భార్గవి వయసు 35 ఏళ్లు. తనకు ఈ మధ్య పదే పదే నెలసరి క్రమం తప్పుతోంది. దీనికి తోడు శారీరకంగా పలు మార్పులు గమనించడంతో పాటు మానసిక ఒత్తిడితోనూ సతమతమవుతోందామె. అసలు ఉన్నట్లుండి తనకు ఎందుకిలా అవుతోందో అర్థం కాక డాక్టర్‌ను సంప్రదించింది.
38 ఏళ్ల శ్రావణికి ముందు నుంచి నెలసరి సక్రమంగానే వస్తుంది. కానీ ఈ మధ్య పిరియడ్స్ క్రమం తప్పడం, లైంగిక కోరికలు తగ్గిపోవడంతో.. అసలు తన శరీరంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోతోందామె.
మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక్కో దశలో ఒక్కో రకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. నెలసరి ప్రారంభానికి ముందు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. పిరియడ్స్ మొదలయ్యాక వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇవి వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తున్నాయి. చిన్న వయసులో మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టే మహిళల పరిస్థితి కూడా ఇదే! చాలా తక్కువ శాతం మంది మహిళల్లో ఇలా జరుగుతున్నప్పటికీ మానసికంగా కుంగిపోకుండా, దీనికి గల అసలు కారణాలేంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అక్టోబర్‌ని ‘మెనోపాజ్ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో అసలు చిన్న వయసులో మెనోపాజ్ రావడానికి గల కారణాలేంటి? దాని పర్యవసానాలేంటి? తెలుసుకుందాం రండి..
మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోవడం. మన ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సాధారణంగా 45-55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ దశలోకి అడుగుపెడతారు. కానీ అరుదుగా అంటే దాదాపు ఒక్క శాతం మంది మహిళలు మాత్రమే 35-40 ఏళ్ల లోపు మెనోపాజ్ లక్షణాలను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు పలు కారణాలూ లేకపోలేదంటున్నారు.

ఇంతకీ ఏంటా కారణాలు?
చిన్న వయసులో మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టడానికి కొన్ని అంశాలు కారణమవుతాయంటున్నారు నిపుణులు.
* కుటుంబ నేపథ్యం దీనిపై ప్రభావం చూపుతుందట. అంటే ఇది వరకే మీ కుటుంబంలోని మహిళలు (అమ్మమ్మ/తల్లి/సోదరి) చిన్న వయసులోనే ఈ దశలోకి అడుగుపెడితే మీపైన కూడా ఆ ప్రభావం అధికంగానే ఉంటుందంటున్నారు నిపుణులు.
* అసాధారణ జన్యుపరమైన లోపాలు సైతం చిన్న వయసులో మెనోపాజ్ దశలోకి అడుగిడడానికి ఓ కారణమట!
* క్యాన్సర్ నుంచి బయటపడడానికి చేయించుకునే కీమోథెరపీ/రేడియేషన్ వంటి చికిత్సలు, ఈ క్రమంలో వాడే మందుల వల్ల కూడా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉందట!
* మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ.. హార్మోన్లను ఉత్పత్తి చేసే అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పుడు దాని ప్రభావం అండాశయాలపై పడుతుంది. చిన్న వయసులో మెనోపాజ్ రావడానికి ఇదీ ఓ కారణమే.
* మంప్స్ ఇన్ఫెక్షన్, పెల్విక్ ట్యుబర్క్యులోలిస్.. వంటి సమస్యలు అండాశయాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా త్వరగా మెనోపాజ్ దశలోకి అడుగిడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
* అండాశయాలను తొలగించడం (బైలేటరల్ ఓఫోరెక్టమీ), గర్భాశయం తొలగించాల్సి రావడం (హిస్టరెక్టమీ).. వంటి శస్త్రచికిత్సలు కూడా ఇందుకు కారణమవుతాయి.

లక్షణాలెలా ఉంటాయంటే..?!
సాధారణంగా 30-40 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఓ మూడు నెలల పాటు పిరియడ్ రావట్లేదంటే నెల తప్పామేమో అనుకుంటారు. కానీ అది కారణం కాకుండా.. నెలల తరబడి పిరియడ్స్ రాకపోయినా, నెలసరి క్రమం తప్పినా, వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టడం, లైంగికాసక్తి తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం, బరువు పెరగడం.. వంటి లక్షణాలు కనిపించినా మెనోపాజ్ దశకు సంకేతాలుగా భావించాలంటున్నారు నిపుణులు. ఇది నిజమో, కాదో నిర్ధారించుకోవడానికి వైద్యుల్ని సంప్రదించి వారి సలహా మేరకు ఈ పరీక్షలన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది.
* ప్రెగ్నెన్సీ పరీక్ష
* పెల్విక్ పరీక్ష
* రక్త పరీక్ష.. దీని ద్వారా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్), ఈస్ట్రడియోల్, ప్రొలాక్టిన్, యాంటీ ముల్లెరియన్ హార్మోన్.. వంటి పరీక్షలన్నీ చేసి హార్మోన్ల పనితీరు, వాటి స్థాయుల్ని పరిశీలిస్తారు.
* జన్యు పరీక్ష
* వీటితో పాటు మీరు ఇది వరకు క్యాన్సర్ చికిత్సలేమైనా (కీమోథెరపీ/రేడియేషన్) తీసుకున్నారేమో.. వాటి వివరాలను కూడా డాక్టర్‌కి తెలియజేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మీరు మెనోపాజ్ దశకు చేరుకున్నారో, లేదో వైద్యులు నిర్ధారిస్తారు.

ఈ దుష్ప్రభావాలు రాకుండా..!
కారణమేదైనా చిన్న వయసులో మెనోపాజ్ రావడాన్ని ఎలాగూ మనం ఆపలేం కాబట్టి దాని ద్వారా ఇతర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలంటున్నారు వైద్యులు.
* మెనోపాజ్ దశలోకి చేరువయ్యే క్రమంలో ఎదురయ్యే లక్షణాలను చాలామంది మహిళలు జీర్ణించుకోలేరు. తద్వారా ఆత్మన్యూనత భావనకు లోనవుతుంటారు.. ఇది శారీరకంగా, మానసికంగా మనల్ని దెబ్బతీస్తుంది. కాబట్టి శరీరంలో జరిగే ఈ సహజసిద్ధమైన మార్పుల్ని సానుకూల దృక్పథంతో స్వీకరించేలా సిద్ధం కావాలి. ఇందుకు నిపుణుల వద్ద కౌన్సెలింగ్ కూడా తీసుకోవచ్చు. ఫలితంగా ఈ దశలోనూ పాజిటివ్‌గా ఉండచ్చు.
* మెనోపాజ్ దశలోకి అడుగిడే క్రమంలో శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు తగ్గిపోతాయి. ఇది ఆస్టియోపొరోసిస్ సమస్యకు కారణం కావచ్చు! తద్వారా ఎముకల సాంద్రత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. మరి, ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందునుంచే లేదంటే కనీసం ఇప్పుడైనా క్యాల్షియం, విటమిన్ ‘డి’.. వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటితో పాటు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా వాడచ్చు.
* ఇక చిన్న వయసులో మెనోపాజ్ చాలామంది మహిళలను సంతాన భాగ్యానికి నోచుకోకుండా చేస్తుంది. కాబట్టి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే సంతానం విషయంలో ముందు నుంచే జాగ్రత్తపడమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చే మార్పుల్ని గమనిస్తూ, నిపుణులతో రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే.. ఆ తర్వాత సంతానానికి నోచుకోలేకపోయామే అన్న బాధ ఉండదు.

ఈ థెరపీ మంచిదేనా?
చిన్న వయసులో మెనోపాజ్ రావడాన్ని నివారించడమనేది అసాధ్యమంటున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో మన శరీరంలో తగ్గిపోయే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయుల్ని బ్యాలన్స్ చేసుకోవడానికి కొందరు నిపుణులు ‘హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ’ సూచిస్తుంటారు. అది కూడా ఆయా మహిళల ఆరోగ్య స్థితిని బట్టే! ఈ థెరపీ ఆస్టియోపొరోసిస్ రాకుండా చేయడంతో పాటు గుండె ఆరోగ్యానికీ మంచిదే.. కానీ కొంతమందిలో ఇది బ్రెయిన్ స్ట్రోక్, రక్తం గడ్డకట్టుకుపోవడం, రొమ్ము క్యాన్సర్.. వంటి ప్రమాదకర సమస్యలకూ దారితీయచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి మీ ఆరోగ్య స్థితిని బట్టి దీని పర్యవసానాలేంటో తెలుసుకున్నాకే, డాక్టర్ సలహా మేరకు ఈ విషయంలో అడుగు ముందుకేయడం మంచిది.
ఇక వీటన్నింటితో పాటు ఈ దశలో పోషకాలతో నిండిన సమతులాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అలాగే ఈ క్రమంలో జరిగే శారీరక మార్పులు, మానసిక సమస్యల్ని నిపుణులు, కుటుంబ సభ్యులతో చర్చించి వారి నుంచి సలహాలు తీసుకుంటే అటు శారీరకంగా, ఇటు మానసికంగా దృఢంగా ఉండచ్చు..!