రోజువారీ పనుల వల్ల కలిగే ఒత్తిడి, అలసట కారణంగా ఒక్కోసారి మన శరీరంలోని శక్తిస్థాయులు తగ్గిపోతూ ఉంటాయి. ఉత్సాహం కూడా కొరవడుతుంటుంది. ఫలితంగా మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. వీటి కారణంగా మానసిక ప్రశాంతతకు దూరం కావడమే కాకుండా మన ఆరోగ్యానికి సైతం నష్టం వాటిల్లే అవకాశాలుంటాయి. కాబట్టి ఒత్తిడి నుంచి ఎప్పటికప్పుడు విముక్తి పొందుతూ.. ఉత్సాహాన్ని పునరుత్తేజింపజేసుకోవాలి. మరి, ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..
మానసికంగా తీవ్రఒత్తిడి అలుముకున్నా.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనలోని శక్తిస్థాయులతో పాటు ఉత్సాహం కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితులు దీర్ఘకాలం పాటు కొనసాగితే మనకి తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్లిపోయే ఆస్కారం ఉంటుంది. ఒత్తిడిని దూరంగా ఉంచి.. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే.. కొన్ని అలవాట్లు చేసుకోవడం తప్పనిసరి..

ఈత కొట్టడం..
ఈత కొట్టడం వల్ల శరీరానికి చక్కని వ్యాయామం అందడమే కాదు.. మానసికంగా ఉన్న అలసట, ఒత్తిడి కూడా దూరమై ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫలితంగా నూతనోత్సాహంతో పని చేసుకోవచ్చు. ఒకవేళ స్విమ్మింగ్ చేయడం కుదరని పక్షంలో టబ్‌బాత్ చేసినా మంచిదే. ఇందుకోసం మంచి సువాసన కలిగిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ని ఉపయోగిస్తే ఇంకా మంచిది. మనసుపై ఇవి మంత్రంలా పని చేసి ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. లేదా బాగా ఒత్తిడి అనిపించినప్పుడు వెంటనే ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగి, కాసేపు నిదానంగా, ప్రశాంతంగా కూర్చోండి. తప్పకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
డ్యాన్స్ చేయండి..
మీకు డ్యాన్స్ చేయడం అంటే ఇష్టమా?? అయితే రోజూ నచ్చిన పాట పెట్టుకొని కాసేపు డ్యాన్స్ చేసినా చాలు.. ఒత్తిడి ఉఫ్.. అంటూ ఎగిరిపోవడమే కాదు.. నూతనోత్సాహం కూడా మీ సొంతమవుతుంది. డ్యాన్స్ మనసులో ఉన్న ఆలోచనలకు ఫుల్స్టాప్ పెట్టి తిరిగి తాజా అనుభూతి కలిగేలా చేస్తుంది. అయితే ఇందుకు ప్రత్యేకించి ఫలానా నృత్యరీతే చేయాలనే రూలేం లేదు. జానపదం, భరతనాట్యం, కూచిపూడి, వెస్ట్రన్.. వంటివే కాకుండా జుంబా, సాల్సా వంటివి కూడా ప్రయత్నించవచ్చు. ఇవి ఓవైపు శరీరానికి వ్యాయామం అందిస్తూనే మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.

వీటికి దూరంగా..
ఓ రకంగా చూసుకుంటే మనకు ఎదురయ్యే ఒత్తిడి, అలసటకు సామాజిక మాధ్యమాలు, గ్యాడ్జెట్లు కూడా కారణమే. అందుకే వాటికి దూరంగా ఉండడం ద్వారా కూడా ఒత్తిడిని తగ్గించుకొని పునరుత్తేజం పొందవచ్చు. వారంలో ఒకటి లేదా రెండు రోజులు (మీ పనికి అనుగుణంగా) డిజిటల్ డీటాక్సిఫికేషన్ డేస్‌గా పెట్టుకొని గ్యాడ్జెట్స్‌కి పూర్తిగా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ సమయాన్ని మీ సన్నిహితులతో గడపండి. ఇలా చేయడం ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉన్న సంబంధబాంధవ్యాలు మరింత బలపడడమే కాకుండా సమయాన్ని కూడా వీలైనంత ప్రశాంతంగా గడపవచ్చు.
ఇలాంటి వ్యక్తులకు దూరంగా..
మనం ఎంత సానూకులంగా స్పందిస్తున్నా.. మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు ఎప్పుడూ మన గురించి ప్రతికూలంగానే ఆలోచిస్తూ ఉంటారు. మీకు తెలిసిన వ్యక్తుల్లో కూడా ఈ తరహా మనస్తత్వం ఉన్నవారు ఉంటే వెంటనే వారి నుంచి దూరంగా జరగండి. ముఖ్యంగా ఆ వ్యక్తులు మానసికంగా మిమ్మల్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే ఇలా ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే వారి పక్కనే ఉంటే మన ఆలోచనాధోరణి కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల పెద్దగా లాభమేమీ ఉండదు సరికదా మన మెదడుపై ఒత్తిడి పెరిగిపోతుంది.
ఇవి కూడా..

* నచ్చిన పాటలు వినడం, సంగీత వాయిద్యాలు వాయించడం * యోగా, ధ్యానం చేయడం.. * పరిమళద్రవ్యాల వాసన చూడడం * ఫన్నీగా ఉండే సినిమాలు, వీడియోలు ఎక్కువగా చూడడం, పుస్తకాలు చదవడం.. * నచ్చిన పెంపుడు జంతువులతో సమయం గడపడం * తాజా పండ్లు.. ముఖ్యంగా అరటిపండు తినడం.. (ఇందులో ఉండే మంచి కొవ్వులు మూడ్ బాగుండేలా చేస్తాయి) * స్నేహితులతో కలిసి టూర్స్‌కి వెళ్లడం.. మొదలైన చిట్కాలు పాటించడం ద్వారా అలసట, ఒత్తిడిని తరిమికొట్టి మానసిక ప్రశాంతత సొంతం చేసుకోవచ్చు..
|