హాయ్ మేడం. నా వయసు 31. మెన్స్ట్రువల్ కప్ వాడచ్చా? ఒకవేళ వాడితే ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఓ సోదరి
జ: మెన్స్ట్రువల్ కప్ అనేది ఏ వయసులో ఉన్న వారైనా వాడచ్చు. సిలికాన్తో కానీ లేదా లేటెక్స్తో గానీ చేసిన కప్పుల్ని వెజైనా లోపల ఎవరికి వారే అమర్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని వాడడం వల్ల బ్లడ్ బయటికి లీక్ కాకుండా, దుస్తులు పాడవకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే సైజు కప్పు సరిపోదు కాబట్టి సరైన సైజు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఎనిమిది గంటలకోసారి దాన్ని బయటికి తీసి, ఖాళీ చేసి, శుభ్రం చేసి, తిరిగి మళ్లీ లోపల అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల కొంతమందికి అలర్జీ, దురద, మంట.. వంటి లక్షణాలు కనపడచ్చు. ఇలాంటప్పుడు దీని వాడకం ఆపేయాలి. ఇక వెజైనా లోపల అమర్చుకునేటప్పుడు అది తేలిగ్గా లోపలికి వెళ్లడానికి లూబ్రికెంట్ వాడితే మంచిది. లేకపోతే బలవంతంగా చొప్పించే ప్రయత్నం చేసినట్లయితే వెజైనా గోడలు చీరుకుపోయి, రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంది.