పిరియడ్స్.. రోజు కంటే ఈ ఐదు రోజులూ కాస్త భిన్నం.. నొప్పి, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటివి ఈ సమయంలో కామన్. అయితే కొంతమంది నెలసరి సమయంలో నొప్పితో ఏమీ చేయాలనిపించక సైలెంట్‌గా ఉండిపోతారు. మరికొందరేమో రోజూ లాగే అన్ని పనులూ చేసేస్తుంటారు. కానీ నెలసరి సమయంలో చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయంటున్నారు గైనకాలజిస్టులు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే ఆ ప్రభావం మన ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, పిరియడ్స్ సమయంలో చేయకూడని ఆ పనులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

ఉప్పు తగ్గించండి!
పిరియడ్స్ సమయంలో ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణాలుంటాయి. కొంతమందిలో పొత్తి కడుపులో నొప్పి, నడుంనొప్పి ఉంటే మరికొంతమందిలో మూడ్‌స్వింగ్స్, ఏమీ తినాలనిపించకపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంకొంతమందిలో ఏదైనా ఆహారం కొద్దిగా తినగానే కడుపు నిండినట్లుగా ఉబ్బసంగా అనిపిస్తుంటుంది. మీలోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయా? అయితే ఈ సమయంలో ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. అలాగే నెలసరి సమయంలో బ్లీడింగ్ రూపంలో నీరు బయటికి వెళ్లిపోవడం వల్ల డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశముంది. కాబట్టి ఈ ఐదు రోజులు నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే కొబ్బరి బోండాలు, మజ్జిగ, పండ్ల రసాలు, సూప్స్.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీరం తేమను కోల్పోకుండా ఉంటుంది. ఉబ్బసం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

టీ తాగాలనిపిస్తే..
రోజూ లాగే పిరియడ్స్లోనూ కాఫీలు, టీలు బాగా తాగుతున్నారా? అయితే ఆ అలవాటును అదుపుచేసుకోవడం లేదంటే కనీసం ఈ సమయంలోనైనా కాఫీలు, టీలు మానేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని కెఫీన్ మెదడులో ఒత్తిడి, ఆందోళనల్ని అదుపులో ఉంచే జీఏబీఏ అనే రసాయనాన్ని బ్లాక్ చేస్తుంది. తద్వారా ఒత్తిడి, ఆందోళనలతో పాటు గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇది అటు మానసికంగా, ఇటు శారీరకంగా అస్సలు మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో టీ తాగాలనుకుంటే మాత్రం పుదీనా టీ, అల్లం టీ, గ్రీన్ టీ.. వంటి హెర్బల్ టీలకు ప్రాధాన్యమివ్వడం ఉత్తమం. వీటివల్ల ఒత్తిళ్లు, ఆందోళనలు దరిచేరకుండా ఉండడంతో పాటు ఈ సమయంలో ఎదురయ్యే నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

కలయిక మంచిదేనా?
నెలసరి సమయంలో కలయిక మంచిదే అని కొందరు నిపుణులు చెబితే.. మరికొందరేమో ఈ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. ఈ సమయంలో సెక్స్ చేసినట్లయితే సురక్షితమైన పద్ధతుల్ని పాటించడం మాత్రం తప్పనిసరి అని సూచిస్తున్నాయి కొన్ని అధ్యయనాలు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పాటిస్తే ఎలాంటి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉండదన్నది నిపుణుల అభిప్రాయం.

వ్యాయామానికి విరామం..
కొంతమంది పిరియడ్స్ సమయంలోనూ రోజూ లాగే వ్యాయామం చేయడం, జిమ్‌లో కసరత్తులు చేయడం.. వంటివి చేస్తుంటారు. అయితే ఈ సమయంలో గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్, వెజైనా.. వంటి కటి భాగాలకు రక్తప్రసరణ అధికంగా ఉంటుంది. అలాగే ప్రొస్టాగ్లాండిన్స్ అనే రసాయనం ఎక్కువ బ్లీడింగ్, నొప్పికి కారణమవుతుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల మరింత రక్తం బయటకు పోవడంతో పాటు నొప్పి ఎక్కువగా వచ్చే ఆస్కారముంటుంది. కాబట్టి నెలసరి సమయంలో వ్యాయామం చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలి.. లేదంటే ఫిట్నెస్ కోల్పోతాం.. అనుకుంటే గనుక నడక, ధ్యానం.. వంటి సులభమైన వ్యాయామాలకు ప్రాధాన్యమివ్వడం మంచిదంటున్నారు నిపుణులు.

మలబద్ధకం మితిమీరకుండా..
ప్రొజెస్టిరాన్ హార్మోన్ కారణంగా నెలసరి సమయంలో మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. అందులోనూ ఈ సమయంలో కొందరికి నూడుల్స్, బర్గర్స్, పిజ్జా.. వంటి ప్రాసెస్డ్ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది. ఇక వీటివల్ల మలబద్ధకం సమస్య మరింత తీవ్రమవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నెలసరి రావడానికి ముందు, తర్వాత, నెలసరి సమయంలో తాజా పండ్లు, కూరగాయలు, సలాడ్లు.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
ఇవి కూడా! * మనం రోజూ ఉపయోగించే స్ప్రేలు, పెర్ఫ్యూమ్స్, క్రీమ్స్.. వంటివి పిరియడ్స్ సమయంలో ఉపయోగించద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని రసాయనాల వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందట! అందుకే వీలైతే ఈ సమయంలో సహజసిద్ధమైన ఉత్పత్తుల్ని వినియోగించడం మేలు. * నెలసరి నొప్పుల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకుంటుంటారు. కానీ వాటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలతో, పద్ధతులతో ఆ నొప్పుల్ని దూరం చేసుకోవడం ఉత్తమం. * పిరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యవసరం. ఈ క్రమంలో ప్రతి నాలుగ్గంటలకోసారి న్యాప్కిన్లు మార్చుకోవడం, ఒకవేళ మెన్స్ట్రువల్ కప్స్ వంటివి ఉపయోగిస్తే ప్రతి 12 గంటలకోసారి మార్చుకోవడం.. వంటివి తప్పనిసరిగా పాటించాలి. |
పిరియడ్స్ సమయంలో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకున్నారుగా! మరి, వీటిని దృష్టిలో ఉంచుకొని పాటిస్తే నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండచ్చు.