చలికాలంలో వేడివేడిగా ఉండే పదార్థాలను తినడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాం. ఇందులో భాగంగా చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి వేడివేడిగా టీ, కాఫీ.. వంటివి పదే పదే తాగుతుంటాం. అయితే ఇలా తరచుగా వీటిని తాగడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలో సహజసిద్ధంగా వేడి పుట్టించడంతో పాటు, శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందించే ఆహారం ఏదైనా ఉంటే బాగుంటుంది కదూ.. అయితే అలాంటి ఆహార పదార్థాలు కూడా కొన్నున్నాయి. మరి అవేంటో తెలుసుకుని.. వాటిని మీ రోజువారీ మెనూలో చేర్చేసుకోండి..

ఉల్లి..
వివిధ వంటకాల్లో ఉపయోగించే ఉల్లిపాయ ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. ఇందులో ఉండే యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల జలుబు, ఫ్లూ.. వంటి సమస్యలు దరిచేరకుండా ఉండడంతో పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా ఉల్లి తోడ్పడుతుంది.

అల్లం - వెల్లుల్లి..
వంటకాలకు చక్కని రుచినివ్వడంలోనే కాదు.. శరీరంలో వేడి పుట్టించి వెచ్చగా ఉంచడంలోనూ అల్లం తోడ్పడుతుంది. మరి దీనికోసం రోజూ వంటకాల్లో అల్లం వాడడంతో పాటు ప్రతిరోజూ అల్లంతో తయారు చేసిన టీ తాగడం మంచిది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు, చలి నుంచీ ఉపశమనం లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు.. వంటి గొంతు సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి.
శరీరంలో వేడి పుట్టించడంతో పాటు జీవక్రియల వేగాన్ని పెంచడానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని వంటకాల్లో విరివిగా వాడతారు. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా కూరల్లో వెల్లుల్లి వచ్చినప్పుడు తీసి పారేయకుండా తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

డ్రైఫ్రూట్స్
శరీరానికి వెచ్చదనాన్నివ్వడంలో బాదంపప్పులు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీనికోసం నాలుగైదు బాదంపప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినాలి. రక్తహీనత సమస్యను తగ్గించి గుండెను సురక్షితంగా ఉంచడంలోనూ బాదం తోడ్పడుతుంది.
అలాగే వాల్నట్స్, ఖర్జూరాలు, జీడిపప్పు, వేరుశెనగ.. మొదలైన గింజలు చలికాలంలో వచ్చే జలుబుతో పోరాడడంతో పాటు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి.

తేనె..
చూడగానే నోరూరించే తేనె వల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో వేడి పుడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అలాగే దీనివల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలామంది తేనెను చక్కెరకు బదులుగా వాడడం; బ్రెడ్‌పై రాసుకుని తినడం; ఓట్స్, కార్న్ఫ్లేక్స్ల్లో వేసుకుని తినడం.. వంటివి చేస్తుంటారు. మరో విషయమేంటంటే.. చక్కెరకు బదులుగా తేనెతో పాటు బెల్లాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.
ఘాటైనవి..
పచ్చిమిర్చి, ఎండుమిర్చి.. ఇవి తినడానికి ఘాటుగా ఉంటాయి. ఇందులో ఉండే ఈ లక్షణమే శరీరంలో వేడి పుట్టేలా చేస్తుంది. వీటిని నేరుగా తింటే నోరు మండుతుంది.. కాబట్టి మిర్చిబజ్జి, చల్లమిరపకాయలు.. ఇలా తయారు చేసుకుని తింటే ఫలితం ఉంటుంది.
కొంచెం తీయగా.. కొంచెం ఘాటుగా ఉండే దాల్చినచెక్క వల్ల కూడా శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ దాల్చినచెక్క పొడితో చేసిన టీ తాగడం లేదంటే రోజువారీ కూరల్లో దాల్చినచెక్కను వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే దీని వల్ల వంటలకు చక్కటి రుచి కూడా వస్తుంది.

నల్ల మిరియాలు..
నల్ల మిరియాలలో పైపెరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వేడి పుట్టించే గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది. చలికాలంలో ఎదురయ్యే దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది వీటిని పాలలో వేసుకుని మరిగించుకుని తాగుతారు. వీటిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.

ఆకుకూరలు..
ఆకుకూరల్లో ఎక్కువగా లభించే ఫోలికామ్లం, ఖనిజాలు, విటమిన్ల వల్ల చలికాలంలో ఎదురయ్యే ఫ్లూ, జలుబు, దగ్గు.. వంటి సమస్యల నుంచి ఉపశమనం కలగడంతో పాటు శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకోవాలి.
ఇవి మంచివి!
అదేవిధంగా ఈ కాలంలో టీ, కాఫీకి బదులుగా వేడివేడిగా ఉండే గ్రీన్‌టీ, సూప్స్.. వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వీటితో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటివల్ల శరీరంలో వేడి పుట్టి వెచ్చగా ఉంటుంది.