పండగంటే చాలు.. దేవుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో రవ్వ కేసరి/హల్వా తప్పకుండా ఉంటుంది. పాలు, నెయ్యి, నట్స్, డ్రైఫ్రూట్స్.. వంటి ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాలు మిళితం చేసి చేసే ఈ హల్వాను దేవుడికి నైవేద్యం పెట్టాక ఎప్పుడెప్పుడు ప్రసాదంగా స్వీకరిస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తుంటాం.. కానీ కొంతమంది ఇందులో వాడే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదంటూ దీన్ని తినడమే మానేస్తుంటారు. అలాంటి అపోహను వీడమంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ కంటే ఇంట్లో చేసుకున్న ఏ పదార్థమైనా ఆరోగ్యకరమే అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారామె. అంతేకాదు.. ఏదైనా అతిగా తింటే విషం, మితంగా తింటే అమృతం అన్న మాటను మరోసారి గుర్తుచేశారు కూడా! మరి, ఈ పండగ సీజన్లో రుజుత హల్వా ఎందుకు తినమంటున్నారో? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో? తెలుసుకుందాం రండి..
క్యారట్/బీట్రూట్/బాదం/గోధుమ పిండి.. ఇలా ఎన్ని రకాల హల్వా వెరైటీస్ ఉన్నప్పటికీ పండగలప్పుడు దేవుడికి సమర్పించే నైవేద్యం విషయంలో మాత్రం రవ్వతో చేసిన హల్వాకే తొలి ప్రాధాన్యమిస్తామన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ పదార్థం ఆరోగ్యాన్ని పెంచడమే కాదు.. కరోనా లాంటి మహమ్మారులెన్నొచ్చినా తట్టుకొని నిలబడేలా రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచే అద్భుత ఔషధం అంటున్నారు రుజుత. ఈ క్రమంలోనే రవ్వ కేసరి ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్.
రోగనిరోధక శక్తిని పెంచే షాట్ ఇది!
రవ్వ కేసరి ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రుజుత.. ‘మనందరం హల్వా ఎందుకు తినాలంటే..?’ అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చారు. ‘మన ఇళ్లలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. దాన్నుంచి కోలుకోవడానికి, శక్తిని తిరిగి పొందడానికి రవ్వ కేసరి తినమని సలహా ఇవ్వడం చూసే ఉంటాం. రాగి పాత్రలో గోధుమ రవ్వను వేయించి; నెయ్యి, పాలు, చక్కెర, కుంకుమపువ్వు, డ్రైఫ్రూట్స్.. ఇలా అన్నీ వేసి తయారుచేసే ఈ స్వీట్ డిష్ ఆకలిని అదుపు చేయడంతో పాటు అనారోగ్యానికి గురైన వారు త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది. అంతేనా..! ఏ పూజైనా రవ్వ కేసరి లేకుండా పూర్తి కాదు. అలాగే మనం ఒక విషయం గమనిస్తే.. ఈ పూజలు, పండగలు కూడా ఆయా కాలాలు మారుతున్నప్పుడే వస్తుంటాయి. ఇలా సీజనల్ మార్పుల వల్ల మనలో తలెత్తే వివిధ రకాల అనారోగ్యాలను ఈ కేసరి ప్రసాదం దూరం చేస్తుంది. అంటే.. ఇది మనకు రోగ నిరోధక శక్తిని పెంచే షాట్‌గా ఉపయోగపడుతుందన్నమాట!
అవి నిజంగా విషపూరితమే!
అయితే ఇలాంటి స్వీట్స్‌లో ఉండే చక్కెర ఆరోగ్యానికి హానికరం, విషపూరితం అంటూ ఏకంగా ఈ పదార్థాన్నే దూరం పెడుతుంటారు కొందరు. ఇలా దీంతో పాటు పండగల సీజన్లో చేసే లడ్డూ, బర్ఫీ.. వంటివి తీసుకోవడం తగ్గించి; శీతల పానీయాలు, కుకీస్, చాక్లెట్స్.. వంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు. మరి, వీటిలోనూ చక్కెర ఉంటుంది కదా! నిజానికి ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఇలాంటి పదార్థాల్లో చక్కెర ఉన్నా, చక్కెరకు బదులుగా మరే ఇతర స్వీట్నర్ వాడినా అవి విషపూరితమైనవే! అదే ఆయా కాలాలకు అనుగుణంగా ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసుకున్న ఏ పదార్థమైనా మనకు ఆరోగ్యాన్ని అందించేదే! అటు ఇవి పర్యావరణానికీ మంచివే!
రాబోయేది మహమ్మారుల కాలమని శాస్త్రవేత్తలు ఇటీవలే హెచ్చరించారు. అలాంటివి రావడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కూడా వారు చెబుతున్నారు. కాబట్టి ఇటు వాతావరణాన్ని, అటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది.. ఇక చివరగా మరొక్క విషయం.. ఏదైనా మోతాదుకు మించి తింటేనే అది విషమవుతుంది.. అంతేకానీ చక్కెర కాదు!’ అంటూ ఈ పండగ సీజన్లో హల్వా ఎందుకు తినాలో చెబుతూనే, చక్కెర గురించి చాలామందిలో ఉన్న అపోహల్ని పటాపంచలు చేశారీ న్యూట్రిషనిస్ట్.
రవ్వ కేసరి ఇలా రుచిగా చేసేద్దాం..!

కావాల్సినవి * గోధుమ రవ్వ – అరకప్పు * చక్కెర – 1/3 కప్పు * పాలు - 3/4 కప్పు * నీళ్లు - 3/4 కప్పు * నెయ్యి - అరకప్పు * డ్రైఫ్రూట్స్ (చిన్నగా తరిగి పెట్టుకోవాలి) - కొన్ని * యాలకుల పొడి - అర టీస్పూన్ తయారీ * ముందుగా స్టౌ మీద ఒక కడాయి పెట్టి అందులో పాలు, నీళ్లు, చక్కెర వేసి ఒక్క పొంగు రానివ్వాలి. తద్వారా చక్కెర కరుగుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి కలియబెట్టి స్టౌ ఆఫ్ చేయాలి. * ఇప్పుడు మరో ప్యాన్‌లో నెయ్యి వేసి కరిగాక దీనిలో రవ్వ వేసి దోరగా వేయించాలి. ఆపై చిన్నగా తరిగి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలుపుతూ మీడియం మంటపై వేయించాలి. అన్నీ వేగాక యాలకుల పొడి వేసి కలపాలి. * ఆపై పది నిమిషాల పాటు అలాగే కలుపుతుండడం వల్ల రవ్వలో నుంచి నెయ్యి నెమ్మదిగా బయటికొస్తూ సువాసనలు వెదజల్లుతుంది. * ఇప్పుడు ఇందాక కాచి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని రవ్వలో కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. ఇలా కలుపుతున్న క్రమంలోనే కాసేపటికి ఈ మిశ్రమం చిక్కపడి పొడిగా తయారవుతుంది. * ఇప్పుడు స్టౌ కట్టేసి వేయించిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే సరి.. ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి రడీ! అయితే మరీ పొడిపొడిగా వద్దనుకునే వారు కాస్త ముందుగానే దించేయడం మంచిది. అలాగే ఈ స్వీట్ తయారీలో పాలు ఉపయోగించడం వల్ల కేసరి మరింత మృదువుగా, రుచిగా వస్తుంది.
|
ఆరోగ్యానికెంతో మంచిది!

* గోధుమ రవ్వలోని ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహకరిస్తాయి. * ఐరన్ లోపంతో బాధపడే వారు రవ్వ కేసరి, రవ్వతో చేసుకున్న ఇతర వంటకాలను తీసుకోవడం వల్ల ఆ లోపాన్ని అధిగమించచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు కారణం దీనిలో ఐరన్ అధికంగా ఉండడమే! * అలాగే క్యాల్షియం, మెగ్నీషియం, జింక్.. వంటి ఖనిజాలు నిండి ఉన్న గోధుమ రవ్వ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. * ఇక ఇందులో కొవ్వు శాతం శూన్యం. కాబట్టి దీన్ని పదే పదే తీసుకున్నా ఎలాంటి అనారోగ్యాలు తలెత్తే అవకాశం లేదంటున్నారు నిపుణులు. * హల్వా తయారీలో వాడే నెయ్యి వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ చలికాలంలో ఎదురయ్యే శారీరక నొప్పులు, కీళ్ల నొప్పుల్ని నివారించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందట! * ప్రొటీన్, క్యాల్షియం అధికంగా ఉండే పాలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అలాగే స్థూలకాయం బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 * ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్.. వంటి పోషకాలు మిళితమై ఉన్న డ్రైఫ్రూట్స్‌ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. కొవ్వు స్థాయులు అదుపులో ఉంటాయి. అలాగని వీటిని మోతాదుకు మించి తీసుకున్నా మంచిది కాదని, రోజుకు 20 గ్రాముల చొప్పున చాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. * క్యాన్సర్‌తో పోరాడే సమ్మేళనాలు యాలకుల్లో అధికంగా ఉంటాయి. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బీపీని అదుపులో ఉంచుతాయి. వీటితో పాటు జీర్ణశక్తిని పెంచడంలోనూ యాలకులు సమర్థంగా పనిచేస్తాయి.
|
ఈ పండగ సీజన్లో రవ్వ కేసరి/హల్వా ఎందుకు తీసుకోవాలో తెలిసిందిగా! కాబట్టి ఈసారి దీపావళి పండక్కి బయటదొరికే చాక్లెట్స్, కేక్స్, శీతల పానీయాలు.. వంటివి ఎంచుకోకుండా ఎంచక్కా ఇంట్లోనే ఈ స్వీట్ డిష్ తయారుచేసుకొని ఆరగించండి! తద్వారా అటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.. ఇటు స్వీట్ తినాలన్న కోరికా తీరుతుంది..!