ఏం తినాలి?

విటమిన్-బి లోపం లేకుండా!
మన శరీరంలో ‘బి’ విటమిన్ లోపం కూడా పీసీఓఎస్‌కు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ సమస్యతో బాధపడే మహిళల్లో దాదాపు 80 శాతం మందిలో విటమిన్-బి లోపం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. దీనివల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, స్థూలకాయం, అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరిగిపోవడం, గర్భం ధరించడంలో ఆటంకాలు ఎదురవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో విటమిన్-బి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో ఆకుకూరలు, చేపలు, గుడ్లు.. వంటివి తప్పకుండా తీసుకోవాలి. తద్వారా సమస్యను అదుపులో ఉంచుకోవడంతో పాటు బరువు కూడా క్రమంగా తగ్గచ్చు.
 ‘కొవ్వులూ’ మంచివే! కొవ్వులు అనగానే చాలామందిలో నెగెటివ్ భావనే ఉంటుంది! అవి శరీరానికి హాని చేయడంతో పాటు బరువు పెరిగేలా చేస్తాయని చాలామంది అభిప్రాయం. కానీ కొవ్వుల్లో మంచి కొవ్వులు కూడా ఉన్నాయి. వీటిలో ఉండే అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు హార్మోన్లను సమతులం చేయడానికి, తద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అలాగే అండం ఉత్పత్తిని తగ్గించే ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రభావం శరీరంపై పడకుండా, గర్భాశయానికి రక్తప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తాయి. అంతేకాదు.. పీసీఓఎస్ వల్ల క్రమం తప్పిన నెలసరిని మళ్లీ గాడిలో పెట్టడానికీ ఈ మంచి కొవ్వులు సహకరిస్తాయి. కాబట్టి అవకాడో, ఛీజ్, డార్క్ చాక్లెట్, కోడిగుడ్లు, చేపలు, నట్స్, ఆలివ్ నూనె.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల్ని కొన్ని రోజుల్లోనే గుర్తించచ్చు.
 యాంటీ ఆక్సిడెంట్లతో బ్యాలన్స్ చేయండి! పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ (శరీరంలో ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అదుపు తప్పడం) స్థాయులు అధికంగా ఉంటాయి. తద్వారా దీని ప్రభావం కణజాలాలపై పడుతుంది. కాబట్టి దీన్ని అదుపులో ఉంచుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో బెర్రీ పండ్లు (స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్బెర్రీ, గోజీ బెర్రీ), డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ, ఆకుకూరలు, బీన్స్.. వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. అయితే ఈ ఆహార పదార్థాల్లోనూ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవే ఎంచుకోవాలి. లేదంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారం రక్తంలో చక్కెర స్థాయుల్ని పెంచుతుంది. అది మధుమేహానికి దారితీస్తుంది.
 అందుకే ‘పీచు’ ఎక్కువగా! సాధారణ మహిళలతో పోల్చితే పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళలు టైప్-2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం నాలుగు రెట్లు అధికమని పలు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి రక్తంలో ఇన్సులిన్ స్థాయులు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇందుకోసం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పదార్థాలతో పాటు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఓట్స్, బీన్స్, నట్స్, డ్రైఫ్రూట్స్, పప్పులు.. వంటివి మనం రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి.
|