దేవిక ప్రస్తుతం ఆరో నెల గర్భిణి. కరోనా కారణంగా రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్లడానికి కూడా భయపడుతోందామె. అంతేకాదు.. ఇంట్లో ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాల్ని తన మెనూలో భాగం చేసుకుంటోంది.
వేదికకు డిసెంబర్లో డెలివరీ డేట్ ఇచ్చారు. తాను లేటు వయసులో గర్భం ధరించడంతో తనది కాస్త హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు వైద్యులు. దీనికి తోడు కరోనా భయంతో అటు తీసుకునే ఆహారం విషయంలో, ఇటు ఇతర విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రసవానికి సంసిద్ధమవుతోందామె.
ఈ కరోనా సమయంలో మనలాంటి సాధారణ వ్యక్తుల కంటే గర్భిణులు, ఇతర అనారోగ్యాలున్న వారు, చిన్న పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న విషయం తెలిసిందే! ఇక గర్భిణులకైతే ఈ మహమ్మారి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అటు రెగ్యులర్ చెకప్స్ వెళ్లనివ్వదు.. ఇటు ఇంట్లో ఉన్నా ఎటు నుంచి తమకు ముప్పు వస్తుందోనన్న భయం చాలామందిలో ఉంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే కాబోయే అమ్మలు ఈ వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. మరి, ఈ క్రమంలో గర్భిణులు ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..
సాధారణంగానే గర్భిణుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ వైరస్ బారిన పడే ముప్పు పెరిగినట్లే లెక్క! ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే భయం చాలామంది గర్భిణుల్ని కుంగదీస్తుంది.. ఈ క్రమంలో కొంతమంది కనీసం రెగ్యులర్ చెకప్స్‌కి కూడా వెళ్లడానికి భయపడితే.. మరికొంతమంది డెలివరీ డేట్ కంటే ముందుగానే సిజేరియన్ చేయించుకుంటున్నారట! కానీ ఇలా చేయడం అస్సలు కరక్ట్ కాదని చెబుతున్నారు నిపుణులు. ఎలాంటి సమస్యలు లేని గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో ఆన్లైన్లోనే డాక్టర్ని సంప్రదించచ్చని, అదే హై-రిస్క్ ప్రెగ్నెన్సీ జోన్లో ఉన్న వారు/నెలలు నిండిన మహిళలు మాత్రం సరైన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులను సంప్రదించడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. అంతేకాదు.. కరోనాకు భయపడి ముందుగానే డెలివరీ చేయించుకోవడం కూడా సరైంది కాదని.. బయటి వాతావరణం కంటే కడుపులోనే బిడ్డ పూర్తిగా ఎదిగితే ఆరోగ్యంగా ఉండగలడని గర్భిణులకు ధైర్యం చెబుతున్నారు. ముందుగా ఈ భయాలన్నీ పోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరమంటున్నారు.

ఇమ్యూనిటీ తగ్గితే ఏమవుతుంది?
గర్భిణుల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల పలు రకాల అనారోగ్యాలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.
* ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు, వాతావరణంలోని క్రిములు, బ్యాక్టీరియా.. వంటివి సులభంగా శరీరంపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది.
* సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు.. వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న గర్భిణుల్లో ఇవి తరచుగా ఇబ్బంది పెడతాయట!
* గర్భస్థ సమయంలో అలసట, నీరసం అనేవి కామన్. కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. వేవిళ్ల సమస్య కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
* రోగనిరోధక శక్తి పిండం అభివృద్ధిపైనా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంటే పిండం అభివృద్ధి కూడా బాగుంటుంది. అలాగే కడుపులో పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండగలుగుతాడు.
ఈ ఆహారంతో పెంచుకుందాం..!

* పెరుగులోని ప్రొ-బయోటిక్స్ గర్భిణుల్లో, కడుపులో పెరుగుతున్న బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. అందుకే పెరుగును రోజూ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఈ ప్రొ-బయోటిక్స్ బిడ్డ పుట్టాక వాళ్లు ఎదిగే క్రమంలో ఆస్తమా, ఇతర అలర్జీలు.. వంటి అనారోగ్యాలు తలెత్తకుండా చేస్తుంది. * గర్భిణిగా ఉన్న సమయంలో ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ఆహారపు కోరికలుంటాయి. ఈ క్రమంలో కొందరికి స్నాక్స్ నచ్చితే.. మరికొందరు స్వీట్స్ ఇష్టపడతారు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారం మీ బిడ్డ ఆరోగ్యంపై కూడా పడుతుంది కాబట్టి.. మీకు నచ్చిన పదార్థాలు డాక్టర్ సలహా మేరకు మితంగా తీసుకుంటూనే.. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మంచి కొవ్వులు.. అధికంగా ఉండే పదార్థాలు తినాలి. ఇవన్నీ తల్లీబిడ్డల ఆరోగ్యానికే కాదు.. వారిలో రోగనిరోధక శక్తిని పెంచడానికీ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. * విటమిన్ ‘డి’లోపం ఉన్న వారిలో కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ మధ్యే ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి గర్భిణులు ఈ విటమిన్ లోపం లేకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం ఉదయాన్నే లేలేత ఎండలో కాసేపు నిల్చోవడంతో పాటు కోడిగుడ్లు, బ్రొకోలీ, అవకాడో, చేపలు, మాంసం.. వంటి ‘డి’ విటమిన్ ఎక్కువగా లభించే పదార్థాలను తీసుకోవాలి. తద్వారా రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది. * ఇమ్యూనిటీని పెంచడంలో జింక్ పాత్ర కూడా కీలకమే! కాబట్టి డాక్టర్ సలహా మేరకు జింక్ సప్లిమెంట్స్ వాడుతూనే.. నట్స్, గింజలు, ఆకుకూరలు.. వంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
 * ఏ దశలో ఉన్న వారికైనా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ‘సి’ విటమిన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో గర్భిణులు ఈ విటమిన్ అధికంగా లభించే నిమ్మజాతి పండ్లు, స్ట్రాబెర్రీ, కివీ, జామ.. వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని విటమిన్ ‘సి’ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుంది. * వెల్లుల్లిలో ఉండే క్యాల్షియం, పొటాషియం, సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచి.. బ్యాక్టీరియా, వైరస్ వంటి ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడేలా శరీరాన్ని తయారుచేస్తాయి. కాబట్టి గర్భంతో ఉన్న మహిళలు వెల్లుల్లిని రోజూ కూరల్లో వేసుకొని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. * శరీరంలో తేమ స్థాయులు తగ్గకుండా ఉంచుకోవడానికి నీళ్లు ఎక్కువగా తాగాలన్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో గర్భిణులు రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కా మన శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా చేస్తుంది.. అంటే పరోక్షంగా మనలో రోగనిరోధక శక్తి పెరిగినట్లే కదా!
|
అందుకే అరగంట వ్యాయామం చేయాలట!

గర్భస్థ సమయంలో ఏదో ఒక వ్యాయామం చేయడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. తద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. అదెలా అంటే.. వ్యాయామం చేసే క్రమంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.. తద్వారా బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే వ్యాయామం చేయడం వల్ల రక్తంలోకి యాంటీబాడీలు, తెల్లరక్తకణాలు విడుదలవుతాయి.. తద్వారా మన శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా త్వరగా గుర్తించచ్చట! ఇక వ్యాయామం సహజంగానే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా మానసికంగా ప్రశాంతంగా ఉండడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.. ఇలా ఏ విధంగా చూసినా వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే.. కాబట్టి గర్భిణులు రోజుకు అరగంట పాటు వర్కవుట్ చేయడం మంచిది. అయితే ఏయే వ్యాయామాలు చేయచ్చు అనే విషయం మాత్రం ముందు మీ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల పర్యవేక్షణలో పరీక్షించుకొని వారు సూచించిన వర్కవుట్స్ చేస్తే ఇటు మీపై, అటు మీ కడుపులోని బిడ్డపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.
|
ఇక వీటన్నింటితో పాటు ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. కాబట్టి గర్భం ధరించిన మహిళలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లడం మంచిది. తద్వారా ఇటు ఇమ్యూనిటీని పెంచుకుంటూ.. అటు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.. ఏమంటారు?!