పిల్లలు వద్దనుకున్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్.. మంచిదా? కాదా?
‘ముందు జీవితంలో సెటిలవ్వాలి.. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’ ఇది ఈ తరం అమ్మాయిల ఆలోచనా ధోరణి. అయితే ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనడం వాయిదా వేసే వారు చాలామందే ఉంటారు. ఇలాంటి మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్ (శీతలీకరణ పద్ధతిలో అండాల్ని నిల్వ చేసుకోవడం) పద్ధతి ఓ వరమని చెప్పాలి. యుక్త వయసులో ఉన్నప్పుడు తమ అండాల్ని నిల్వ చేసుకొని.. ఇక ఎప్పుడంటే అప్పుడు పిల్లల్ని కనే అద్భుత అవకాశాన్ని అందిస్తోందీ పద్ధతి. అయితే మహిళలకు ఏ వయసులోనైనా సంతాన భాగ్యాన్ని ప్రసాదించే ఈ పద్ధతి గురించి చాలామందిలో చాలా అపోహలే నెలకొన్నాయని చెప్పచ్చు. అసలు ఇలా నిల్వ చేసిన అండాల వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారా?, దీనివల్ల ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకు ఏదైనా ప్రమాదముంటుందేమో?, ఏ వయసులో ఉన్నప్పుడు అండాల్ని శీతలీకరించుకోవడం మంచిది? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సందేహాలెన్నో! అయితే ఏది ఎలా ఉన్నా కూడా ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి సురక్షితమైనది, ఎంతో ప్రభావవంతమైందని చెబుతున్నారు నిపుణులు. ఈ పద్ధతి గురించి మహిళల్లో నెలకొన్న సాధారణ అపోహలు, సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా మహిళల్లో 30 దాటితే అండాల నిల్వ క్రమంగా తగ్గిపోతుంటుంది.. ఇలా వయసు పెరిగే కొద్దీ ఉత్పత్తయ్యే అండాలు కూడా అంత ఆరోగ్యకరంగా ఉండవని, వాటితో గర్భం దాల్చితే పిల్లల్లో అవకరాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతుంటారు నిపుణులు. అందుకే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవాలనుకుంటోన్న వారు యుక్త వయసులోనే తమ అండాల్ని నిల్వ చేసుకునేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని ఎంచుకోమని సూచిస్తున్నారు. పైగా ఇది సురక్షితమైందని, ప్రభావవంతమైందని కూడా సలహా ఇస్తున్నారు.