సృజనకు మామూలుగా నెలసరి సరైన సమయానికే వస్తుంటుంది. అయితే ఈసారి నెల దాటినా ఇంకా పిరియడ్ రాకపోయేసరికి గర్భం దాల్చానేమో అని టెస్ట్ చేసుకుంది.. కానీ ఫలితం మాత్రం నెగెటివ్‌గా వచ్చేసరికి నిరాశపడిపోయిందామె.
మృదుల కూడా అంతే! ఈసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందన్న నమ్మకంతో ఉంది. దీనికి తోడు వికారం, రొమ్ముల్లో నొప్పి కూడా మొదలైంది. ఇవి కచ్చితంగా ప్రెగ్నెన్సీకి సూచనలే అని భావించిన ఆమె ఆనందంతో ఇంట్లోనే పరీక్ష చేసుకుంది. ఫలితం నెగెటివ్ రావడంతో తన ఆనందమంతా ఆవిరైంది.
ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. పిరియడ్ మిస్సవడం, వికారంగా అనిపించడం, రొమ్ముల్లో నొప్పితో కూడిన అసౌకర్యం.. వంటివి గర్భధారణకు ముందస్తు సూచనలుగా చెబుతున్నారు నిపుణులు. దీంతో ఇవి కనిపించిన వెంటనే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ పరీక్ష చేసుకుంటుంటారు చాలామంది. అయితే ఇందులో కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఇంకొంతమందికి మాత్రం గర్భధారణ జరిగినా ఫలితం నెగెటివ్‌గా వస్తుంటుంది. అందుకు ఇతరత్రా అంశాలతో పాటు పరీక్ష చేసుకునే క్రమంలో మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణం కావచ్చంటున్నారు వైద్యులు. మరి, అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుందాం రండి..
మరీ ముందుగా వద్దు!
గర్భం ధరించడమంటే ఎవరికైనా సంతోషకరమైన విషయమే! అయితే దీన్ని నిర్ధారించుకునే క్రమంలో ఇప్పుడంతా హోమ్ ప్రెగ్నెన్సీ కిట్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఎలాగో కిట్ ఇంట్లోనే ఉంది కదా అని.. అలా నెలసరి మిస్సవగానే ఇలా టెస్ట్ చేసుకుంటుంటారు కొంతమంది! ఇలాంటప్పుడు ఒక్కోసారి ఫలితం నెగెటివ్‌గా వస్తుంటుంది. ఎందుకంటే గర్భం ధరించినా కూడా అది నిర్ధారణ కావడానికి పిరియడ్ మిస్సయ్యాక కనీసం వారం పది రోజుల పాటు సమయం పడుతుందట! ఈ క్రమంలో గర్భధారణను గుర్తించే హెచ్‌సీజీ (హ్యూమన్ కొరోనిక్ గొనడోట్రోపిన్) హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. కాబట్టి మీకు ఈ నెల పిరియడ్ రాలేదు.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే వారం నుంచి పది రోజులు ఆగి ఆ తర్వాత టెస్ట్ చేసుకుంటే ఫలితం మరింత ప్రభావవంతంగా వస్తుందంటున్నారు నిపుణులు.

నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?
ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో నీళ్లు ఎక్కువగా తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా నీళ్లు ఎక్కువగా తాగి ప్రెగ్నెన్సీ పరీక్ష చేసుకున్నా సరైన ఫలితం రాకపోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మరుసటి రోజు ఉదయాన్నే టెస్ట్ చేసుకోవాలనుకున్న వారు.. ముందురోజు రాత్రి ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం వల్ల మూత్రం పలచనయ్యే (డైల్యూట్) అవకాశం ఉంది.. తద్వారా గర్భధారణను గుర్తించే హెచ్‌సీజీ హార్మోన్ స్థాయులు తగ్గిపోతాయి. ఇక ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ పరీక్ష చేసుకుంటే ఫలితం తారుమారయ్యే అవకాశాలే ఎక్కువట! కాబట్టి ముందు రోజు రాత్రి తక్కువ మొత్తంలో నీళ్లు తాగి.. ఉదయం లేవగానే తొలిసారి మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడే పరీక్షించుకుంటే కచ్చితమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది.

కిట్ ఎక్స్పైరీ అయిపోయిందేమో?!
కొంతమంది ముందుగానే కొన్ని ప్రెగ్నెన్సీ కిట్స్‌ని కొనేసి ఇంట్లోనే భద్రపరచుకుంటారు. అయితే వీటిని వేడి, ఎండ, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచడం వల్ల కూడా ఫలితం సరిగ్గా రాకపోవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి కిట్స్‌ని చల్లగా ఉండే ప్రదేశాల్లో, ఫ్రిజ్‌లో ఉంచి.. అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. అంతేకాదు.. ఇలా మీరు ఎక్కువ మొత్తంలో ప్రెగ్నెన్సీ కిట్స్‌ని కొనేయడం వల్ల వాటి ఎక్స్పైరీ తేదీ దాటిపోయే అవకాశాలూ లేకపోలేదు. ఇలాంటి కిట్స్‌తో పరీక్ష చేసుకుంటే ఫలితం అస్సలు కరక్ట్‌గా రాదు. కాబట్టి అవసరం ఉన్నప్పుడే వాటిని కొనుగోలు చేయడం, కొనే ముందు ఎక్స్పైరీ తేదీ పరిశీలించడం, వాటిని వాడే క్రమంలో లేబుల్‌పై రాసున్న సూచనలు పాటించడం.. వంటివి చేస్తే ఫలితం ఒకటి అనుకుంటే మరొకటి వచ్చే అవకాశమే ఉండదు.

ఇలా కూడా జరగచ్చు!
గర్భం ధరించినా పరీక్షలో ఫలితం నెగెటివ్‌గా వస్తోందంటే అందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ.. వంటివి కూడా కారణాలు కావచ్చంటున్నారు నిపుణులు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే పిండం గర్భసంచి బయట పెరగడం. ఇక క్రిప్టిక్ ప్రెగ్నెన్సీలోనైతే అసలు గర్భం ధరించామన్న విషయం తెలియకుండానే నెలలు నిండడం, కొంతమందిలోనైతే విషయం తెలియకుండానే ప్రసవం కూడా అవుతుందట! ఇలాంటి సమస్యలున్నప్పుడు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ఫలితం నెగెటివ్‌గానే వస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఇవి అత్యంత అరుదుగా జరిగే విషయాలే అయినా.. మీకు సందేహముంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి మీరు గర్భవతా? కాదా? అన్నది ముందుగా నిర్ధారించుకోవాలి. ఆపై సమస్యలకు తగిన చికిత్స తీసుకోవడం మేలు! లేకపోతే దానివల్ల ఇతరత్రా తీవ్ర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

వీటిని అశ్రద్ధ చేయద్దు!
అన్ని సమయాల్లో పిరియడ్ రాకపోవడానికి లేదంటే మిస్సవడానికి గర్భం ధరించడమొక్కటే కారణం కాకపోవచ్చు. శరీరంలో హార్మోన్ల స్థాయులు అదుపు తప్పడం, గర్భ నిరోధక మాత్రలు వాడడం.. వంటి వాటి వల్ల కూడా రుతుచక్రంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పిరియడ్ మిస్సయింది కాబట్టి ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనుకుని ఈ సమస్యల్ని దాటవేయకుండా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. కాబట్టి రెండు మూడు వారాలు గడిచిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని.. అప్పుడూ నెగెటివ్ వచ్చిందంటే ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్య నిపుణుల్ని సంప్రదించాలి. అప్పుడు మీకున్న అసలు సమస్యేంటో గుర్తించి తగిన చికిత్స అందిస్తారు.. మీ ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం చక్కటి సలహాలు సూచిస్తారు.
