హారికకు ముందు నుంచీ ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య ఉంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటోన్న ఆమె డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతోంది. అయితే ఈ మధ్య అప్పుడప్పుడూ తనకు ఛాతీలో నొప్పి రావడం గమనించినా అది సాధారణమేనేమో అని తేలిగ్గా తీసుకుంటోంది.
హాసిని ఈ మధ్య క్రమంగా బరువు పెరుగుతోంది. చిరుతిండ్ల వల్లే అయి ఉంటుందని ఇన్ని రోజులూ కారణమేంటో తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేసింది. అయితే తన ఆహారపుటలవాట్లు మార్చుకున్నా ఫలితం లేకపోయే సరికి డాక్టర్ వద్ద చెకప్ చేయించుకుంటే పీసీఓఎస్ ఉందని నిర్ధారణ అయింది.
ఆరోగ్యం పట్ల అశ్రద్ధ, అనారోగ్యకరమైన జీవనశైలి.. చాలామంది మహిళల్లో ఇలాంటి ప్రత్యుత్పత్తి సమస్యలకు కారణమవుతున్నాయి. అయితే ఇవి కేవలం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైనే కాదు.. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. వాటిని సకాలంలో గుర్తించి సరైన వైద్యం తీసుకోకపోతే పలు గుండె జబ్బులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ‘వరల్డ్ హార్ట్ డే’ సందర్భంగా అసలు సంతానోత్పత్తి సమస్యలకు, గుండె ఆరోగ్యానికి సంబంధమేంటి? గుండెను పదిలంగా కాపాడుకోవాలంటే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి..

వయసు పైబడిన వారికి.. అందులోనూ మగవారికే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.. ఇది ఒకప్పటి మాట! కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు వెలుగు చూస్తున్నాయి. అందుకు కారణం అనారోగ్యకరమైన జీవనశైలే అని చెప్పడంలో సందేహం లేదు. కేవలం మగవారిలోనే కాదు.. ఆడవారిలోనూ ఇలాంటి సమస్యలొస్తున్నాయి. అందుకు మహిళల్లో తలెత్తే పలు ప్రత్యుత్పత్తి సమస్యలు కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు.

నెలసరికి-గుండె ఆరోగ్యానికి సంబంధమేంటి?
ప్రస్తుతం చాలామంది ఆడవారు ఎదుర్కొంటోన్న సమస్యల్లో ఇర్రెగ్యులర్ పిరియడ్స్ కూడా ఒకటి. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి-ఆందోళనలు.. వంటివన్నీ ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే దీని కారణంగా గర్భం ధరించడంలో సమస్యలు తలెత్తడం, బరువు పెరిగిపోవడం.. ఇలా ఇవన్నీ ఆడవారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. దీనికి తోడు సక్రమంగా నెలసరి రాకపోవడం వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఇదే విషయం గతంలో ఓ పరిశోధనలో కూడా వెల్లడైంది. నెలసరి సక్రమంగా రాకపోవడం వల్ల ఛాతీలో నొప్పి లేదా యాంజినా సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువట! యాంజినా అనేది ఛాతీలో తాత్కాలికంగా వచ్చే నొప్పి. గుండెకు రక్తప్రసరణ సరిగ్గా అందనప్పుడు ఈ నొప్పి వస్తుందట. తద్వారా ఛాతీ భాగంలో బరువుగా అనిపించడం, మంట పుట్టడం, రొమ్ము ఎముక దగ్గర ఒత్తిడిగా అనిపించడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అసౌకర్యం క్రమంగా భుజాలు, మెడ దాకా పాకచ్చు. అయితే ఇలా ఛాతీలో వచ్చే నొప్పి తాత్కాలికమే అయినప్పటికీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం హార్ట్ఎటాక్ వంటి గుండె జబ్బులకూ దారితీయచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే ఇర్రెగ్యులర్ పిరియడ్స్‌తో బాధపడే మహిళలు ఛాతీలో కాస్త నొప్పిగా అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

పీసీఓఎస్‌తో కూడా ప్రమాదమే!
మనం పాటించే ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా పీసీఓఎస్ బారిన పడే మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రతి 10 మందిలో ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చాప కింద నీరులా విస్తరిస్తోన్న పీసీఓఎస్ కారణంగా మహిళల శరీరంలో ఆండ్రోజెన్స్ (పురుష హార్మోన్ల) స్థాయులు పెరిగిపోతాయి. తద్వారా నెలసరి క్రమం తప్పడం, అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్.. వంటి సమస్యలన్నీ మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఈ అనారోగ్యాలు క్రమంగా గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీసే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు.. వంటి సమస్యలతో ముప్పు ఎక్కువగా ఉంటుందట! కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా మేరకు సరైన మందులు వాడుతూ పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు కూడా!

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నెలసరి సమస్యల్ని తగ్గించుకోవడం, పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటున్నారు నిపుణులు. * వ్యాయామం ఎలాంటి సమస్యకైనా విరుగుడుగా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 28 శాతం తక్కువని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే క్రమం తప్పకుండా వర్కవుట్‌ను రొటీన్లో భాగం చేసుకోవడం మంచిది. ఒకవేళ వ్యాయామానికి అంత సమయం కేటాయించే వీల్లేకపోతే రోజూ కనీసం పది వేల అడుగులు వేయడం, మెట్లెక్కడం, భోజనం తర్వాత కాసేపు నడవడం.. ఇలా శరీరానికి కాస్త శ్రమ కలిగించినా చక్కటి ఫలితం ఉంటుంది. * గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా కీలకమే. ఈ క్రమంలో మీ ఎత్తును బట్టి మీరు ఎంత బరువు (బీఎంఐ) ఉండాలో ముందుగా నిర్ధారించుకోవాలి. సాధారణంగా పెద్దవారిలో బీఎంఐ స్థాయులు 18.5 – 24.9 ఉండాలి. అదే 25.0 – 29.9 కంటే దాటినట్లయితే అధిక బరువుగా, అంతకంటే ఎక్కువ ఉంటే స్థూలకాయులుగా పరిగణిస్తారు. ఇలా మీ బీఎంఐ ఎంతో తెలుసుకొని.. మీరు బరువు పెరగాలా, తగ్గాలా, దానికోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలన్నీ నిపుణులను అడిగి తెలుసుకుంటే మంచిది. ఇలా బీఎంఐని అదుపులో ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం 32 శాతం తగ్గుతుందట!

* రక్తంలో చక్కెర స్థాయులు, బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల ఏమైనా హెచ్చుతగ్గులుంటే డాక్టర్ సలహా మేరకు వాటిని అదుపు చేసుకోవచ్చు. * చిరుతిండ్లు, నూనె సంబంధిత పదార్థాలంటే ఎవరికైనా ఇష్టమే! కానీ వాటిని అమితంగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగిపోయి తద్వారా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం లేదా వీటిని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిదంటున్నారు నిపుణులు. * ఇంటి నుంచి పనిచేసే వారైనా, ఇంట్లో ఖాళీగా కూర్చునే వారైనా.. శరీరానికి తగిన పని చెప్పకుండా గంటల తరబడి ఒకే దగ్గర కూర్చుండిపోతారు. ఇలాంటి వారిలో గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు గంటకోసారి కాస్త విరామం తీసుకొని అటూ ఇటూ తిరగడం, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నడుస్తూ మాట్లాడడం.. మీరు బిజీగా ఉన్నా ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల శరీరానికి కాస్త వ్యాయామం అందుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 * ఎరుపు, ఊదా, ఆకుపచ్చ, తెలుపు, పసుపు పచ్చ, నీలం.. వంటి రంగుల్లో ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. * మానసిక సమస్యలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి.
|
ఇలా మనం తీసుకునే జాగ్రత్తలన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు.. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, నెలసరి సమస్యలు, ఇతర అనారోగ్యాల నుంచి కూడా మనకు విముక్తి కలిగిస్తాయి. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని పాటిస్తే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.