'వాడిని చంపేయాలి.. అస్సలు నేనంటే లెక్కేలేదు..' అని తిట్టుకుంటూ ప్యాకెట్ల మీద ప్యాకెట్లు చిప్స్ ఖాళీ చేసేస్తోంది నా ఫ్రెండ్ మాధవి.. విషయమేంటా అని కనుక్కుంటే తన లవర్‌తో ఓ చిన్న గొడవ. ఆ తర్వాత నేను సర్దిచెప్పడం, తను ఫోను చేసి నార్మల్‌గా మాట్లాడటం జరిగిపోయాయనుకోండి.. కానీ మాధవికున్న ఓ అలవాటు తనని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఫీలైనప్పుడు ఏదోటి తింటూ ఉండటం తనకలవాటు..! మాధవిలాంటి వాళ్లు చాలామందే ఉండొచ్చు.. వీళ్లనే 'ఎమోషనల్ ఈటర్స్' అంటారట.. మూడ్ బాగోలేనప్పుడు ఏదోటి తింటూ ఉండటం వల్ల తొందరగా బరువు పెరిగిపోతారు. ఇలాంటి సందర్భాల్లో తినాలన్న కోరికను అదుపు చేసుకోవాలి. ఒకవేళ అది సాధ్యం కాదనుకున్నప్పుడు జంక్‌ఫుడ్ జోలికి పోకుండా, మన మూడ్ మారడంతో పాటు, ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాన్ని తీసుకోవాలి.
ఎమోషనల్ ఈటర్స్.. ముందు మూడ్ బాగోలేక ఎక్కువగా తినేస్తారు.. తర్వాత 'అరె.. ఇంత తినేశామా? ఎన్ని క్యాలరీలు వచ్చి ఉంటాయో..' అంటూ తెగ బాధపడిపోతారు. అందుకే ఇలాంటి వాళ్లు తమ దగ్గర ఎప్పుడూ పోషకాలందించే ఆహారాన్ని ఉంచుకుంటే క్యాలరీలు పెరుగుతాయని, బరువు పెరుగుతామని బాధపడకుండా ఉండచ్చు.. మరి అలాంటి ఆహారమేంటో చూద్దామా?

డ్రైఫ్రూట్స్
మెదడు మీద ఒత్తిడి కలిగినప్పుడే ఎమోషనల్ ఈటింగ్ అలవాటవుతుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడిని తగ్గించే ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే ఇలాంటి సమయంలో క్యాలరీలు పెరిగినా, మన శరీరానికి ఉపయోగపడే ఆహారం తీసుకుంటే మంచిది. మరి, డ్రైఫ్రూట్స్‌కి మించి ఎక్కువ పోషకాలందించే ఆహారం ఏముంటుంది చెప్పండి..? అందుకే డ్రైఫ్రూట్స్‌ని తీసుకోండి.

డార్క్ చాక్లెట్
బాగా ఒత్తిడిగా ఫీలైనప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడిని తగ్గించే గుణాలు డార్క్ చాక్లెట్లో ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది కూడా.. ఇకమీద మీకు మూడ్ బాగోలేనప్పుడు ఓ చిన్న డార్క్ చాక్లెట్ ముక్క నోట్లో వేసుకొని చప్పరించేయండి. ఇక మీ ఒత్తిడి పరార్..!
గ్రీన్ టీ
కోపంగా ఉన్నప్పుడు, లేదా వేరే ఆలోచనల నుంచి మనసు మళ్లించి, ఒత్తిడిని తగ్గించుకోవాలనుకున్నప్పుడు గ్రీన్ టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి మంచివి కూడా.. అందుకే ఈసారి మూడీగా అనిపిస్తే గ్రీన్ టీ ట్రై చేయండి.

అరటి పండు
మూడీగా ఉన్నప్పుడు అరటి పండు తినడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇందులో ఉన్న మెగ్నీషియం మన మూడ్‌ని సరిచేస్తుంది. పొటాషియం శక్తిని అందిస్తుంది. అందుకే అరటి పండును తీసుకోవడం వల్ల వెంటనే మూడ్ మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల విటమిన్ బి6 కూడా అందుతుంది.

కాఫీ
మూడీగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ కప్పు కాఫీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్న విషయం మనకు అనుభవం లోనిదే. ఇందులోని కెఫీన్ మన మెదడు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వెంటనే మూడ్ మారుతుంది.
పాలు
రాత్రి పడుకోబోయే ముందు పాలు ఎందుకు తాగమంటారో మీకు తెలుసా? వాటి వల్ల మన ఒత్తిళ్లన్నీ మర్చిపోయి హ్యాపీగా నిద్రపోగలుగుతాం కాబట్టి.. అందుకే మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడు ఓ గ్లాసు వేడి వేడి పాలు తాగేయండి.. అంతే మీ ఒత్తిడి మాయం!

బెర్రీలు
బెర్రీల్లో ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా ఏ బెర్రీ తీసుకున్నా అందులో అనేక పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తీసుకున్నప్పుడు మూడ్ కూడా మారుతుంది. అందుకే బాగా ఒత్తిడికి లోనైనప్పుడు రెండుమూడు బెర్రీలను తీసుకోండి.
ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి
ఒత్తిడిని తగ్గించడానికి విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ చాలా ఉపయోగపడతాయి. అందుకే విటమిన్ సి ఎక్కువగా లభించే నిమ్మజాతి పండ్లు, ఉసిరి లాంటివి.. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా దొరికే సాల్మన్ చేప, ఆయిస్టర్ లాంటివి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన మూడ్ ఎప్పుడూ బాగుంటుంది.
మూడ్ బాగోలేనప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమన్నారు కదా.. అని మరీ ఎక్కువగా తినేయద్దు.. ముందు ఎమోషనల్ ఈటింగ్ని తగ్గించుకోవడానికి డాక్టర్ని సంప్రదించి వాళ్ల సూచనలు పాటించండి. అయినా ఈ అలవాటు తగ్గించుకోవడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి, ఆ కొద్ది కాలం పాటు ఇలాంటి ఆరోగ్యకరమైన పదార్థాలను మీ వెంట ఉంచుకుంటే మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు..