ఈ రోజుల్లో ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తే చాలు.. మన మనసంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. మనకూ వైరస్ సోకిందేమోనని కంగారు పడిపోతున్నాం. ఇక ఎలాంటి లక్షణాలు లేని వారిలో కూడా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఎవరి నుంచి ముప్పు ముంచుకొస్తుందో, మనలోనూ కరోనా వైరస్ ఉందేమోనని క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. ఇదిగో ఇలాంటి భయమే మనల్ని నిలువెల్లా ముంచుతుందంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి. కొద్దిరోజుల క్రితమే కొవిడ్ బారిన పడి కోలుకున్న ఆమె.. చక్కటి ఆహారం, వ్యాయామం, ధ్యానంతో ఈ వైరస్‌ను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనలోని రోగనిరోధక శక్తే కరోనాను ఎదిరించే ఆయుధమని, దాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు ధైర్యంగా అడుగు ముందుకేయాలంటూ సూచిస్తున్నారు. ఈ క్రమంలో తన కొవిడ్ అనుభవాలను, దాన్నుంచి బయటపడిన విధానాన్ని ఇన్‌స్టా వీడియోతో పాటు దానికి జతచేసిన సుదీర్ఘమైన క్యాప్షన్ రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో, పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
శిల్పా రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన ఆమె ప్రముఖ మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. ‘శిల్పారెడ్డి స్టూడియో’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్‌ని ప్రారంభించిన ఆమె తాను రూపొందించిన దుస్తుల్ని విభిన్న ఫ్యాషన్ వేదికలపై ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు.. సమంత, మంచు లక్ష్మి, శ్రియ, తాప్సీ, రెజీనా.. వంటి పలువురు తారలకు స్టైలిష్ దుస్తుల్ని రూపొందిస్తూ భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను, తాను రూపొందించిన దుస్తులను, చేసే వర్కవుట్లను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటూ అనుక్షణం తన ఫ్యాన్స్‌కు చేరువలోనే ఉంటారు శిల్ప. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా వణికిస్తోన్న కొవిడ్ తననూ వదల్లేదని, ఆరోగ్యకరమైన జీవన విధానం, ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని జయించానని చెబుతూ రూపొందించిన ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ ఫ్యాషనర్.
ఆ భయాన్ని వీడండి!
కరోనా మహమ్మారితో పోరాడాలంటే మనలో రోగనిరోధక శక్తి దృఢంగా ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే అనుక్షణం ఈ మహమ్మారినే తలచుకుంటూ భయపడడం వల్ల మన ఇమ్యూనిటీని మనమే దెబ్బతీసుకుంటున్నామని అంటున్నారు శిల్ప. ఇటీవలే తాను కొవిడ్ బారిన పడ్డానని, అయినా గుండె నిండా ధైర్యంతో, చక్కటి లైఫ్‌స్టైల్‌తో దాన్ని ఇట్టే జయించగలిగానని, అందరూ అలాంటి ధైర్యాన్ని కూడగట్టుకొని కొవిడ్‌తో పోరాటం చేయాలని సూచిస్తూ ఓ స్ఫూర్తిదాయక సందేశంతో కూడిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ ఫ్యాషన్ డిజైనర్.
ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా..
‘నగరంలో, రాష్ట్రంలో రోజురోజుకీ కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి గురించి అందరిలో ఏదో తెలియని భయం నెలకొంది. కొద్ది రోజుల క్రితమే నా స్నేహితురాలు ఒకరు మా ఇంటికొచ్చారు. అంతలోనే తనకు అనారోగ్యంగా ఉందని వెంటనే వెళ్లిపోయారు. ఐదు రోజుల తర్వాత తన కుటుంబంలోని ఒకరికి కరోనా సోకిందని తెలిసింది. వెంటనే మా కుటుంబ సభ్యులంతా కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందులో నాకు, నా భర్తకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే మాలో ఎలాంటి లక్షణాలు లేవు. ముఖ్యంగా తలనొప్పి, జ్వరం, నీరసం, ఒంటినొప్పులు, దగ్గు, జలుబు.. ఇలాంటి కరోనా లక్షణాలేవీ మాలో మచ్చుకు కూడా కనిపించలేదు. అయినా మాకు కరోనా నిర్ధారణ అయిందని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాం.
రోగనిరోధక శక్తే ఆయుధం!
ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎవరికైనా తలెత్తవచ్చు. మరి, దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే మనలోని రోగనిరోధక శక్తి బలంగా ఉండడం చాలా ముఖ్యం. ఇమ్యూనిటీ దృఢంగా ఉన్న వారు ఇలాంటి వైరస్‌లను సులభంగా ఎదుర్కోగలరని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అందుకే ఈ మహమ్మారి పట్ల ఎవరూ భయపడకుండా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వ్యాయామం, ధ్యానం.. మొదలైనవాటిని తమ రోజువారీ లైఫ్స్టైల్లో భాగం చేసుకోవాలి. మనం ఎంత భయపడితే మనలో రోగనిరోధక వ్యవస్థ అంతలా క్షీణిస్తుంది. కాబట్టి ఇటు శారీరకంగా, అటు మానసికంగా దృఢంగా తయారుకావాలి. అలాగే తగినన్ని నీళ్లు తాగాలి. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. శరీరానికి శక్తిని అందించే పోషకాహారం తీసుకోవాలి.
పాజిటివ్ వచ్చినా...
మన జీవితంలో మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటికి వెరవకుండా మనం వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే అందుకు మనం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత కూడా సాధారణ లైఫ్‌స్టైల్‌ని కొనసాగించాను.. ఈ క్రమంలో రోజూ వ్యాయామం చేశాను.. చక్కటి ఆహారం తీసుకున్నాను.. హాయిగా నిద్ర పోయాను. కాబట్టి మీరు కూడా కరోనా సోకిందని, సోకుతుందేమోనని అనవసరంగా ఆందోళన చెందకుండా దాన్ని సమర్థంగా ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని కూడగట్టుకోండి.. ఇంకా మీకేమైనా సందేహాలున్నా, సలహాలు కావాలన్నా నన్ను అడగచ్చు..’ అంటూ అటు తన కరోనా అనుభవాలను పంచుకుంటూనే, ఇటు అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది శిల్ప.
ఈ జాగ్రత్తలు మీకోసమే!
అంతేకాదు.. ఈ మహమ్మారి గురించి తనకు తెలిసిన విషయాలు, దీన్ని ఎదుర్కొనే క్రమంలో తాను పాటించిన నియమాలను ఈ వీడియోతో పాటు ఓ సుదీర్ఘమైన పోస్ట్ రూపంలో రాసుకొచ్చిందీ ఫ్యాషనర్. కరోనా - తీసుకోవాల్సిన జాగ్రత్తలు * రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 1000 మిల్లీ గ్రాముల విటమిన్ ‘సి’, 50 మిల్లీగ్రాముల జింక్‌తో పాటు ప్రొబయోటిక్ క్యాప్స్యూల్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే దీనికి వైద్యుల సలహా తప్పనిసరి. * అలాగే మన శరీరంలో విటమిన్ ‘డి’ లోపం లేకుండా చూసుకోవాలి. ఈ క్రమంలో రోజూ ఉదయం కాసేపు లేలేత ఎండలో నిల్చోవాలి. అలాగే గోరువెచ్చటి లేదంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచిన నీటిలో పుదీనా ఆకులు లేదంటే తులసి ఆకులు, కాస్త పసుపు వేసుకొని తాగాలి. ఈ పానీయం వల్ల గొంతు శుభ్రపడుతుంది. *చల్లటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. నీటిలో పసుపు, కొన్ని మిరియాలు వేసుకొని మరిగించుకొని గోరువెచ్చగా అయ్యాక తీసుకోవాలి. * ముక్కు, గొంతును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. * నిద్ర లేచాక, పడుకునే ముందు ఆవిరి పట్టాలి. రోజూ 20-25 సార్లు ముక్కుతో, మరో 20-25 సార్లు నోటితో గట్టిగా గాలి పీల్చి వదలాలి. * క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. (కొత్తగా వ్యాయామం మొదలుపెట్టే వారి కోసం యూట్యూబ్‌లో బోలెడన్ని ఎక్సర్సైజ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి.) * రోజూ 10 నిమిషాలు ప్రాణాయామం చేయాలి. ఇలాంటి సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో బోలెడన్ని ఉన్నాయి. * ధ్యానం చాలా ముఖ్యం. ఈ క్రమంలో యూట్యూబ్‌లో లభించే ఇషా క్రియా, చిత్ శక్తి వంటి గైడెడ్ మెడిటేషన్ వీడియోలు ఫాలో కావచ్చు. నేనూ వీటిని ప్రయత్నించాను. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజుకు రెండుసార్లు సింహ క్రియ సాధన చేయాలి. * నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. అలాగే ఇంట్లో వండిన పదార్థాలే తీసుకోవాలి. అది కూడా తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. * చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. * వేళకు పడుకోవాలి.. ఉదయాన్నే నిద్ర లేవాలి. * వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎదురయ్యే దగ్గు, జలుబు వంటివి దూరం చేసుకోవడానికి డాక్టర్ల సలహా మేరకు ఫ్లూ షాట్స్ తీసుకోవాలి. * INFLUVAC వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అయితే ఇందులోనూ పిల్లలకు, పెద్దలకు వేర్వేరు డోసులుంటాయి. ఎవరైనా సరే.. మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది. * 5 వెల్లుల్లి రెబ్బలు, 8 లవంగాలు, 15 తులసి ఆకులు, టీస్పూన్ వాము, 5 పుదీనా ఆకులు, 10 మిరియాలు.. వీటన్నింటినీ కలిపి మరిగించుకొని కషాయంలా తయారుచేసుకోవాలి. దీన్ని రోజూ తీసుకోవాలి.
|
ఇలా కరోనా గురించి తనకు తెలిసిన విషయాలను, ఈ మహమ్మారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సుదీర్ఘమైన క్యాప్షన్ రూపంలో రాసుకొచ్చిందీ ఫ్యాషనర్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీరు చెప్పింది విన్న తర్వాత మాలో ఉన్న భయం పోయి ధైర్యం వచ్చింది.. ఈ విషయాలన్నీ మాకెంతో ఉపయోగపడతాయి.. థ్యాంక్యూ..!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరి, మనమూ ఈ ఫ్యాషనర్ చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకుందాం.. కొవిడ్ బారిన పడతామేమో అని అనవసరంగా భయపడి మనలో ఉన్న ఇమ్యూనిటీని తగ్గించుకోకుండా.. ధైర్యంగా అడుగు ముందుకేద్దాం..! కరోనా కోరలు పెకిలించి వేద్దాం.. ఏమంటారు?