జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే బెల్లం తినాల్సిందే!
మలబద్ధకం వేధిస్తోందా? దానికీ బెల్లమే పరిష్కారం!
నెలసరి నొప్పులతో సతమతమవుతున్నారా? బెల్లం ఉందిగా!
ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని అనారోగ్యమంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. అయితే ఈ బెల్లాన్ని నేరుగా కంటే.. కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని సుగుణాలు రెట్టింపవుతాయంటున్నారు సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. తద్వారా ఆయా ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో బెల్లం మరింత ప్రభావవంతంగా పని చేస్తుందంటున్నారు. అజీర్తి దగ్గర్నుంచి ఆకలిని అదుపు చేసే దాకా, నెలసరి సమస్యల్ని తగ్గించడం దగ్గర్నుంచి చనుబాలు ఉత్పత్తి చేసే దాకా.. ఇలా ప్రతి ఒక్కటీ బెల్లంతోనే ముడిపడి ఉందంటున్నారామె. ఈ క్రమంలోనే బెల్లాన్ని ఏయే పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో వివరిస్తూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు రుజుత.
క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. వంటి ఎన్నో ఖనిజాలను; బి-కాంప్లెక్స్, ‘సి’, ‘డి2’, ‘ఇ’.. వంటి విటమిన్లను కలిగున్న బెల్లాన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఈ క్రమంలో బీపీని అదుపు చేయడం, శరీరానికి తక్షణ శక్తిని అందించడం, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గించడం.. ఇలా బెల్లం చేసే మేలు ఎంతో! అయితే దీన్ని నేరుగా కంటే ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే ఇందులోని సుగుణాలు రెట్టింపై ఎన్నో అనారోగ్యాల నుంచి విముక్తి పొందచ్చంటున్నారు రుజుత.
ఇలా తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు!
‘బెల్లం.. మనందరి ఇళ్లలో ఉండే తియ్యతియ్యటి పదార్థమిది. ఆరోగ్యపరంగా ఇది అద్భుతాలు సృష్టిస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్ట పరచడానికి, సంతాన సాఫల్యతను పెంచడానికి, ఎముకల దృఢత్వానికి.. ఇలా బెల్లం తింటే ఎంతో ప్రయోజనకరం! అయితే దీన్ని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!
బెల్లం+నెయ్యి
ఈ రెండూ కలిపి తీసుకుంటే మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చు.
బెల్లం+ధనియాలు
నెలసరి సమయంలో అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందచ్చు. నెలసరి నొప్పుల్నీ తగ్గించుకోవచ్చు. స్పాటింగ్ మాత్రమే అవుతోందని బాధపడే వారికి ఆ సమస్య తగ్గి ఎప్పటిలాగే పిరియడ్స్ ప్రారంభమవుతాయి.

బెల్లం+సోంపు
నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.. దంతాలపై పాచి పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.
బెల్లం+మెంతులు
జుట్టు ఆరోగ్యం రెట్టింపవుతుంది.. కుదుళ్లు దృఢంగా మారతాయి.. తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్తపడచ్చు.
బెల్లం+గోంద్
ఎముకల్ని దృఢంగా చేయడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ చక్కగా ఉపకరిస్తుంది. అలాగే పాలిచ్చే తల్లులు తీసుకుంటే చనుబాలు పుష్కలంగా ఉత్పత్తవుతాయి.

బెల్లం+అలీవ్ గింజలు
మనం తీసుకునే ఆహారంలోని ఫోలికామ్లం, ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇక చర్మంపై ఏర్పడిన పిగ్మెంటేషన్ని తగ్గించడంతో పాటు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.
బెల్లం+నువ్వులు
దగ్గు, జలుబు, ఫ్లూ.. వంటివి దరిచేరకుండా మనల్ని కాపాడుతుంది.

బెల్లం+పల్లీలు
శరీరంలో సత్తువను పెంచడానికి, ఆకలిని అదుపు చేయడానికి, ఆహారపు కోరికల్ని తగ్గించడానికి ఈ ఫుడ్ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది.
బెల్లం+పసుపు
ఇది తింటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
బెల్లం+శొంఠి పొడి
జ్వరం నుంచి త్వరగా కోలుకోవడానికి, శరీరంలోని వాపును తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది.
చూశారుగా.. బెల్లాన్ని విడిగా కంటే ఈ పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో! కాబట్టి ఇకపై బెల్లం తినాలనిపించినప్పుడల్లా లేదంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇలా ఆయా పదార్థాలతో కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోండి.. తద్వారా ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండండి!