నమస్తే డాక్టర్. నాకు పాప పుట్టి ఏడాది దాటింది. సహజ ప్రసవం కోసం ప్రయత్నించినా కాకపోయే సరికి సిజేరియన్ చేశారు. అయితే ఆ తర్వాత నాకు కటి వలయంలో నొప్పులు ఎక్కువగా వచ్చాయి. డాక్టర్ని సంప్రదిస్తే పరీక్షలు చేసి సమస్య లేదన్నారు. అయినా ఇప్పటికీ నొప్పులు తగ్గట్లేదు. పడుకున్నప్పుడు, పక్కలకు తిరిగినప్పుడు.. ఇలా భంగిమ మార్చినప్పుడల్లా తీవ్రమైన నొప్పి వేధిస్తోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఇదేమైనా సమస్యా? చెప్పండి. - ఓ సోదరి
జ: మీరు రాసిన సమస్య కొంతమందికి కాన్పు తర్వాత ఎదురవుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం సమయంలో ఎముకల మధ్య ఎడం కొద్దిగా ఎక్కువై.. ఆ ప్రభావం కండరాలు, లిగమెంట్లు, నరాల మీద పడి.. పడుకున్నప్పుడు, పక్కలకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ నొప్పి ముఖ్యంగా పొత్తి కడుపు కింద భాగంలో ఉన్న ప్యూబిక్ ఎముకల వద్ద కానీ లేదా సేక్రో-ఇలియక్ జాయింట్లో గానీ సహజంగా వస్తుంది. దీనికి ఒకసారి పరీక్షించి చూడాలి. ఒకవేళ ఎముకల మధ్య జాయింట్లో ఎడం కనుక ఎక్కువైతే దానికి ప్రత్యేకమైన చికిత్సలుంటాయి. ఇందుకోసం ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదిస్తే తగిన వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తారు. దాంతో కూడా సమస్య తగ్గకపోతే ఒక్కోసారి దూరమైన ఎముకల్ని దగ్గరికి చేర్చడానికి స్ట్రాపింగ్ పద్ధతిలో చికిత్స చేస్తారు.