రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి, పనులతో కలిగే అలసటను తీర్చుకోవడానికి, చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా ఉండడానికి.. ఇలా ప్రతి సందర్భంలోనూ టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. నిజానికి రోజుకు ఒకటి లేదా రెండు కప్పులైతే పర్లేదు కానీ కొంతమంది వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో వీటిలోని కెఫీన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే వీటికి బదులుగా హెర్బల్ టీ తాగడం మేలని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఆ కోవకు చెందిందే శంఖు పుష్పంతో చేసిన ఛాయ్ (బ్లూ టీ). ఇక ఈ టీతో ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలున్నాయని చెబుతోంది ఫిట్నెస్ ఫ్రీక్ అంకితా కొన్వర్. తాను ఈ బ్లూ టీ తాగుతోన్న ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. దాన్నెలా తయారు చేసుకోవాలి? ఇందులో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో సుదీర్ఘ పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది మిసెస్ సోమన్.
అంకితా కొన్వర్.. ఫిట్నెస్ గురూ మిలింద్ సోమన్ సతీమణిగానే కాకుండా.. ఫిట్నెస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాను చేసే వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే ఈ ఫిట్టెస్ట్ బ్యూటీ.. అప్పుడప్పుడూ ఆరోగ్య చిట్కాలను సైతం పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శంఖు పువ్వుతో టీ తయారీ, దానివల్ల చేకూరే ప్రయోజనాలేంటో ఇలా చెప్పుకొచ్చింది.
రుచి-ఆరోగ్యం.. అదుర్స్!
శంఖు పువ్వు/అపరాజిత పుష్పం/బ్లూ పీ.. ఇలా ఏ పేరుతో పిలిచినా దీంతో చేసిన టీ మాత్రం అమోఘం! ఇక ఇందులో కొద్దిగా నిమ్మరసం, అల్లం కలిపామంటే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు.. ఈ ఛాయ్ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. * జ్ఞాపకశక్తిని పెంచడంలో శంఖు పుష్పం టీ పెట్టింది పేరు! * ఒత్తిడి, ఆందోళనలు, కోపం, ఆస్తమా, జ్వరం, ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందీ టీ. * యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే ఈ ఛాయ్‌లో అసలు కెఫీన్ ఉండనే ఉండదు.. అయినా మనల్ని శారీరకంగా, మానసికంగా పునరుత్తేజితం చేయడంలో బ్లూ టీకి సాటి మరొకటి లేదు. * బరువు తగ్గాలనుకునే వారికీ ఈ ఛాయ్ మేలు చేస్తుంది. ఇందుకు దీనిలో ఉండే రసాయనిక సమ్మేళనాలు దోహదం చేస్తాయి. ఇవి జీవక్రియల్ని వేగవంతం చేసి శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు కరిగేందుకు ఉపకరిస్తాయి. * బ్లూ టీలో ఉండే ట్యానిన్లు మనం తీసుకున్న ఆహారం నుంచి ఐరన్ గ్రహించేలా శరీరాన్ని ప్రేరేపిస్తాయి. కాబట్టి భోజనానికి గంట ముందు లేదంటే గంట తర్వాత దీన్ని తీసుకోవచ్చు. అలాగే మట్టి గ్లాసుల్లో తీసుకుంటే దీనిలోని సుగుణాలు నశించిపోవని చెబుతున్నారు నిపుణులు. * బ్లూ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణశక్తిని పెంచడంలో దోహదం చేస్తాయి. * బీపీని అదుపులో ఉంచడానికి, నొప్పి నివారణిగా కూడా ఈ శంఖు పుష్పం టీ ఉపయోగపడుతుంది. * రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సైతం ఈ బ్లూ టీలో ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. * కంటి ఆరోగ్యానికి, మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాలతో పోరాడడానికి, గుండె ఆరోగ్యానికి.. ఇలా ఎన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగకరం. * ఆరోగ్యానికే కాదు అందానికీ ఈ బ్లూ టీ ఎంతో మంచిది. ముఖ్యంగా వయసు పైబడే ఛాయల్ని దూరం చేయడానికి, జుట్టు నెరిసిపోకుండా, రాలకుండా అడ్డుకునే గుణాలు సైతం ఈ టీలో పుష్కలంగా ఉన్నాయి.
|
బ్లూ టీ ఇలా తయారుచేద్దాం!

కావాల్సినవి * శంఖు పుష్పాలు - కప్పు * నీళ్లు - లీటర్ * తేనె - టేబుల్‌స్పూన్ * బ్రౌన్ షుగర్ - రెండు టేబుల్ స్పూన్లు * అల్లం ముక్కలు - టీస్పూన్ * నిమ్మరసం - టీస్పూన్ * సోడా - అరకప్పు తయారీ * ముందుగా శంఖు పుష్పాల కాడల్ని కట్ చేసి పువ్వుల్ని వేరు చేయాలి. వాటిని నీటితో చక్కగా శుభ్రం చేయాలి. * ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి కాసేపు మరిగించాలి. ఆపై స్టౌ కట్టేసి ఇందులో శంఖు పుష్పాలు, అల్లం ముక్కలు వేసి ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టేయాలి. * ఈలోపు మిశ్రమం కాస్త చల్లారుతుంది. ఇప్పుడు దీన్ని ఒక జార్లో వడకట్టుకొని ఆపై తేనె, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. * ఇలా తయారైన టీని ఒక కప్పులో పోసుకొని ఇందులో టీస్పూన్ నిమ్మరసం కలుపుకొని గోరువెచ్చగా తీసుకోవచ్చు. * లేదంటే చల్లగా తాగాలనుకునే వారు.. ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో కొన్ని ఐస్ ముక్కలు వేసి.. సగం వరకు వడకట్టుకున్న బ్లూ టీని పోయాలి. ఇందులో రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి.. మిగతా సగాన్ని సోడాతో నింపేయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే శంఖు పుష్పం టీని చల్లచల్లగా సర్వ్ చేసేసుకోవచ్చు.
|
గమనిక: శంఖు పుష్పంతో చేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి దుష్ప్రభావాలూ ఎదురుకావని చెబుతున్నారు నిపుణులు. అలాగని మరీ ఎక్కువగా తాగినా వికారం, విరేచనాలు తప్పవంటున్నారు. కాబట్టి ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అంతేకాదు.. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఈ టీ తాగాలనుకుంటే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి!