దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఉపవాసం ఉండడం నవ్యకు అలవాటే! అయితే మధ్యమధ్యలో పండ్లు తీసుకోవడంతో పాటు పండక్కి చేసిన పిండి వంటకాల్ని సాయంత్రం ఉపవాసం అనంతరం మనసారా ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు అజీర్తి చేసిందామెకు.
భవ్య వాళ్లమ్మ ఈ దసరా పండక్కి వారం రోజుల ముందుగానే రకరకాల పిండి వంటకాల్ని సిద్ధం చేసింది. ఇంకేముంది వీటితో భవ్యకు రోజూ పండగే! తినాలనిపించినప్పుడల్లా ఎక్కువ మొత్తంలో తినేసరికి గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడింది.
దసరా, దీపావళితో ఈ రెండు నెలలు మనందరికీ పండగే పండగ. ముఖ్యంగా పిండి వంటకాల్ని ఆస్వాదించే విషయంలో అస్సలు రాజీపడరు చాలామంది. ఈ క్రమంలో తమకు నచ్చిన స్వీట్స్, డీప్ ఫ్రై చేసిన పిండి వంటకాల్ని మనసారా ఆస్వాదిస్తుంటారు. ఇవి తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే అజీర్తి, కడుపు ఉబ్బరం.. వంటి సమస్యలు మొదలవుతాయంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. అందుకే ఈ సమయంలో నచ్చినవి మితంగా తీసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతేకాదు.. పండగ సీజన్లో ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ కూడా అందించారామె.
ఓవైపు పండగలు, మరోవైపు కరోనా.. ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆనందం కంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ముఖ్యం. ఈ క్రమంలో ఎవరింట్లో వాళ్లే పండగల్ని జరుపుకోవడంతో పాటు పండక్కి చేసుకునే పిండి వంటల్ని ఆరగించే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బయట పరిస్థితులు బాగోలేని ఇలాంటి సమయంలో ఏదైనా అనారోగ్యాలు తలెత్తితే రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి పండక్కి చేసుకునే పిండి వంటలు, స్వీట్స్.. వంటివి ఆరగించే క్రమంలో కొన్ని చిట్కాలు పాటించడం మంచిదని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. ఈ క్రమంలో ఓ వీడియోను సైతం ఇన్‌స్టాలో పోస్ట్ చేశారామె.
పండగ విందు మితిమీరకుండా..!
‘దసరా నవరాత్రులు, దీపావళి.. మనం ఎంతో వేడుకగా జరుపుకుంటాం. ఈ క్రమంలో వివిధ రకాల పిండి వంటలు, స్వీట్స్ కూడా తయారుచేసుకుంటాం. అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ.. తినే విషయంలో కొంతమంది అస్సలు రాజీ పడరు. నచ్చిన పదార్థాలు ఎక్కువ మొత్తంలో లాగించేయడం వల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం, తలనొప్పి.. వంటి అనారోగ్యాల బారిన పడుతుంటారు. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..! * ఏదైనా తినే ముందు కొన్ని నీళ్లు తాగడం వల్ల ఎక్కువ తినకుండా జాగ్రత్తపడచ్చు.. శరీరాన్నీ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. అలాగే రోజంతా కొన్ని కొన్ని నీళ్లు తాగుతూ ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో కాఫీ, శీతల పానీయాలు, కాక్టెయిల్స్.. వంటి వాటికి దూరంగా ఉండాలి. * అటూ ఇటూ తిరుగుతూ కాకుండా.. ఒక చోట కూర్చొని తినండి. అలాగని అన్నీ ఒకేసారి తినేయాలనుకోకుండా.. మీకు అరిగించుకునే శక్తి ఎంత ఉందో దాన్ని బట్టి మితంగానే ఆహారం తీసుకోవాలి.
 * సాధారణంగా పండగల సమయంలో ఆరగించే విందును ఏదైనా స్వీట్ లేదా ఐస్‌క్రీమ్, కేక్స్.. వంటి డిజర్ట్స్‌తో ముగించడం మనలో చాలామందికి అలవాటు. అయితే వీటిని బయటి నుంచి తెచ్చుకోవడం కాకుండా ఇంట్లోనే తయారుచేసుకోవాలి. ఈ క్రమంలో మూడు వెరైటీలను తయారుచేస్తే మూడింటినీ తినేయకండి.. అందులో మీకు బాగా నచ్చిన ఒక పదార్థాన్ని మాత్రమే తీసుకోండి. * ఇలా పండగ రోజు తీసుకున్న ఆహారం వల్ల మన శరీరంలో చేరిన విషతుల్యాలను మరుసటి రోజు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సాధారణ రోజు మామూలు రోజుల్లో మనం ఎలాగైతే ఆహారం తీసుకుంటామో ఈ రోజూ అలాగే తీసుకోవాలి. అలాకాకుండా పండగ రోజు కొన్ని పదార్థాలు మిగిలిపోయాయి కదా అవి తీసుకుందాం అనుకుంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం.. వంటి సమస్యలు తప్పవు! * ఒకవేళ పండగ రోజు తీసుకున్న పదార్థాల కారణంగా మరుసటి రోజు మీకు తలనొప్పిగా అనిపిస్తే నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు, ఆపై ఒక అరటిపండు తీసుకోవాలి. అదే అజీర్తి, కడుపు ఉబ్బరం.. వంటి సమస్యలుంటే గుల్కండ్ తీసుకోవాలి. * ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేయాలి. ఇందులోనూ మీరు రోజూ తీసుకునే సాధారణ అల్పాహారం తీసుకోవచ్చు. అది కూడా సులభంగా జీర్ణమయ్యేదై ఉండాలి.
 * ఆపై అరగంట సేపు తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అలాకాకుండా తీవ్రత ఎక్కువగా ఉండే వ్యాయామాలు చేసినా లేదంటే ఎక్కువ సేపు ఎక్సర్సైజ్ కొనసాగించినా శరీరంపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది.
|
సో.. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అటు పండగను ఎంజాయ్ చేయండి.. విందును ఆస్వాదించండి.. ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!
అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు!