడల్లా మంటగా ఉంటోంది. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆస్పత్రిలో చూపించుకొని ట్యాబ్లెట్స్ వాడినా, నీళ్లు ఎక్కువగా తాగుతున్నా సమస్య తగ్గట్లేదు. నా సమస్యకు పరిష్కారమేంటో చెప్పండి. -ఓ సోదరి
జ: మీరు రాసిన వివరాలను బట్టి మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తోందని అర్ధమవుతోంది. ఇలా రావడానికి కొన్ని కారణాలుంటాయి. మీకు ఇన్ఫెక్షన్ కలుగజేస్తోన్న బ్యాక్టీరియా మందులకు లొంగకపోవచ్చు. లేదంటే మీకు మూత్ర వ్యవస్థలో రాళ్లు, అడ్డంకులు.. వంటి సమస్యలుండచ్చు. మీకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండచ్చు.. లేదా డయాబెటిస్ వంటి వ్యాధులుండచ్చు.
ఇలా తరచూ వచ్చే వారిలో ఒక్కోసారి కలయిక సమయంలో భర్త దగ్గర్నుంచి కూడా ఇన్ఫెక్షన్ సంక్రమించే అవకాశాలుంటాయి. అందుకే ఇలాంటి ఇన్ఫెక్షన్లను నిర్ధారించే పరీక్షలతో పాటు, షుగర్ టెస్టు, యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కాన్ మొదలైనవి చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిలో కారణం దొరక్కపోతే ఒకసారి నెఫ్రాలజిస్ట్ని సంప్రదించడం మంచిది.