స్వీట్.. ఈ పేరు చెప్పగానే నోరూరిపోతుంది. చక్కెర తినకూడదని నోరు కట్టేసుకున్న వారు కూడా ‘రేపట్నుంచి మానేద్దాంలే!’ అని తమ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఇలా రోజూ రేపు అని వాయిదా వేస్తూ ఉంటే కొన్ని రోజులకు బీపీ, మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు.. వంటి దీర్ఘకాలిక వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతోన్న నేటి రోజుల్లో చక్కెరతో కూడిన తీపి పదార్థాలు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే చేజేతులా ముప్పును కొనితెచ్చుకున్న వారవుతారంటున్నారు. అయితే కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా కొత్త తీర్మానాలు చేసుకుంటున్న వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. మరి, ఇంతకీ ఈ ‘స్వీట్’ రిజల్యూషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
కొత్త ఏడాదిలోకి అడుగిడే క్రమంలో ఆరోగ్యం, ఫిట్నెస్.. విషయాల్లో పలు తీర్మానాలు తీసుకోవడం పరిపాటే! కానీ వాటిని ఆచరించడంలోనే చాలామంది విఫలమవుతుంటారు. అయితే ఈ కరోనా కాలంలో ఆరోగ్యం విషయంలో అలసత్వం వద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తూ తీసుకునే ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా కట్ చేయమని సలహా ఇస్తున్నారు.

ప్రత్యామ్నాయాలు ఉండనే ఉన్నాయి!
ఉదయాన్నే కప్పు కాఫీ/టీ/గ్లాసు పాలు.. ఇలా ఏది తీసుకున్నా అందులో సరిపడా చక్కెర వేసుకోవడం చాలామందికి అలవాటు. దీంతో పాటు సేమ్యా/హల్వా.. వంటి స్వీట్స్ తయారుచేసినా వాటిలోనూ చక్కెర వాడే వారే ఎక్కువ. ఇక స్వీట్ షాపులో దొరికే స్వీట్స్‌లో చక్కెరతో తయారైనవే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎటు చూసినా చక్కెర లేకపోతే రోజు పూర్తి కాదు అన్నట్లుగా తయారయ్యాయి ప్రస్తుత పరిస్థితులు. అలాగని దీన్ని భర్తీ చేసే పదార్థాలు లేవా అంటే.. బోలెడన్ని ఉన్నాయి. బెల్లం, తేనెతో పాటు స్టీవియా ఆకు, షుగర్-ఫ్రీ మాత్రలు, డేట్స్.. వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చక్కెరకు బదులుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. స్వీట్ షాపుల్లో కూడా షుగర్-ఫ్రీ స్వీట్స్ లభిస్తున్నాయి. ఇలా తీసుకునే ఆహారంలో చక్కెరను నెమ్మదిగా కట్ చేస్తూ ప్రత్యామ్నాయ పదార్థాల్ని చేర్చుకోవడం క్రమంగా పెంచుకోవాలి.

బ్రేక్‌ఫాస్ట్‌లో చక్కెర వద్దు!
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కుదరకపోతే కొంతమంది సెరల్స్, బ్రెడ్, పాస్తా.. వంటివి చిటికెలో చేసుకొని తినేస్తుంటారు. నిజానికి వీటిలో చక్కెర స్థాయులు అధికంగా ఉంటాయి. ఇలా వీటివల్ల శరీరానికి అందిన శక్తి చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకే వీటికి బదులుగా ఓట్స్, చక్కెర వేయకుండా తయారుచేసిన పండ్ల రసాలు, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, చిరుధాన్యాలు-తృణధాన్యాలతో చేసిన వంటకాలు.. మంచివి. ఈ పదార్థాల్లో చక్కెర స్థాయులు తక్కువగా ఉండడంతో పాటు వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

ప్రత్యేక సందర్భాల్లో ఇలా..!
న్యూ ఇయర్, పుట్టిన రోజు, పెళ్లి రోజు.. ఇలా ప్రత్యేక సందర్భం ఏదైనా సరే.. కేక్, కూల్‌డ్రింక్స్‌తో సెలబ్రేట్ చేసుకోవడం మనకు అలవాటే. అయితే వీటిలో చక్కెర స్థాయులు మోతాదుకు మించి ఉంటాయి. ఒక క్యాన్ శీతల పానీయాల్లో సుమారు 10 టీ స్పూన్ల కంటే అధిక చక్కెర ఉంటుంది. సెలబ్రేషన్ పేరుతోనే కాదు.. బేకరీ కనిపిస్తే చాలు.. అందులోకెళ్లి కేక్స్, డ్రింక్స్‌ని విచ్చలవిడిగా లాగించేసే వారూ లేకపోలేదు. అలాంటి వారు తమ స్వీట్ క్రేవింగ్స్‌ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేక్ తినాలనిపిస్తే ఒక్క చిన్న ముక్కతో సరిపెట్టుకోవడం లేదంటే ఇంట్లోనే బెల్లం-తేనె.. వంటి వాటితో కేక్స్ తయారుచేసుకోవడం, శీతల పానీయాలకు బదులుగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఇంట్లో చక్కెర వేయకుండా తయారుచేసుకున్న పండ్ల రసాలు వంటివి తీసుకోవచ్చు.

లేబుల్ చూశాకే కొనండి!
బయట దొరికే ప్యాక్డ్ ఫుడ్స్‌పై ఉన్న లేబుల్‌ని చదివే వారు ఎంతమంది ఉంటారంటే.. వేళ్ల మీద లెక్కపెట్టచ్చు..! కంటికి ఇంపుగా ఉందని ఆయా ఫుడ్ ప్యాకెట్స్‌ని ట్రాలీలో వేసుకుంటారే కానీ.. అందులో ఉన్న పోషక విలువలేంటి, వాడిన పదార్థాలేంటి.. అన్న విషయాలు అసలు పట్టించుకోరు. అయితే బయటి నుంచి ఏది తెచ్చుకున్నా సరే.. ముందుగా లేబుల్‌ని చదవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చక్కెర ఎక్కువగా వాడిన వాటిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేయమంటున్నారు. ఇలా కొనే ముందు ఆహార పదార్థాల లేబుల్‌ని చూడడం అలవాటు చేసుకుంటే వాటిలో మన శరీరానికి అనవసరం అనుకున్న వాటిని పక్కన పెట్టేసి అవసరమైనవే ఎంచుకునే వీలుంటుంది. తద్వారా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి కూడా!
* ఆకలేసినప్పుడల్లా, స్నాక్స్ పేరుతో బిస్కట్లు, వేఫర్స్.. వంటివి ఎక్కువగా లాగించేస్తుంటాం. వాటికి బదులుగా సీజనల్ పండ్లు, డ్రైఫ్రూట్స్ తీసుకుంటే అటు ఆరోగ్యంతో పాటు ఇటు తీపి తినాలన్న కోరికా తీరుతుంది.
* కొంతమంది చక్కెరను ఫ్లేవర్‌గా కూడా వాడుతుంటారు. ఈ క్రమంలో పెరుగు.. వంటి పదార్థాలపై చక్కెరను చల్లుకొని తీసుకుంటారు. కానీ ఫ్లేవర్ కోసం చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క పొడిని ఉపయోగించచ్చు. తద్వారా ఆయా పదార్థాలకు తియ్యదనం వస్తుంది.
* బయట దొరికే గ్రానోలా బార్స్, చిక్కీలు.. వంటి వాటిలో బెల్లంతో పాటు చక్కెరను కూడా ఉపయోగిస్తుంటారు. కాబట్టి వీటిని బయటి నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లోనే కేవలం బెల్లంతోనే తయారుచేసుకోవడం ఆరోగ్యకరం.
సో.. ఇవండీ! చక్కెరను తగ్గించుకునే విషయంలో తీసుకోవాల్సిన కొన్ని తీర్మానాలు! మరి, ఇవి కాకుండా మీకు తెలిసిన ఇతర మార్గాలేమైనా ఉంటే కింది కామెంట్ బాక్స్‌లో రాసి అందరితో పంచుకోండి. ఆరోగ్య స్పృహను పెంచండి!
హ్యాపీ అండ్ హెల్దీ న్యూ ఇయర్!