మనలో చాలామంది ఏ విషయంలోనైనా రాజీ పడతారేమోగానీ తీసుకునే ఆహారం విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచుల్ని టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రడీగా ఉంటారు. అలా ఆహార ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా ఏటికేడు సరికొత్త వంటకాలు, కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేస్తుంటారు ఛెఫ్‌లు. అయితే ఈ ఏడాది మాత్రం అందరూ రుచి కంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యమిచ్చారు.. బయటి కంటే ఇంటి ఆహారానికే ఓటేశారు. దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి. నిజానికి ఇది మనల్ని పట్టి పీడిస్తోందని తిట్టుకుంటున్నాం కానీ.. ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసింది. మన ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలున్న ఆహారం ఎక్కడో లేదు.. మన వంటింట్లోనే ఉందని మనందరికీ తెలియజెప్పింది. మరి, అలా ఈ ఏడాదంతా తమ హవాను కొనసాగించిన కొన్ని హెల్దీ ఫుడ్ ట్రెండ్స్ ఏంటో ఓసారి నెమరువేసుకుందాం..!
కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం.. ఎంత ముఖ్యమో.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని ముందు నుంచీ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అందుకే ఈ ఏడాదంతా ఇమ్యూనిటీని పెంచే ఆహారం వెంటే పరుగులు పెట్టారంతా! వంట ఇంట్లో చేసుకున్నా, బయటి నుంచి ఆర్డర్ చేసినా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకే అధిక ప్రాధాన్యమిచ్చారు.

‘పసుపు’కే తొలి ప్రాధాన్యం!
పసుపు మనం రోజూ వంటల్లో వాడేదే కదా అని తేలిగ్గా తీసిపారేస్తాం కానీ.. ఇందులో సుమారు 300లకు పైగా పోషకాలు మిళితమై ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇక దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. అందుకే ఇమ్యూనిటీని పెంచుకోవడంలో భాగంగా ఈ ఏడాదంతా పసుపును తమ ఆహారంలో భాగం చేసుకున్నారు చాలామంది. ఈ క్రమంలో పసుపు-మిరియాలు కలిపిన పాలు, పసుపు-నీళ్లు-తేనెతో తయారుచేసిన పానీయాలు.. వంటివి తమ రోజువారీ మెనూలో చేర్చుకొని హెల్దీ లైఫ్‌స్టైల్‌ను కొనసాగించారు. అంతేకాదు.. అటు భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI), ఇటు పలువురు ఛెఫ్‌లు కూడా పసుపును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని, ‘కాఫీకి బదులుగా పసుపు పాలు తాగాల’ని సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పించిన సంగతి మనకు తెలిసిందే! అలా పసుపు, పసుపుతో తయారుచేసిన పానీయాలు ఈ ఏడాది ఒకింత ట్రెండ్‌ని క్రియేట్ చేశాయని చెప్పచ్చు. ఇక వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు.. వంటివి కూడా ఈ ఏడాది ఆరోగ్య స్పృహలో భాగంగా చాలామంది తమ మెనూల్లో చేర్చుకున్నారు.

‘సీజన్’తో మారుతూ..!
సీజన్ మారుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం సహజం. ఇక వీటికి మన శరీరం అలవాటు పడాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ లోపు వాతావరణ మార్పులు మన రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి మనల్ని వివిధ అనారోగ్యాలకు గురిచేస్తాయి. మరి, ఇలా జరగకూడదంటే ఆయా కాలాల్లో లభించే కాయగూరలు, పండ్లు మన మెనూలో చేర్చుకోవాలి. అయితే ప్రతి ఏటా ఇలా ఆహారంలో మార్పులు-చేర్పులు చేసుకునే వారు ఎంతో కొంతమంది ఉన్నప్పటికీ.. ఈ సారి మాత్రం అందరూ ఇదే మంత్రం జపించారని చెప్పాలి. ఇందుకూ కారణం కరోనానే! దీన్ని ఎదుర్కొనే క్రమంలో మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ఆయా కాలాల్లో దొరికే పండ్లు-కాయగూరలను దాదాపు ప్రతి ఒక్కరూ తమ మెనూలో చేర్చుకున్నారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో టొమాటో, క్యాప్సికం.. వంటి కాయగూరలతో పాటు కమలాఫలం, నిమ్మకాయ, జామ, ఉసిరి.. వంటి సి-విటమిన్ అధికంగా లభించే పండ్లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అలాగే ఆకుకూరల్నీ తమ మెనూలో చేర్చుకున్నారు.
‘ఇమ్యూనిటీని, అందాన్ని పెంచే గుణాలు విటమిన్-సి ఫుడ్స్‌లో ఉన్నాయి.. అందుకే వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి..’ అంటూ FSSAI కూడా అందరినీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వచ్చింది. ఇలా ఈ ఏడాదంతా ఆయా కాలాలకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకుంటూ కాయగూరలు-పండ్లను ఎక్కువగా తీసుకున్నారని చెప్పాలి. ఇక సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఆసక్తి ఉన్న కొంతమంది తమ ఇంట్లోనే కాయగూరల్ని పెంచుకొని మరింత ఆరోగ్యాన్ని మూటగట్టుకున్నారు.

‘కాఢా’తో రోజు మొదలు!
కరోనా వచ్చిన తొలినాళ్లలో అయితే దగ్గినా, తుమ్మినా.. వైరస్ వల్లేనేమో అని భయపడిపోయాం. ఒకవేళ వీటి బారిన పడితే బయటపడడానికి, రాకుండా నివారించడానికి ఏదైనా ఇంటి చిట్కా ఉందేమో అని ఇంటర్నెట్లో తెగ గాలించాం.. ఈ క్రమంలో ఆన్లైన్ వేదికగా ఎన్నో ఆయుర్వేద చిట్కాల్ని నిపుణులు మన ముందుకు తీసుకొచ్చారు. ‘కాఢా’ పానీయం కూడా అలాంటిదే! దీనికి తోడు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ హెల్దీ డ్రింక్ తయారీ విధానాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో వివరిస్తూ అందరిలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెంచారు. పైగా ఇమ్యూనిటీని పెంచే శక్తి ఈ పానీయానికి ఉందని తెలుసుకొని.. రోజూ దీన్ని ఉదయమే తీసుకోవడం ప్రారంభించారు చాలామంది. అలా ఈ ఏడాది ‘కాఢా’ డ్రింక్ ఓ సరికొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిందని చెప్పడంలో సందేహమే లేదు. మరి, దాన్నెలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం!
కావాల్సినవి
* యాలకులు - 2
* పచ్చి పసుపు కొమ్ము - చిన్నది (దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది లేకపోతే పసుపు కూడా వాడచ్చు)
* లవంగాలు - కొన్ని
* మిరియాలు - కొన్ని
* తులసి ఆకులు - ఐదారు
* దాల్చిన చెక్క – రెండు పెద్ద ముక్కలు
* అల్లం - చిన్న ముక్క (కచ్చాపచ్చాగా దంచుకోవాలి)
తయారీ
ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు తీసుకొని.. అందులో దంచిన పసుపు, అల్లం వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరగడం ప్రారంభమైన తర్వాత మిగిలిన పదార్థాలను కూడా వేసి అరగంట పాటు మరిగించాలి. ఆపై గ్లాస్లో వడకట్టుకోవాలి. ఈ మిశ్రమంలో టీస్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు.

‘చిరుధాన్యాల’కు భలే గిరాకీ!
రాగి సంగటి, జొన్న రొట్టె.. ఈ ఏడాదికి ముందు వరకు వీటి పేర్లు చెబితే మొహం చిట్లించుకునే వారు కూడా ఈ సంవత్సరమంతా వీటి రుచిని తెగ ఆస్వాదిస్తున్నారని చెప్పాలి. అందుకు కారణం కూడా కరోనానే! ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉన్న ఈ ధాన్యాలు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ముందుంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారికి, మధుమేహంతో బాధపడే వారికి చిరుధాన్యాలను మించిన ఔషధం మరొకటి లేదని చెప్పచ్చు. ఈ గ్లూటెన్ రహిత ధాన్యాలు ఆరోగ్యంగా బరువు తగ్గడంలో సహకరిస్తాయి. అందుకే చాలామంది జొన్నలు, సజ్జలు, రాగులు.. వంటి వాటితో లడ్డూలు, రొట్టెలు, ఇతర వంటకాలు చేసుకొని మరీ వాటి రుచిని ఆస్వాదించారని చెప్పచ్చు. ఇలా ఈ ఏడాదంతా ఆరోగ్య స్పృహతో చాలామంది చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని ఆకాశానికెత్తేశారనడంలో సందేహం లేదు.

టైంపాస్‌కి కాదు.. ఆరోగ్యానికి!
స్నాక్స్ అనగానే ఇంటా-బయటా నూనె సంబంధిత పదార్థాలు లేదంటే ప్రాసెస్ చేసిన పదార్థాలకే ప్రాధాన్యమిస్తాం. వాటికి బదులు పండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్ తీసుకోమని ఎంతమంది చెప్పినా అస్సలు వినం. కానీ ఈ ఏడాదంతా స్నాక్స్ సమయంలో అనారోగ్యపూరిత పదార్థాలకు బదులుగా చాలామంది నట్స్-డ్రైఫ్రూట్స్కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని చెబుతున్నారు నిపుణులు. వీటితో లడ్డూలు, చిక్కీలు.. వంటివి చేసుకొని ఆస్వాదించిన వారూ లేకపోలేదట!
నియాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ ‘ఇ’.. వంటి పోషకాలు అధికంగా ఉండే వీటితో ఆరోగ్యమే కాదు.. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా దూరమవుతాయి. అందుకే అటు ఆరోగ్యానికి.. ఇటు కరోనా టెన్షన్స్ నుంచి బయటపడడానికి చాలామంది నట్స్-డ్రైఫ్రూట్స్‌ని రోజులో ఎప్పుడో ఒకప్పుడు తీసుకుంటూ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ హెల్దీగా ఉంటున్నారు.
ఇక ఈ ఏడాదంతా చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఇటు ఫ్రెండ్స్/కొలీగ్స్.. అటు కుటుంబంతో కలిసి బయటికెళ్లి బిర్యానీ రుచిని ఆస్వాదించే అవకాశమే లేకుండా పోయింది. అలాగని బిర్యానీ ప్రియులు ఊరుకోకుండా.. ఆ బిర్యానీ ఏదో ఇంటికే ఆర్డర్ చేసుకొని మరీ ఎంజాయ్ చేశారట. ఈ విషయం ఇటీవలే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన సర్వేలో పేర్కొంది. సో.. కరోనా కాలంలోనూ బిర్యానీ ట్రెండ్ ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది.
ఇదండీ.. ఈ ఏడాదంతా తమ హవాను కొనసాగించిన కొన్ని ఫుడ్ ట్రెండ్స్! మరి, ఈ ఏడాది ఆరోగ్య స్పృహను పెంచుకోవడంలో భాగంగా మీరు తీసుకున్న ఆహార పదార్థాలేంటి? కింద కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి.. తద్వారా అందరికీ ఆరోగ్యంపై అవగాహనను మరింతగా పెంచండి!