మనం ఏం కూర చేసినా సరే.. అందులో కామన్‌గా వాడే పదార్థాలు కొన్నుంటాయి. వాటిలో ఉల్లిగడ్డ కూడా ఒకటి. 'ఉల్లి తల్లి లాంటిది..' అన్న సామెత మనకు తెలిసిందే. సామెతకు తగ్గట్లే తల్లిలాగా రక్షిస్తూ ఉల్లి మన శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతుంది. ఈ క్రమంలో ఉల్లి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం రండి..
* ఉల్లిని పచ్చిగా తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ, అలా తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా గుండె సురక్షితంగా ఉంటుంది. అలాగే దీనిలో అధిక మొత్తంలో ఉండే సల్ఫర్, పీచు, పొటాషియం, బి, సి విటమిన్ల వల్ల శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది.

* మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, నాడీవ్యవస్థ బలంగా తయారు కావాలన్నా.. ప్రతిరోజూ ఉల్లిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.
* ఉల్లిలో ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలో విటమిన్ సి పనితీరును మెరుగుపరుస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* రుతుచక్రంలో మీకేమైనా సమస్యలు వస్తున్నాయా?? అయితే నెలసరి ప్రారంభానికి కొన్ని రోజుల ముందు కొన్ని పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు తింటే ఆ సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయి.
* జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే రసాలను విడుదల చేయడంలో ఇది సహాయపడుతుంది.
* తేనెటీగలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో వాపు, విపరీతమైన నొప్పి, మంట ఏర్పడతాయి. దీనిపై ఉల్లిగడ్డ రసాన్ని పూస్తే ఈ సమస్యలన్నింటి నుంచీ ఉపశమనం కలుగుతుంది.
* ఉల్లిగడ్డలో ఉండే యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్.. మొదలైన గుణాల వల్ల శరీరంపై ఎలాంటి ఇన్ఫెక్షన్ల ప్రభావం ఉండదు.
* వీటిలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

* ఉల్లిగడ్డలో ఆరోగ్యానికెంతో అవసరమైన నీరు, ఖనిజాలు, క్యాల్షియం, స్టార్చ్, కొవ్వులు, ప్రొటీన్లు, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు.. మొదలైనవి ఉన్నాయి.
* దగ్గు, జలుబు వల్ల గొంతు పట్టేసిందా?? అయితే కొంచెం ఉల్లిగడ్డ రసంలో కాస్త తేనె వేసి కలుపుకొని తాగితే సమస్య దూరమవుతుంది.
* నిద్రలేమితో బాధపడుతున్నారా?? అయితే ప్రతిరోజూ ఆహారంలో ఉల్లిపాయను భాగం చేసుకోండి. రాత్రుళ్లు హాయిగా నిద్రపోండి.
* ఉల్లి ఎక్కువగా తినడం వల్ల లైంగికపరమైన కోరికలు కూడా పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.