సీజన్‌తో సంబంధం లేకుండా దాదాపు సంవత్సరం పొడవునా లభించే.. అత్యంత పోషకభరితమైన ఆహార పదార్థం.. 'వేరుశెనగ'. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇవి తినడం వల్ల దగ్గొస్తుందేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ అది నిజం కాదు. వేరుశెనగ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు తగ్గి.. మంచి కొవ్వు పెరుగుతుంది. అలాగే శరీర అభివృద్ధిలో కూడా ఇవి తోడ్పడతాయి. మరి వీటివల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం...
* వేరుశెనగలో నియాసిన్, రైబోఫ్లేవిన్, థయమిన్, బి6, బి9.. వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు; కాపర్, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్, సెలీనియం, మాంగనీస్, పొటాషియం.. వంటి ఖనిజాలు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడతాయి.
* ఆకలిని అదుపులో ఉంచే ఆహార పదార్థాల్లో వేరుశెనగ కూడా ఒకటి. ఎవరైతే మాటిమాటికీ ఆహారం తిని లావవుతామనుకుంటారో వారు వేరుశెనగ గింజల్ని తినడం మంచిది. ఎందుకంటే ఇవి తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
* వేరుశెనగలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. తదితర పోషకాల వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
* మహిళలు గర్భం ధరించిన మొదట్లో వేరుశెనగను ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డ నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది.

* వేరుశెనగలో ఉండే పి-కౌమరికామ్లం శరీరంలో కార్సినోజెనిక్ న్యూట్రస్ అమైన్స్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఫలితంగా పొట్ట క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.
* క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడే ఫోలిక్ యాసిడ్, ఇతర పోషకాలు వేరుశెనగలో ఉంటాయి. అలాగే మహిళల్లో ఎవరైతే వారానికి రెండుసార్త్లెనా వేరుశెనగను తీసుకుంటారో.. వాళ్లలో కొలొనోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 58 శాతం తక్కువని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
* ఎప్పుడైతే శరీరంలో సెరటోనిన్ అనే రసాయనం స్థాయులు తగ్గిపోతాయో.. అప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతాం. దీన్ని మెదడులో ఎక్కువగా ఉత్పత్తి చేసే ట్రిప్టోఫాన్ వేరుశెనగలో అధికంగా లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వేరుశెనగను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
* వీటిలో ఉండే పాలీఫినోలిక్ యాంటీఆక్సిడెంట్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి. తద్వారా గుండెపోటు.. వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
* బరువు పెరగకుండా ఎప్పుడూ ఇలా నాజూగ్గానే ఉండాలనుందా? అయితే ప్రతిరోజూ ఉదయం బ్రెడ్‌తో పీనట్ బటర్‌ను తీసుకోండి. దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
* వేరుశెనగలో ఉండే ఓలియికామ్లం.. అనే మోనోఅన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లం గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయుల్ని రెట్టింపు చేస్తుంది.
* వీటిలో ఉండే మాంగనీస్ రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
* వేరుశెనగలో ఉండే అమైనో ఆమ్లాలు శరీర పెరుగుదలకు చాలా అవసరం.
చూశారుగా.. వేరుశెనగ కాయల్లో దాగున్న పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలేంటో.. కాబట్టి కనీసం ఇప్పటినుంచైనా ప్రతిరోజూ గుప్పెడు వేరుశెనగ పప్పులు తినడం అలవాటు చేసుకోండి.. అది ఆరోగ్యానికి చాలా మంచిది.